సిపిఎం అభ్యర్థులను గెలిపించాలి

Apr 1,2024 23:31
మాట్లాడుతున్న సిపిఎం జిల్లా కార్యదర్శి అప్పలనర్స

ప్రజాశక్తి-చింతపల్లి:బిజెపితో పొత్తు పెట్టుకున్న తొత్తు పార్టీలను ఓడించి సిపిఎం అభ్యర్థులను గెలిపించాలని ఆ పార్టీ అల్లూరి జిల్లా కార్యదర్శి పి అప్పలనర్స కోరారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బోనంగి చిన్నయ్య పడాల్‌తో కలిసి స్థానిక విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బిజెపి ప్రమాదాన్ని తక్కువగా అంచనా వేయకూడదని సూచించారు.భారత రాజ్యాంగాన్ని మార్చడమే లక్ష్యంగా బిజెపి ముందుకు వెళుతుందని, అందుకే 400 సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తాం అని బహిరంగంగా బిజెపి నేతలు చెబుతున్నారని తెలిపారు. ఇప్పటికే వ్యవస్థలన్నీ నాశనం చేసిందని మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థల నిర్వీర్యంతో లక్షలాది మంది ఉద్యోగాల నుండి తొలగింపబడ్డారన్నారు. అంబానీ, ఆదానిలకు అడవులను అప్పగించేందుకు బిజెపి కుట్ర చేస్తుందని విమర్శించారు. ఆ పార్టీలు గెలిస్తే మళ్లీ బాక్సైట్‌ తెరమీదకి వచ్చే ప్రమాదం ఉందని, ఈ ప్రాంతంలో హైడ్రో పవర్‌ ప్రాజెక్ట్‌ ఏర్పాటు చేస్తారన్నారు. అందుకే ఏజెన్సీలో పోటీ చేయడానికి మిగతా పార్టీలు తహతలాడుతున్నాయన్నారు. రాష్ట్రానికి విభజన హామీలలో భాగంగా రావలసిన రాయితీలు ఇవ్వకుండా బిజెపి అడ్డుపడుతుంటే, అటువంటి పార్టీని భుజాల మీద ఎక్కించుకొని పల్లకిలో మోస్తున్నారని దుయ్యబట్టారు. బిజెపి తొత్తు పార్టీలను ఓడించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం చింతపల్లి మండల కార్యదర్శి పాంగి ధనుంజరు, సాగిన చిరంజీవి, సిదరి సత్తిబాబు, సర్బు నాయుడు తదితరులు పాల్గొన్నారు.సీలేరు:రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి పొత్తు, తొత్తు పార్టీలను ఓడించాలని, సిపిఎం అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని సిపిఎం అల్లూరి జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బోనంగి చిన్నయ్య పడాల్‌ పిలుపునిచ్చారు. చింతపల్లి, జికె.వీధి, కొయ్యూరు మూడు మండలాల సిపిఎం కార్యకర్తలతో గాలికొండ ఎంపీటీసీ సభ్యులు అంపరంగి బుజ్జిబాబు అధ్యక్షత జీకే వీధి మండలం రింతాడలో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నయ్యపడాల్‌ మాట్లాడుతూ, ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసి, లక్షలాది మంది ఉద్యోగులను తొలగించిందని చెప్పారు. చివరికి గిరిజనులకు ఆధారంగా ఉన్న అడవులను సైతం అదాని, అంబానీలకు అప్పగించే కుట్ర చేస్తుందని తెలిపారు. ఎర్రజెండా పార్టీ వాళ్ళు ఎక్కడ పోటీ చేసినా భారీ స్థాయిలో ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం చింతపల్లి మండల కార్యదర్శి పాంగి ధనుంజరు, కొయ్యూరు మండల కార్యదర్శి ఎస్‌.సూరిబాబు, నాయకులు చిరంజీవి, బాలయ్య, అమ్మవారి దారకొండ వైస్‌ సర్పంచ్‌ మురళి చంటిబాబు, కోటేశ్వరరావు, రాంబాబు, సింహాచలం, అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.సిపిఎం నేతల ప్రచారంహుకుంపేట: సిపిఎం అరకు ఎంపి, ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించాలని మండలంలోని తీగలవలస పంచాయితీ గుర్రాలతోట, రాతుల పుట్టు, దుగ్గం, తడిగిరి పంచాయితీ ముల్లు మెట్ట గ్రామాల్లో హుకుంపేట వైస్‌ ఎంపీపీ సూడిపల్లి కొండలరావుల ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు.ప్రజల కోసం పనిచేసే సిపిఎంను ప్రజలు ఆదరించి శాసనసభకు పంపాలన్నారు. ఈ కార్యక్రమంలో తడిగిరి వైస్‌ సర్పంచ్‌ కిల్లో రామారావు, పాంగి సోమన్న, మర్రి చిట్టిబాబు, శివ, మజ్జి కొండబాబు, కిల్లో నాగేశ్వరరావు, కిల్లో బుజ్జిబాబు, వాసు,తదితరులు పాల్గొన్నారు.

➡️