Jun 10,2021 21:00

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి రెండేళ్లలో ఒక్క ఉద్యోగం కూడా కల్పించలేదని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ విమర్శించారు. గ్రూప్‌ా1లో జరిగిన మూల్యాంకనంపై అభ్యర్థులతో లోకేష్‌ ఆన్‌లైన్‌ ద్వారా గురువారం చర్చ జరిపారు. కనీస విద్యార్హత లేనివారిని ఎపిపిఎస్‌సిలో నియమిస్తున్నారని విమర్శించారు. ఎంపిక ప్రక్రియ, మూల్యాంకనం అనుమానాలపై ఆన్‌లైన్‌ ఫిర్యాదులు స్వీకరించాలని డిమాండ్‌ చేశారు.

నత్త నడకన నీటి ప్రాజెక్టులు : కాల్వ శ్రీనివాసులు
రాష్ట్రంలో నీటి ప్రాజెక్టుల పనుల తీరు నత్తనడకన నడుస్తున్నాయని టిడిపి పొలిట్‌ బ్యూరో సభ్యులు కాల్వ శ్రీనివాసులు అన్నారు. ఆన్‌లైన్‌లో విలేకరులతో మాట్లాడుతూ రెండేళ్లలో ఒక్క నీటి ప్రాజెక్టునూ చేపట్టలేదని విమర్శించారు.

పెట్టుబడుల వివరాలు చెప్పాలి : అమర్నాథ్‌ రెడ్డి
రెండేళ్ల వైసిపి పాలనలో ఏఏ కంపెనీలు రాష్ట్రానికి వచ్చాయో, ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు తెచ్చారో పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్‌ రెడ్డి సమగ్ర వివరాలు అందించాలని మాజీ మంత్రి అమర్‌నాథ్‌ రెడ్డి ప్రశ్నించారు. ఆన్‌లైన్‌లో విలేకరులతో పరిశ్రమలు తెచ్చుకుంటే రాష్ట్రంలో నిరుద్యోగం 13.5 శాతం ఎందుకు ఉందని ప్రశ్నించారు. ఇళ్ల స్థలాల పేరుతో వైసిపి ఎంపిలు, ఎమ్మెల్యేలు దోచుకున్నారని టిడిపి నాయకులు బండారు సత్యనారాయణ ఆరోపించారు.