Nov 21,2020 21:37

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ రంగ ఉద్యోగుల(ఎగ్జిక్యూటివ్‌లు, నాన్‌ ఎగ్జిక్యూటివ్‌లలో నాన్‌ యూనియనైజుడ్‌ సూపర్‌వైజర్లు), కరువు భత్యం (డిఎ)లను ప్రభుత్వం స్తంభింపచేయడాన్ని సిఐటియు తీవ్రంగా ఖండించింది. ఇది బిజెపి సర్కార్‌ ఏకపక్ష, చట్టవిరుద్ధ చర్య అని ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల హక్కులు, వారికి ఇవ్వాల్సిన బకాయిలను నిలిపివేయడం దారుణమని సిఐటియు విమర్శించింది. ఈమేరకు శనివారం నాడిక్కడ ఒక ప్రకటన విడుదలజేసింది. నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకీ పెరుగుతున్న తరుణంలో 2021, జూన్‌ 30 వరకు డిఎను నిలుపుదల చేయడం కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక వైఖరికి నిదర్శనమని సిఐటియు పేర్కొంది. ఈ ఏడాది అక్టోబర్‌ 1 నుంచి వచ్చే ఏడాది జూన్‌ 30 వరకు డిఎ నిలుపుదలకు సంబంధించి పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజెస్‌ విభాగం ఆదేశాలు ఇచ్చిందని తెలిపింది.
ప్రభుత్వ ఉద్యోగుల హక్కులపై చేస్తున్న దాడిని వెంటనే ఉపసంహరించుకోవాలని సిఐటియు డిమాండ్‌ చేసింది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ఉద్యోగులు, కార్మికులకు పూర్తి వ్యతిరేకంగా ఉన్నాయని, డిఎ, చట్టబద్ధమైన బకాయిల నిలుపుదల ప్రమాదాన్ని ఇతర ఉద్యోగులు, కార్మికులు కూడా ఎదుర్కొనే అవకాశం ఉందని పేర్కొంది. కరోనా సంక్షోభం నేపథ్యంలో ఏర్పడిన ఆర్థిక మాంద్యం, సెంట్రల్‌ పబ్లిక్‌ సెక్టార్‌ ఎంటర్‌ప్రైజెస్‌ (సిపిఎస్‌ఇ)ల ఇబ్బందుల నేపథ్యంలో ఈ డిఎ, బకాయిలను నిలుపుదల చేయడాన్ని మాట వరసకు సరేననుకున్నా, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న సిపిఎస్‌ఇలను ప్రత్యేక డివిడెండ్లు చెల్లించాలని, సొంత వాటాలను, తదితరాలను తిరిగి కొనుగోలు చేయాలని ప్రభుత్వం మంత్రిత్వ శాఖల ద్వారా ఎలా ఒత్తిడి చేస్తుందని సిఐటియు నిలదీసింది.
ప్రజలను, కార్మికులను, ఉద్యోగులను దోపిడీ చేసి.. ప్రభుత్వ సొమ్మును కార్పొరేట్లకు, బడా వ్యాపారవేత్తలకు ధారాదత్తం చేయడం బిజెపి పాలనలో పరిపాటిగా మారిందని పేర్కొంది. ఉద్యోగుల చట్టబద్ధమైన హక్కులపై మోడీ సర్కార్‌ చేస్తున్న దాడిని ఐక్యంగా తిప్పికొట్టాలని ప్రభుత్వరంగ ఉద్యోగులకు సిఐటియు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా ఈనెల 26న కార్మిక లోకం తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను అన్ని సిపిఎస్‌ఇల్లో విజయవంతం చేయాలని కోరింది. అనంతరం డిఎ, ఇతర బకాయిల నిలుపుదల విషయంలో ఐక్య ప్రతిఘటనను నిర్మించాల్సిన అవసరం ఉందని పేర్కొంది.