గిట్టుబాటు ధరలు చెల్లించాలి

చింతపండును పరిశీలిస్తున్న సురేంద్ర, గంగరాజు

ప్రజాశక్తి-డుంబ్రిగుడ :ఏజెన్సీలో పండుతున్న చింతపండు, అల్లం, పసుపు, కాఫీ, మిరియాల పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కిల్లో సురేంద్ర, అనంతగిరి జెడ్పిటిసి దీసరి గంగరాజు డిమాండ్‌ చేశారు. మండలంలోని తూటంగి పంచాయితీ బల్లకట్టు గ్రామంలో ఆదివారం వారు సందర్శించి చింత పండు రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గిరిజనులు పండిస్తున్న చింత పండుకు కేజీకి రూ.60లు ఇవ్వాలన్నారు.సీపీఎం అధికారంలో ఉన్న కేరళ రాష్ట్రంలో అక్కడి ముఖ్యమంత్రి రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు ఇస్తున్నారన్నారు. ఇక్కడ మాత్రం వైసీపీ, టీడీపీ పార్టీలు ఎవరు అధికారంలో ఉన్నా వ్యాపారులతో కుమ్మక్కై గిట్టుబాటు ధరలు రైతులకు ఇవ్వలేదనీ విమర్శించారు. సీపీఎం పార్టీకి ఓటేసి గెలిపిస్తేనే పంటలకు గిట్టుబాటు ధరలు సాద్యమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసులకు అటవీ ఉత్పత్తులను కనీస మద్దతు ధర కల్పించడంలో వైఫల్యం చెందాయని విమర్శించారు. ఈ కార్యక్రమంలో హుకుంపేట మండల పరిషత్‌ వైస్‌ ఎంపీపీ సూడిపల్లి కొండలరావు, మండల నాయకులు సింహాచలం, రాజు, మధు పాల్గొన్నారు.

➡️