May 02,2021 19:37

మధ్యప్రదేశ్‌లోని భూపాల్‌కి చెందిన జావెద్‌ ఖాన్‌ తన భార్య మెడలోని నగలను అమ్మాడు. ఆ వచ్చిన డబ్బుతో ఆటోను కొనుగోలు చేసి, అందులో ఆక్సిజన్‌ సిలెండర్‌ బిగించాడు. వీధి వీధి తిరుగుతూ రోగుల ఊపిరి నిలుపుతున్నాడు. తన ఆప్తులను కాపాడినందుకు జావెద్‌కి డబ్బులు ఇవ్వబోతుంటే 'డబ్బుల కోసం ఆక్సిజన్‌ ఇవ్వలేదని' సమాధానం ఇస్తున్నాడు. సమాజంలో ప్రస్తుతం నెలకొన్న కష్టాల నుంచి ప్రజలకు తన వంతు సహాయం చేసేందుకు ఈ ఉచిత ఆటో మొబైల్‌ ఏర్పాటు చేశాడు. ప్రయాణీకులకు ఆటోలో ఆక్సిజన్‌తో పాటు శానిటైజర్‌, ఔషధాలు కూడా అందుబాటులో ఉంచాడు. కేవలం ఈ ఆటోలో కరోనాతో బాధపడుతున్న రోగులను ఆసుపత్రులకు చేర్చేందుకు ఉపయోగిస్తున్నాడు. అంబులెన్స్‌లు లేక చాలా మంది రోగులు ఇబ్బందులు పడటం టీవీల్లోనూ, ఫేస్‌బుక్‌లో చూడటం చూసి తనకు దు:ఖం వేసింది. వారికి ఏదైనా చేయాలన్న ఉద్దేశంతో తన భార్యకు ఉన్న బంగారం లాకెట్‌ను అమ్మి ఈ ఉచిత ఆటో మొబైల్‌ను ఏర్పాటు చేశాడు. సిలెండర్‌లో ఆక్సిజన్‌ నింపడం కోసం స్థానిక పరిశ్రమ వద్ద రోజులో ఐదారు గంటల పాటు ఎండలో క్యూలైన్‌లో నిలబడుతున్నాడు. రూ. 500 ఖర్చు పెట్టి ఆక్సిజన్‌ కొనుగోలు చేస్తున్నాడు. 20 రోజుల్లో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న తొమ్మిది మందికి తన ఆటోలో ఆక్సిజన్‌ అందించి ఆసుపత్రికి సకాలంలో చేర్చాడు. ప్రస్తుతం కరోనా ఉందని తెలిస్తే కుటుంబసభ్యులు గానీ బంధువులు గానీ దగ్గరికి రావడానికి భయపడే పరిస్థితుల్లో జావెద్‌ చేస్తున్న ఈ సేవకి పలువురు అభినందిస్తున్నారు.