Jan 14,2022 21:34
  • ఉక్రెయిన్‌లోకి అమెరికా సేనలు రావచ్చు
  • క్యూబా, వెనిజులాలో రష్యా బలగాలు రాకూడదు
  • ఇదీ అమెరికా తీరు

వాషింగ్టన్‌ : మధ్య ఆసియాలోని ఉక్రెయిన్‌లో తన సేనలను దించి రష్యాకు వ్యతిరేకంగా కవ్వింపు చర్యలు చేపడుతున్న అమెరికా, అదే పని రష్యా చేస్తానంటే ఆ దేశంపై రయ్యన లేచింది. నువ్వు ఉక్రెయిన్‌ నుంచి సైన్యాన్ని వెనక్కి తీసుకుంటే సరే, లేకుంటే క్యూబా, వెనిజులాలో రష్యన్‌ బలగాలను దింపాల్సి వస్తుందని పుతిన్‌ హెచ్చరించారు. దీనిపై అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్‌ సులివాన్‌ శుక్రవారం నాడిక్కడ స్పందిస్తూ, రష్యా బలగాలను మోహరిస్తే తాము దానిని దీటుగా ఎదుర్కొంటామన్నారు. వెనిజులా లేదా క్యూబాల్లో రష్యా తన బలగాలను మోహరించగలదన్న సూచనలు వస్తున్న నేపథ్యంలో ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ఆయన పై విధంగా స్పందించారు. ఇటీవల జెనీవాలో జరిగిన వ్యూహాత్మక చర్చల్లో ఈ విషయం ప్రస్తావనకే రాలేదని సులివాన్‌ అన్నారు.. రష్యా విదేశాంగ మంత్రి సెర్గి రిబ్‌కోవ్‌ ఒక టివి చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, అవసరమైతే లాటిన్‌ అమెరికాకు రష్యా బలగాలను పంపుతామన్నారు. . 'రష్యాపై కవ్వింపు చర్యలకు దిగితే, అమెరికా మాపై సైనిక ఒత్తిడి పెంచితే ఎలాంటి చర్యలు వుండవచ్చనే దానిపై రష్యా అధ్యక్షుడు ఇప్పటికి చాలాసార్లు మాట్లాడారు. మేం దాన్ని కోరుకోవడం లేదు. దౌత్యవేత్తలు ఒక అంగీకారానికి రావాలి.'' అని రిబ్‌కోవ్‌ పేర్కొన్నారు.