Jan 18,2022 21:50

మాస్కో : ఉక్రెయిన్‌తో గల సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరుగుతుండడంతో కీవ్‌లోని తమ ఎంబసీ నుండి, లవోవ్‌లోని కాన్సులేట్‌ నుండి దౌత్యవేత్తలను, వారి కుటుంబాలను ఉపసంహరించడం రష్యా ప్రారంభించిందని న్యూయార్క్‌ టైమ్స్‌ తెలిపింది. ఈ మేరకు పేరు వెల్లడించని అధికారులను ఉటంకిస్తూ పత్రిక సోమవారం నాటి సంచికలో కొన్ని వివరాలు ఇచ్చింది. జనవరి 5న మొత్తంగా 18మంది ఉక్రెయిన్‌ వీడారని, అందులో ప్రధానంగా రష్యన్‌ దౌత్యవేత్తల భార్యలు, వారి పిల్లలు వున్నారని వివరించింది. ఆ తర్వాత రెండు వారాల్లో మరో 30మంది రానున్నారు. తర్వాత మరో రెండు రష్యన్‌ కాన్సులేట్ల (ఖర్కోవ్‌, ఒడెస్సా) కి చెందిన దౌత్యవేత్తలు దేశాన్ని వీడేందుకు సిద్ధంగా వున్నారని తెలిపింది. దీనిపై రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందిస్తూ, కీవ్‌లోని రష్యన్‌ ఎంబసీ సాధారణంగానే పనిచేస్తోందని పేర్కొంది.
రాబోయే కాలంలో ఉక్రెయిన్‌పై దాడి చేసేందుకు రష్యా సన్నాహాలు చేస్తోందని పశ్చిమ దేశాలు అదే పనిగా ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. అందుకోసమే సరిహద్దుల్లో బలగాలను మోహరిస్తోందంటూ పదే పదే ప్రకటనలు చేస్తున్నాయి. ఈ ప్రచారాన్ని రష్యా ప్రతిసారీ ఖండిస్తూనే వస్తోంది. తమకు దాడి చేసే ఉద్దేశం లేదని చెబుతూనే వుంది. రష్యా దాడులు జరుపుతుందనే సాకుతో నాటో ఆ ప్రాంతంలో బలగాలను మోహరిస్తోందని క్రెమ్లిన్‌ విమర్శిస్తోంది. కాగా, పట్టణ ప్రాంతాల్లో యుద్ధం జరపడంలో ఆరితేరిన, పేలుడు పదార్ధాలను వినియోగించడంలో సుశిక్షితులైన కొంతమందిని పంపినట్లు గత వారం అమెరికాకి చెందిన సిఎన్‌ఎన్‌ తెలిపింది. ఉక్రెయిన్‌లో సైనిక జోక్యానికి ఒక సాకును సృష్టించడానికే ఇదంతా చేస్తోందని పేర్కొంది.