
ప్రజాశక్తి -అమలాపురం
ఉపాధ్యాయులు తమ కోర్కెలు నెరవేర్చుకోవడానికి కాళ్లు పట్టడం నేర్చుకోవాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలను ఎంఎల్సి ఐవి ఖండించారు. విజయవాడ నుంచి బుధవారం రాత్రి అమలాపురం చేరుకుని నిరసన జాగరణలో పాల్గొని ఎంఎల్సి ఐవి మాట్లాడూతూ ఉపాధ్యాయులు కాళ్లు పట్టుకుని కాకుండా, ఉద్యమాలు, పోరాటాల ద్వారా తమ న్యాయమైన కోర్కెల ఎలా సాధించుకోవాలో తెలుసునని అన్నారు. రాజకీయ నాయకులు కాళ్లు పట్టుకోవడం ద్వారానే ఉన్నత పదవులు పొందుతారేమోగాని ఉపాధ్యాయులకు ఆ అవసరం లేదన్నారు. విజయవాడలో యుటిఎఫ్, ఎంఎల్సిలు ఉపాధ్యాయుల అరెస్టులకు నిరసనగా జిల్లా శాఖ ఆధ్వర్యంలో స్థానిక గడియార స్తంభం సెంటర్ వద్ద సాయంత్రం 5 నుంచి రాత్రి 12 గంటల వరకు నిరసన జాగరణ ప్రారంభించారు. దీనికి యుటిఎఫ్ జిల్లా కార్యదర్శులు పి.మురుగేశ్వరరావు, బి.చంద్రకళ, పివి.విశ్వప్రసాద్ సారథ్యం వహించారు. అమలాపురం సమీప మండలాల నుండి సుమారు రెండు వందల మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నాయకులు కె.సత్యనారాయణ డి.శ్రీరామ్మూర్తి, ఎం.వేంకటేశ్వర రావు, ఆర్. రామారావు తదితరులు మాట్లాడారు. ఈ నిరసన శిబిరానికి మద్దతుగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు కారెం వెంకటేశ్వరరావు మెడికల్ రీప్స్ అసోసియేషన్ నాయకులు ఎమ్.శ్రీనివాసరావు ఎస్ఎన్వి.పోలేశ్వరరావులు పాల్గొన్నారు. ముమ్మిడివరం విజయవాడలో ధర్నాని ప్రభుత్వం పోలీసులతో భగం చేయడాన్ని నిరశిస్తూ యుటిఎఫ్ ఆధ్వర్యంలో ముమ్మిడివరం హైస్కూల్ సెంటర్లో ఉపాధ్యాయుల ఆందోళన చేశారు. కార్యక్రమంలో యుటిఎఫ్ నాయకులు జె.సత్యనారాయణ, కె.రాము, సిఐటియు నాయకులు టి.దుర్గ ప్రసాద్, సఖిలే సూర్యా నారాయణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మండపేట విజయవాడలో ధర్నా చేసేందుకు వెళ్లిన యుటియఫ్, పిడిఎఫ్ ఎంఎల్సిలు, ఉపాధ్యాయులను అరెస్టు చేయడం అప్రజాస్వామని సిఐటియు జిల్లా కార్యదర్శి కె.కృష్ణవేణి, యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శులు డి.వి.రాఘవులు, కె.గోపాలకృష్ణ రెడ్డి అన్నారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద బుధవారం సాయంత్రం ఐదు నుంచి రాత్రి 12 గంటల వరకు ఉపాధ్యాయుల అరెస్టులకు నిరసనగా సిఐటియు, యుటిఎఫ్ ఆధ్వర్యంలో నిరసన జాగరణ కార్యక్రమం చేపట్టారు. అరెస్టు అయిన ఉపాధ్యాయులను వెంటనే విడుదల చేయాలని కోరారు. నూతన విద్యా విధాన్ని రద్దు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మండపేట పట్టణ, మండల, కపిలేశ్వరపురం మండలాల యుటిఎఫ్ శాఖల అధ్యక్ష, కార్యదర్శ, సభ్యులు పాల్గొన్నారు. రాజోలు విజయవాడలో ఉపాధ్యాయుల అక్రమ అరెస్టులకు నిరసనగా బుధవారం ఉపాద్యాయులు రాజోలులో కొవ్వొత్తులతో నిరసన వ్యక్తం చేశారు. రాజోలు మండల రిసోర్స్ సెంటర్ నుండి పాదయాత్రగా గాంధీ బొమ్మ సెంటర్ కు చేరుకుని కొవ్వొత్తులు వెలిగించి నిరసన వ్యక్తం చేశారు. రాజోలు,మలికిపురం, సఖినేటిపల్లి, మామిడికుదురు, పి.గన్నవరం యూటీఎఫ్ శాఖల ఆధ్వర్యంలో నిరసన జాగరణ చేపట్టామన్నారు. కార్యక్రమంలో యుటిఎఫ్ నాయకులు కె.రాజబాబు, కె.బాలకష్ణ, అడబాల కాశీ విశేశ్వర రావు, సిహెచ్. కేశవరావు, రాజబాబు, అడబాల శ్రీమన్నారాయణ, కె.రామ దుర్గారావు, ఎం.నరసింహ రావు, బి.రాచయ్య, జివిఎంఎస్.గుప్తా తదితరులు పాల్గొన్నారు.