రేపటి నుంచి పింఛన్ల పంపిణీ

Apr 2,2024 22:04

ప్రజాశక్తి-విజయనగరం కోట : జిల్లాలో ఈనెల 4వ తేదీ నుంచి గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా సామాజిక ఫించన్ల పంపిణీకి ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్‌ శ్రీమతి ఎస్‌.నాగలక్ష్మి ఎంపిడిఒలు, మున్సిపల్‌ కమిషనర్‌లను ఆదేశించారు. ఆయా సచివాలయాల వద్ద ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకు ఫించను మొత్తాలు అందించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. మంగళవారం మండల స్థాయి అధికారులతో టెలీకాన్ఫరెన్సు నిర్వహించి వడగాల్పుల నుంచి రక్షణకు చేపట్టాల్సిన చర్యలు, మండలాలు, మునిసిపాలిటీల్లో ఫించన్ల పంపిణీకి చేయాల్సిన ఏర్పాట్లపై సూచనలు చేశారు. కలెక్టర్‌ మాట్లాడుతూ గ్రామ, వార్డు సచివాలయాల బ్యాంకు ఖాతాల్లో ఈనెల 3వ తేదీన ఫించను మొత్తాలకు సంబంధించిన నిధులు జమ అవుతాయని, వాటిని మండలాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ కార్యదర్శులు, సంక్షేమ, విద్యా సహాయకులు, పట్టణ ప్రాంతాల్లో వార్డు పరిపాలన కార్యదర్శులు, సంక్షేమ కార్యదర్శులు ఈ నగదు మొత్తాలను విత్‌డ్రా చేసి పింఛను పంపిణీచేసే సచివాలయ సిబ్బందికి అందజేయాలని ఆదేశించారు. వికలాంగులు, వివిధ రకాల తీవ్రవ్యాధులతో బాధపడుతున్న వారు, మాజీ సైనికుల ఫించను పొందుతున్న వితంతు మహిళలు, మూడు చక్రాల సైకిల్‌ సహాయంతో వెళ్లాల్సి వున్న వారు మినహా మిగిలిన వారంతా ఆయా గ్రామ, వార్డు సచివాలయాల వద్ద ఏర్పాటుచేసే కౌంటర్ల నుంచి ఫించను మొత్తాలు తీసుకోవాలన్నారు. ఫించను అందజేసే చోట తాగునీరు, నీడకోసం షామియానాలు, ఫించనుదారులు కూర్చొనే ఏర్పాట్లు చేయాలని, దీనికోసం ఆయా స్థానిక సంస్థల జనరల్‌ ఫండ్‌ను వినియోగించుకోవాలని కలెక్టర్‌ సూచించారు. మధ్యాహ్నం వేళల్లో ఫించను మొత్తాల పంపిణీ చేపట్టవద్దని ఉదయం లేదా సాయంత్రం వేళల్లో మాత్రమే పంపిణీ చేయాలన్నారు. సచివాలయానికి ఐదు కిలోమీటర్లు పైగా దూరం గల గ్రామాల్లో నివసించే ఫించనుదారులకు ఆయా గ్రామంలోని పాఠశాల లేదా ఏదైనా ప్రభుత్వ కార్యాలయం వద్ద ఫించను మొత్తం అందించే ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ఏప్రిల్‌ 6వ తేదీ నాటికి అన్ని మండలాలు, మున్సిపాలిటీల్లో ఫించన్ల పంపిణీ పూర్తికావాలని స్పష్టం చేశారు.వడగాల్పులపై అప్రమత్తంగా ఉండాలిజిల్లాలో ఏప్రిల్‌, మే నెలల్లో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, వడగాలు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన దృష్ట్యా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ ఎస్‌.నాగలక్ష్మి కోరారు. ఏప్రిల్‌లో 46 డిగ్రీలు, మేలో 46.6 డిగ్రీలు సగటు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నందున మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల మధ్య బయట సంచరించినట్లయితే వడదెబ్బకు గురయ్యే అవకాశం వుంటుందని తెలిపారు. సాధ్యమైనంత వరకు అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం వేళల్లో బయటకు వెళ్లకుండా జాగ్రత్త పడాలని కోరారు. ఉపాధి పనుల్లో పాల్గొనే వేతనదారులకు పనిచేసే స్థలంలో తగిన నీడ, తాగునీరు, ఒఆర్‌ఎస్‌ ప్యాకెట్లు తదితర వసతులు అందుబాటులో ఉంచాలన్నారు.

➡️