Nov 12,2022 20:37

లండన్‌ : బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ శనివారం తిరిగి తాజా వివాదంలో చిక్కుకున్నారు. కేబినెట్‌ నియామకాల ఎంపికపై ఆయన సరికొత్త ప్రశ్నలను ఎదుర్కొంటున్నారు. డిప్యూటీ ప్రధాని, న్యాయ శాఖా మంత్రి డొమినిక్‌ రాబ్‌, సిబ్బంది పట్ల దురుసుగా వ్యవహరించారని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో తాజాగా ఈ వివాదం రేగింది. మరో సీనియర్‌ కన్జర్వేటివ్‌ నేతను బెదిరించారనే ఆరోపణల కారణంగా కొత్త ప్రభుత్వం నుండి సునాక్‌ మిత్రుడు గవిన్‌ విలియంసన్‌ను డొమినిక్‌ రాబ్‌ బలవంతంగా తొలగించారు. పైగా రాబ్‌ గత వ్యవహార శైలి కారణంగా ఆయన నేతృత్వంలో పని చేయలేమనుకున్న దాదాపు 15 మంది సీనియర్‌ అధికారులను వేర్వేరు ప్రభుత్వ విభాగాలకు బదిలీ చేయడానికి కూడా ప్రతిపాదించినట్లు గార్డియన్‌ వార్తా పత్రిక పేర్కొంది.
బ్రిటన్‌ ఎన్నికల సమయంలో తనకుగట్టి మద్దతుదారుగా నిలిచిన రాబ్‌ను వెంటనే సునాక్‌ తిరిగి మంత్రివర్గంలోకి తీసుకున్నారు. గతంలో నిర్వహించిన న్యాయ శాఖ పదవినే అప్పగించారు కూడా. రాబ్‌ తీరు పట్ల ఇప్పటికే అసంతృప్తిగా వునువారు ఈ నియామకంపై తీవ్రంగా విమర్శలు చేశారు. విలియంసన్‌పై దర్యాప్తు జరుగుతుండగానే ఆయనిు తిరిగి మంత్రిగా తీసుకోవడంపై కూడా సునాక్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. అధికారిక సమావేశం జరుగుతున్న సమయంలో ఆగ్రహం పట్టలేక రాబ్‌, సలాడ్‌ నుండి టమోటాలు తీసి విసిరివేసిన విషయాన్ని మరో పత్రిక సన్‌ ప్రచురించింది. కాగా, ఇదంతా అర్ధం లేని రాతలంటూ రాబ్‌ ప్రతినిధి వ్యాఖ్యానించారు. ప్రతి ఒక్క వ్యవహారం బయటపడుతున్న కొద్దీ ఆయన బలహీన నేత అనే విషయం మరింతగా తేటతెల్లమవుతోందంటూ ప్రతిపక్ష లేబర్‌ పార్టీ విమర్శించింది. అయితే దీనిపై సునాక్‌ నుండి వెంటనే ఎలాంటి ప్రతిస్పందన రాలేదు.