
కీవ్ : ఉక్రెయిన్ ప్రత్యేక బలగాలకు అమెరికా శిక్షణ ఇస్తోంది. ఈ మేరకు యాహూ పోర్టల్ ఒక కథనాన్ని ప్రచురించింది. అమెరికాకు చెందిన సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సిఐఎ), నేషనల్ సెక్యూరిటీ మాజీ సభ్యులు, ఉక్రెయిన్ ప్రత్యేక బలగాలకు రహస్యంగా శిక్షణ ఇస్తున్నారని ఆ కథనం పేర్కొంది. ఉక్రెయిన్‌లో రహస్యంగా సాగుతున్న ప్రత్యేక బలగాల శిక్షణా కార్యక్రమానికి సిఐఎ ఇన్చార్జిగా వుందని ఆ బలగాల సభ్యులు యాహూ పోర్టల్‌కు తెలిపారు. 2015లో బరాక్ ఒబామా హయాంలో అమెరికాలో దీనికి బీజాలు పడ్డాయని, తర్వాత వచ్చిన ప్రభుత్వాలు వాటిని కొనసాగిస్తున్నాయని రష్యా టుడే సోమవారం పేర్కొంది. సిఐఎతో కలిసి పనిచేస్తున్న పారా మిలటరీ బలగాలు 2015లోనే చర్చల నిమిత్తం తూర్పు ఉక్రెయిన్ను సందర్శించాయని ఆ వర్గాలు తెలిపాయి. ఆయుధాలు ఉపయోగించడం, మభ్యపెట్టే సాంకేతికతలను వినియోగించడం, నావిగేషన్, ఇంటెలిజెన్స్, ఇతర రంగాల్లో ఈ శిక్షణ కొనసాగుతోంది. రష్యా దాడి చేసిన పక్షంలోవాటిని తిప్పికొట్టేందుకే ఉక్రెయిన్ బలగాల సామర్ధ్యాన్ని మెరుగుపరిచే కార్యక్రమం చేపట్టామని పేరు తెలపడానికి ఇష్టపడని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. రష్యన్లను ఎలా చంపాలనేది ఉక్రెయిన్ మిలటరీకి బోధించడమే ఈ శిక్షణ ఉద్దేశమని మరో సిఐఎ అధికారి చెప్పారు. ఎనిమిదేళ్ళుగా శిక్షణ సాగుతున్నందున వారు మంచి పోరాట యోధులుగా తయారయ్యారని మరో అధికారి తెలిపారు.