పాఠం నేర్వని కార్పొరేషన్‌

Feb 11,2024 00:47

ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి : గుంటూరులోని వివిధ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో కాలుష్యం వెంటాడుతోంది. ఆదిలో నిర్లక్ష్యం వల్ల పెద్దసంఖ్యలో మరణాలను నమోదు చేసుకున్న పరిస్థితులు గుంటూరులో 2018 మార్చిలో చోటుచేసుకున్నాయి. అప్పట్లో ఉన్న కమిషనర్‌ చల్లా అనూరాధ, అప్పటి ఇంజినీరింగ్‌ అధికారులు నీటి కాలుష్యాన్ని అంగీకరించక మొదట్లో ఫుడ్‌ పాయిజనింగ్‌ అని చేతులు దులుపుకోవడం వల్ల 24 మంది బలయ్యారు. అప్పట్లో పాతగుంటూరు, ఆనందపేట, సంగడిగుంట తదితర ప్రాంతాల్లో తాగునీటి పైపు లైన్లలోకి డ్రెయినేజి నీరు కలిసి వందలాదిమంది అస్వస్థతకు గురయ్యారు. 24 మందిప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు వేసవి ప్రారంభం కాకుండానే అప్పటి పరిస్థితులు పునరావృత్తం అవుతున్నాయి. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రజల ప్రాణాలకు ముప్పు తప్పదనే సంకేతాలు కన్పిస్తున్నాయి. నీటి కాలుష్యం వల్ల తీవ్రమైన కడుపునొప్పితో వాంతులు, విరోచనాలు వల్ల సంభవించే నిస్సత్తువ ప్రభావం శరీరంలోని వివిధ అవయావాలపై పడుతోంది. ఏ అవయవం విఫలమైనా మరణం సంభవించే అవకాశం ఉంటుంది. కానీ పాలకులు, ఉన్నతాధికారులు ఎక్కువ విరోచనాలు, వాంతుల వల్ల సంభవించే మరణాలను ఇతర కారణాలతో ముడిపెట్టి తప్పించుకోవడం పరిపాటిగా మారింది. ఇదే రీతిలో 2018లో కూడా అధికారులు, అప్పటి అధికార పార్టీ నాయకులు నిర్లక్షంగా మాట్లాడి చివరికి 24 మంది మృతి చెందిన తరువాత కమిషనర్‌ను బదిలీ చేసి ఇంజినీరింగ్‌ విభాగం అధికారులను మూకుమ్మడిగా అప్పటి ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. ఇప్పుడు కూడా పాలకులు, అధికారుల ఈ ఘటనను తేలికగా తీసుకుంటున్నట్టు కనిపిస్తోంది. నగరంలోని కేవలం ఒక్క ప్రాంతంలో ఒకరిద్దరికి మాత్రమే నీరు కలుషిత సమస్య రాలేదు. గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఒకే రోజు 21 మంది చేరగా అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు, ప్రైవేటు ఆస్పత్రులకు కూడా పెద్దసంఖ్యలో బాధితులు వెళ్లారు. ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లే వారు, మెడికల్‌ షాపులల్లో మందులు తెచ్చుకుని ఇళ్ల వద్ద చికిత్సలు పొందే వారు, ఆర్‌ఎంపిల వద్ద చికిత్సలు చేయించుకునే వారిని కూడా పరిశీలించాల్సిన అవసరం అధికారులకు ఉంది. గుంటూరులోని వివిధప్రాంతాల్లో తాగునీరు కలుషితంపై క్షేత్రస్థాయి పర్యవేక్షణ కొరవడింది. పులిచింతల నుంచి నీరు కలుషితమై వస్తోందని, ఉండవల్లి పంపింగ్‌ సెంటర్‌లో