
ఉక్కునగరం (విశాఖ) : విశాఖ ఉక్కు పరిరక్షణకు కార్మికులు చేపట్టే ఉద్యమానికి తోడుగా మహిళలు ముందుకు రావాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు స్వరూపారాణి పిలుపునిచ్చారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యాన కూర్మన్నపాలెంలోని స్టీల్‌ప్లాంట్ ఆర్చి వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 55వ రోజుకు చేరుకున్నాయి. మాజీ కార్పొరేటర్ కె.విమల, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు పి.శేషరత్నం దీక్షా శిబిరాన్ని ప్రారంభించారు. ఈ దీక్షలో విశాఖ స్టీల్ ప్లాంట్‌లోని శ్రామిక మహిళా సంఘం, ఐద్వా నాయకులు, ఉక్కు ఉద్యోగుల సతీమణులు, ఉక్కు కో-ఆపరేటివ్ స్టోర్స్, ఒప్పంద కార్మిక సంఘం మహిళలు కూర్చున్నారు. ఈ దీక్షలనుద్దేశించి స్వరూపారాణి మాట్లాడుతూ.. భూమిలో ఉన్న గనుల నుంచి ఆకాశం వరకూ అన్నింటినీ మోడీ అమ్మకానికి పెట్టారని విమర్శించారు. పచ్చని ప్రకృతిని నాశనం చేసే వారిని దండించే అధికారం ఒక్క మహిళా శక్తికే ఉందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మహిళలుగా సమరశంఖం పూరించామని, అందుకే విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమంలో భాగస్వాములుగా ఉన్నామని చెప్పారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు పి.శేషారత్నం మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం మూడు నల్ల వ్యవసాయ చట్టాలతో రైతాంగాన్ని ఆవేదనకు గురిచేస్తోందని, మరో పక్క కార్మికవర్గం ఉపాధిని ప్రశ్నార్థకంగా మార్చేస్తోందని విమర్శించారు.