Jul 29,2021 19:42
ఉక్కు ప్రధాన పరిపాలన భవనం ఎదురుగా రహదారిపై ఆందోళన చేస్తున్న స్టీల్‌ప్లాంట్‌ కార్మికులు

ప్రజాశక్తి-ఉక్కునగరం (విశాఖ) : విశాఖ ఉక్కు కర్మాగారాన్ని 100 శాతం ప్రైవేటీకరణ చేయడం ఖాయమని ఎపి హైకోర్టులో బుధవారం దాఖలు చేసిన కౌంటర్‌ పిటిషన్‌పై స్టీల్‌ప్లాంట్‌ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యాన గురువారం స్టీల్‌ప్లాంట్‌ ప్రధాన పరిపాలనా భవనం ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ ధర్నానుద్దేశించి పోరాట కమిటీ కన్వీనర్‌ జె.అయోధ్యరామ్‌ మాట్లాడుతూ.. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ 100 శాతం అమ్మకానికి వ్యతిరేకంగా మాజీ ఐపిఎస్‌ అధికారి లక్ష్మీనారాయణ హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని వేసిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తన అఫిడవిట్‌లో అసంబద్ధమైన ప్రకటన చేసిందని పేర్కొన్నారు. దీనిని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు తెలిపారు. తాము శాంతియుతంగా నిరసన తెలియజేస్తుంటే కేంద్రం స్టీల్‌ కార్మిక వర్గాన్ని రెచ్చగొట్టే విధంగా చర్యలు చేపడుతోందని విమర్శించారు. కార్మిక హక్కులను హరించే విధంగా కేంద్రం వ్యవహరిస్తోందని, వాటిని కాపాడుకునే దిశగా తమ పోరాటంతో ప్రతిఘటిస్తామని తెలిపారు. ప్రజా సంపదను ప్రైవేటు, కార్పొరేట్లకు కట్టబెట్టే కుటిల ప్రయత్నాలను తిప్పికొడతామన్నారు. ఉక్కు పరిరక్షణ పోరాటాన్ని జాతీయ ఉద్యమంగా మలచడంలో భాగంగా ఆగస్టు 2, 3 తేదీలలో ఢిల్లీ వేదికగా తమ నిరసనను తీవ్రతరం చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికైనా కేంద్రం తప్పుడు ప్రకటనలు మాని విశాఖ ఉక్కుపై తీసుకున్న నిర్ణయాన్ని పునరాలోచించాలని, లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోరాట కమిటీ నాయకులు మంత్రి రాజశేఖర్‌, డి.ఆదినారాయణ, వైటి.దాస్‌, గంధం వెంకట్రావు, కె.సత్యనారాయణరావు, మురళి రాజు, బడ్డు పైడిరాజు, వై.మస్తానప్ప, గణపతి రెడ్డి, డివి.రమణారెడ్డి, కరణం సత్యారావు, డి.సురేష్‌బాబు, వరసాల శ్రీనివాస్‌, పరంధామయ్య, కొమ్మినేని శ్రీనివాస్‌, మహాలక్ష్మి నాయుడు, డేవిడ్‌, రాంకుమార్‌ అధిక సంఖ్యలో కార్మికులు, నిర్వాసితులు పాల్గొన్నారు.