పూర్తిస్థాయిలో క్లీనింగ్‌ కావడం లేదని అందువల్ల ప్రజలు కాచి చల్లార్చుకోని తాగాలని ప్రకటనలు ఇచ్చి అధికారులు చేతులు దులుపు కొన్నారు. కానీ క్షేత్రస్థాయి పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలించాల్సిన బాధ్యతలను ఇంజనీరింగ్‌ అధికారులు విస్మరిస్తున్నారు. శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు వేర్వేరు ప్రాంతాలకు చెందిన 21 మంది గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు. ఎక్కువమంది కడపునొప్పి, వాంతులు, విరోచనాలతో బాధపడుతున్నారు. వీరిలో శారదాకాలనీకి చెందిన ఎం.పద్మ(18) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. సంగడిగుంటకుచెందిన కొర్రపాటి ఓబులేసు (59) రెండురోజుల క్రితం ఆస్వస్థతకు గురై గురువారం మృతి చెందాడు. శారదాకాలనీ, సంగడిగుంట, ఆనంద్‌పేట, కమ్మ శేషయ్య భవన్‌, సుద్దపల్లి డొంక, శ్రీనగర్‌, ఎటి అగ్రహారం, బ్రాడీపేట, తదితర ప్రాంతాల్లో మున్సిపల్‌ నీరు తాగి పలువురు వాంతులు, విరోచనాలతో అస్వస్తతకు గురవుతున్నారు. శారదాకాలనీ, శ్రీనగర్‌కు చెందిన ఆరుగురు స్థానిక అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లో చికిత్సపొందుతున్నారు. మరో 13 మంది వేర్వేరు అర్బన్‌ హెల్త్‌సెంటర్లకు వెళ్లి ప్రాథమిక చికిత్సపొంది డిశ్చార్జి అయ్యారని అధికార వర్గాలు తెలిపాయి. గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల (జిజిహెచ్‌)లో చికిత్స పొందుతున్న డయేరియా బాధితులను వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజిని, జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాలరెడ్డి, మేయర్‌ కావటి మనోహర్‌నాయుడు, కమిషనర్‌ కీర్తి చేకూరి, మచిలీపట్నం ఎంపి వి.బాలశౌరి, సిపిఎం నగర కార్యదర్శి కె.నళినీకాంత్‌, సిపిఐ జిల్లా కార్యదర్శి అజరుకుమార్‌, నగర కార్యదర్శి మాల్యాద్రి, వైసిపి గుంటూరు తూర్పు సమన్వకర్త నూరి ఫాతిమా, జనసేన జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, నగర అధ్యక్షులు నేరెళ్ల సురేష్‌, టిడిపి నాయకులు బి.రామాంజనేయులు, చిట్టిబాబు, కె.శ్రీనివాసరావు, నగర కాంగ్రెస్‌ అధ్యక్షులు ఉస్మాన్‌ పరామర్శించారు. ఆదుకుంటాం : మంత్రి రజినిజిజిహెచ్‌లో చికిత్స పొందుతున్న డయేరియా బాధితులను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజిని శనివారం రాత్రి పరామర్శించారు. బాధితులను ఆదుకుంటామని, నీటి కాలుష్యం నివారణకు చర్యలు తీసుకుంటామని అన్నారు. బాధితులకు మెరుగైన చికిత్సలు అందించి క్షేమంగా ఇంటికి పంపాలని వైద్యులను ఆదేశించారు. తొలుత మంత్రి రాగానే బిజెపి నాయకులు నిరసన వ్యక్తం చేశారు.
