Jul 27,2021 21:21

గ్లాస్గో వాతావరణ సదస్సు జయద్రానికి కీలకమైన నివేదికపై చర్చలు
న్యూయార్క్‌ :
ఐక్యరాజ్య సమితి సైన్స్‌ నివేదికను ధృవీకరించేందుకు దాదాపు 200 దేశాల ప్రతినిధులు సోమవారం చర్చలు ప్రారంభించారు. కోవిడ్‌ నేపథ్యంలో ఆన్‌లైన్‌లో జరుగుతున్న ఈ సమావేశంలో దాదాపు 700మంది ప్రతినిధులు పాల్గొన్నారు. చర్చలు జరిపి, ఖరారు చేయాల్సిన ఈ నివేదిక ప్రపంచవ్యాప్తంగా చాలా కీలకమైది కానున్నదని ప్రపంచ పర్యావరణ సంస్థ అధినేత పెట్టెరి తలాస్‌ వ్యాఖ్యానించారు. జూమ్‌ ద్వారా ఆయన ప్రతినిధులనుద్దేశించి ప్రసంగించారు. నవంబరులో జరగనున్న గ్లాస్గో వాతావరణ సదస్సు జయప్రదం కావడానికి వాతావరణ మార్పులపై ఇంటర్‌ గవర్నమెంటల్‌ ప్యానెల్‌ (ఐపిసిసి) అంచనా చాలా కీలకమైనది ఆయన పేర్కొన్నారు. ఇటీవలి వారాల్లో మూడు ఖండాల్లో మూడు ప్రకృతి వైపరీత్యాలు సంభవించాయి. రికార్డు స్థాయిలో వడగాలులు, వరదలు, కరువు పరిస్థితులు ఈ మూడు ఖండాల్లో చోటు చేసుకున్నాయి. ఇవన్నీ ఉధృతంగా సంభవించడానికి గ్లోబల్‌ వార్మింగ్‌ కారణం. ఈ నేపథ్యంలో నిర్ణయాత్మక కార్యాచరణ చేపట్టాల్సిన ఒత్తిడి మరింత పెరుగుతోంది. ఇదంతా జరుగుతుందని ఏళ్ళ తరబడి మనం హెచ్చరిస్తూనే వున్నాం. ఇప్పుడు ఇదంతా జరుగుతోందని ఐక్యరాజ్య సమితి వాతావరణ విభాగ చీఫ్‌ పాట్రిసియా ఎస్పినోసా ఒక ప్రకటనలో తెలిపారు. వాతావరణ మార్పులపై కీలకమైన జి 20 శిఖరాగ్ర సదస్సు అక్టోబరు చివరిలో జరగనుంది. గత 18 మాసాల్లో మొదటిసారిగా జరుగుతున్న ఈ ముఖాముఖి వాతావరణ చర్చలు వాస్తవ కార్యాచరణను, రాజీపడేందుకు అవకాశమున్న రంగాలను చూపించాయని అధికారులు తెలిపారు. లండన్‌లో జరిగిన రెండు రోజుల మంత్రిత్వ స్థాయి సమావేశంలో కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా బొగ్గు భవితవ్యంపై పలు వాదనలు వినవచ్చాయి. గాస్గో సమావేశంలోగా వీటిని పరిష్కరించాల్సి వుంది.