Jul 29,2021 19:40

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఉన్నత చదువులతోనే పేదరిక నిర్మూలన సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి వెస్‌ జగన్మోహన్‌రెడ్డి అన్నారు.
జగనన్న విద్యాదీవెన రెండో విడత కార్యక్రమాన్ని క్యాంపు కార్యాలయం నుండి ఆయన గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చదువొక్కటే పిల్లలకు ఇచ్చే ఆస్తి అని అన్నారు. పేద విద్యార్థులకు కూడా పెద్ద చదువులు అందుబాటులోకి రావాలని, వాటికోసం తల్లిదండ్రులు అప్పులు పాలు కాకుకూడదన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా బకాయిలు లేకుండా ప్రతి మూడు నెలలకోసారి పూర్తిఫీజు రీయింబర్స్‌మెంట్‌ తల్లుల ఖాతాల్లో జమచేస్తున్నటుల తెలిపారు. దీనివల్ల 10.97లక్షల మంది పిల్లలకు మేలు జరుగుతుందని అన్నారు. ఆ లక్ష్యంలో భాగంగానే రెండవ విడత విద్యాదీవెన కింద రూ.694కోట్లు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. మూడో విడత డిసెంబర్‌లో, నాలుగో విడత ఫిబ్రవరిలో చెల్లిస్తామన్నారు. వసతి దీవెన రెండో విడత మొత్తాన్ని డిసెంబర్‌లో చెల్లిస్తామన్నారు. విద్యారంగంలో ఇప్పటి వరకు 1,62,75,373 మందికి రూ.26,677.82కోట్లు ఖర్చుచేశామని చెప్పారు. . ఈ కార్యక్రమంలో విద్య, సాంఘిక సంక్షేమ, బిసి సంక్షేమ, పౌర సరఫరాల, శాఖల మంత్రులు ఆదిమూలపు సురేష్‌, పినిపే విశ్వరూప్‌,చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ, కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు, ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌ చంద్ర,మైనార్టీ, గిరిజన సంక్షేమ శాఖల కార్యదర్శి కాంతిలాల్‌ దండే, ఉన్నత విద్య మండలి హేమచంద్రారెడ్డి, కళాశాల విద్య కమిషనర్‌ పోలా భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.