
ప్రజాశక్తి - బిజినెస్ బ్యూరో : ఉద్యోగులు కష్టపడి పని చేయాలని, ఎంచుకున్న లక్ష్యాలను చేరాలని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతన సిఇఒ, మేనేజింగ్ డైరెక్టర్ మఠం వెంకటరావు తమ సిబ్బందికి సూచించారు. కొత్తగా సిఇఒ, ఎండి బాధ్యతలు స్వీకరించిన ఆయన మంగళవారం హైదరాబాద్ కోటీలోని రీజినల్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్బంగా ఉద్యోగులు, సిబ్బంది ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్బంగా హైదరాబాద్ రీజియన్ సీనియర్ రీజినల్ మేనేజర్ డిఎస్ రాథోర్ తమ సిబ్బందితో 'ఫరెవర్ సెంట్రలైట్' విధానంపై ప్రతిజ్ఞ చేయించారు. బ్యాంక్ వ్యాపారాభివృద్థి, ఎన్‌పిఎల వసూళ్లపై ఉద్యోగులు దృష్టి కేంద్రీకరించాలన్నారు.
సెంట్రల్ బ్యాంక్ సారథిగా బాధ్యతలు స్వీకరించిన వెంకటరావు ఇంతక్రితం ఆయన కెనరాబ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. నూతన బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మూడేళ్లు లేదా తదుపరి ఆదేశాలు జారీ అయ్యే వరకు ఏది ముందు ఏర్పడితే అంతవరకు ఆయన కొత్త పదవిలో ఉంటారని రెగ్యులేటరీ సంస్థలకు ఆ బ్యాంక్ తెలిపింది. వెంకటరావు తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వ్యవసాయ కళాశాల నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ పట్టా పొందారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకర్స్ సర్టిఫైడ్ అసోసియేట్‌గా ఉన్నారు. 1988లో అలహాబాద్ బ్యాంక్‌లో ఫీల్డ్ ఆఫీసర్‌గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కెరీర్లో భాగంగా దేశంలోని పలు ప్రదేశాల్లో కీలక పదవులు నిర్వహించారు.