May 04,2021 08:01
  • ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కన్వీనర్‌ అయోధ్యరామ్‌

ప్రజాశక్తి - ఉక్కునగరం (విశాఖ) : కోవిడ్‌ విపత్కర పరిస్థితుల్లోనూ స్టీల్‌ప్లాంట్‌ కార్మికులు కర్మాగారం పరిరక్షణ కోసం పోరాడుతూ ఉద్యమ స్ఫూర్తిని చాటుతున్నారని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కన్వీనర్‌ జె.అయోధ్యరామ్‌ అన్నారు. కూర్మన్నపాలెంలోని స్టీల్‌ప్లాంట్‌ ఆర్చి వద్ద కమిటీ ఆధ్వర్యాన జరుగుతున్న రిలే దీక్షలు సోమవారానికి 81వ రోజుకు చేరుకున్నాయి. దీక్షల్లో ఎంఎంఎస్‌ఎం, ఎస్‌టిఎం, ఎస్‌బిఎం ఉద్యోగులు కూర్చున్నారు. ఈ సందర్భంగా అయోధ్యరామ్‌ మాట్లాడుతూ విశాఖ ఉక్కు పట్ల కేంద్రం మొదటి నుంచి నిర్లక్ష్య వైఖరినే అవలంబిస్తోందన్నారు. కోవిడ్‌ రెండో దశ విజృంభిస్తున్న వేళ స్టీల్‌ కార్మికులు భయాందోళనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక పక్క కరోనాతో ఉక్కు కార్మికులు మరణిస్తున్నా మొక్కవోని దీక్షతో కార్మికులు తమ పోరాటాన్ని కొనసాగించడం అభినందనీయమన్నారు. కర్మాగారాన్ని కాపాడుకోవడం కోసం కార్మికులు ఒక పక్క ఉత్పత్తి సాగిస్తూనే మరో పక్క ఉద్యమ పిడికిళ్లను బిగిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పోరాట కమిటీ కో కన్వీనర్‌ గంధం వెంకటరావు, నాయకులు కె.సత్య నారాయణ, వైటి.దాస్‌, కెఆర్‌కె.రాజు, జిబి.సత్యనారాయణ, సూరిబాబు, వైవి.సుబ్బారావు, ఎం.సుబ్బారావు పాల్గొన్నారు.