నైపుణ్యాభివృద్ధిలో 8 ఎంఒయులు

Feb 10,2024 08:08 #minister buggana, #speech

– దేశంలో స్కిల్‌ డిజైన్‌ రాష్ట్రాల్లో ఎపికి అగ్రస్థానం

– విశాఖలో ఎపిఎస్‌ఎస్‌డిసి సదస్సును ప్రారంభించిన ఆర్థిక మంత్రి

ప్రజాశక్తి- గ్రేటర్‌ విశాఖ బ్యూరో: రాష్ట్రంలో వివిధ రంగాలకు చెందిన పలు సంస్థలతో నైపుణ్య శిక్షణలో ఎనిమిది అవగాహనా ఒప్పందాలను రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఉదయం విశాఖ రుషికొండ బీచ్‌రోడ్డులో గల రాడిసన్‌ బ్లూ హోటల్‌లో నేషనల్‌ స్కిల్‌ కాన్‌క్లేవ్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ‘స్కిల్‌ కాస్కేడింగ్‌ పారడైమ్‌’ను ఆవిష్కరించారు. గడచిన 30 ఏళ్లలో చాలా మార్పులు సంభవించాయని, తమ హయాంలో అందుబాటులో ఉన్న వనరులను బట్టి నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించే చర్యలు చేపట్టామని అన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధి కోసం జరిగిన కృషిని వీడియో ప్రదర్శన ద్వారా వివరించారు. రెండున్నరేళ్లలో రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధి కోసం ప్రభుత్వం జరిపిన కృషితో దేశంలో స్కిల్‌ను డిజైన్‌ చేసిన రాష్ట్రాల్లో ఎపి నెంబర్‌ వన్‌ స్థానంలో ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 192 స్కిల్‌ హబ్స్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. ఈ డెవలప్‌మెంట్‌ హబ్స్‌లో స్థానిక పరిశ్రమలకు 50 శాతం వరకూ సరిపడా పదో తరగతి వరకూ చదివిన వారికి శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించేలా చర్యలు చేపట్టామన్నారు. మిగతా సగం మందికి దేశంలో ఇతర ప్రాంతాలకు సరిపడేలా ట్రైనింగ్‌ ఇస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో సెంటర్‌ ఆఫ్‌ ఎక్సెలెన్స్‌కు 27 కేంద్రాలు ఏర్పాటు చేశామని, ఇక్కడ కోర్సు పూర్తిచేసి బయటకొస్తే రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకూ జీతం లభించనుందని అన్నారు. కార్యక్రమంలో ఎపిఎస్‌ఎస్‌డిసి ఎమ్‌డి, సిఇఒ డాక్టర్‌ వినోద్‌ కుమార్‌, ఛైర్మన్‌ కె.అజరు రెడ్డి, ఎపిలోని పలు పరిశ్రమలు, విద్యాసంస్థల నుంచి 194 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.

➡️