ఆస్పత్రిలో 20 మందికి
చికిత్సఅస్వస్థతకు గురైన వారికి ప్రత్యేక వైద్యసేవలు అందిస్తున్నట్లు గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల (జిజిహెచ్‌) సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కిరణ్‌ కుమార్‌ చెప్పారు. 21 మంది చికిత్సకు వచ్చారని, వారందర్నీ వార్డుల్లో చేర్పించి వైద్య సేవలు అందించామని చెప్పారు. సీరియస్‌గా ఉన్న బాదితులను ప్రత్యేక వార్డు కేటాయించి, నిత్యం వైద్యులు పర్యవేక్షణ ఉండేలా చేశామన్నారు. ప్రస్తుతం 20 మంది ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. చికిత్స పొందుతున్నవారి వివరాలుపి.మస్తాన్‌రావు (మేడికొండూరు), టి.జయరావు (గురజాల), డి.వెంకటరమణ, మస్తాన్‌ బి, మహబూబ్‌ బి, కె.నాగేశ్వరి (శ్రీనగర్‌), ఎస్‌.గంగమ్మ (నెహ్రూనగర్‌), సయ్యద్‌ రజియా (సంగడిగుంట), షేక్‌ బాబు (మధునగర్‌), ఎం.సౌమ్య (అంగలకుదురు), షేక్‌ మహబూబ్‌ జానీ (శ్రీనగర్‌), టి.బాజీ (వట్టిచెరుకూరు), షేక్‌ షబానా (సండిగుంట), వి.ప్రసాదరావు (శారదాకాలనీ), ఎన్‌.శ్రీనివాసరావు (ఏటూకూరు), షేక్‌ నాగూర్‌బి (సిరిపురం), రమణ(కాకుమానువారితోట), పి.మంగమ్మ (నల్లచెరువు), పి.విజయబాబు (నల్లచెరువు), కె.వెంకటరమణ (సంపత్‌నగర్‌), షేక్‌ షబ్బీర్‌ (పేరేచర్ల).
ట్యాంకర్లతో నీటిసరఫరాకు కలెక్టర్‌ ఆదేశం
జిజిహెచ్‌లో బాధితులను జిలా ్లకలెక్టర్‌ వేణుగోపాలరెడ్డి పరామర్శించారు. కమిషనర్‌, వైద్య ఆరోగ్య శాఖాధికారులతో సమీక్షించి పలు సూచనలు చేశారు. వైద్యాధికారులు మరింత అప్రమత్తంగా వుండాలని బాధితులు ఆసుపత్రి నుండి డిశ్చార్జ్‌ అయ్యే వరకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. వాంతులు, విరోచనాలతో ఆసుపత్రిలో చేరిన పేషెంట్ల ప్రభావిత ప్రాంతాల్లో వాటర్‌ శాంపిల్స్‌ టెస్టు చేయించాలని, టెస్టు రిపోర్ట్‌ అందేవరకు ట్యాంకర్లతో తాగునీటిని సరఫరా చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్‌కు సూచించారు. మెడికల్‌ అండ్‌ హెల్త్‌ టీములు ప్రభావిత కాలనీలలో ఇంటింటికి వెళ్లి పరీక్షలు చేయాలన్నారు. వాంతులు, విరోచనాలతో ఎవరైనా ఇబ్బంది పడుతుంటే వారు డియం అండ్‌ హెచ్‌ ఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూము నంబర్‌ 6300115327 కు ఫోన్‌ చేసి తక్షణ సాయం పొందవచ్చని తెలిపారు.
మేయర్‌ వాహనాన్ని అడ్డుకున్న వామపక్ష నాయకులు
కలుషిత నీరు తాగి మృతి చెందిన పద్మ కుటుంబానికి ఎక్స్‌ గ్రేషియో చెల్లించాలని, చికిత్స పొంందుతున్న మిగతా 21 బాధితులకు మెరుగైన వైద్య సదుపాయం కల్పించాలని సిపిఎం, సిపిఐ నాయకులు డిమాండ్‌ చేశారు. మేయర్‌ కావటిమనోహర్‌ నాయుడు కారును నిలిపివేసి తమ నిరసన తెలిపారు. కేవలం ఒక్క కుటుంబమో…ఒక్క ప్రాంతానికినీటి కాలుష్యం పరిమితం కాలేదని నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పడిన సమస్యను తక్షణమే పరిష్కరించాలని అన్నారు.

➡️