అంగన్‌వాడీల రిలే దీక్షలు ప్రారంభం

గుంటూరు సమ్మె శిబిరంలో దీక్షలు
ప్రజాశక్తి-గుంటూరు, పల్నాడు జిల్లా :
అంగన్‌వాడీలు నిరవధిక సమ్మె శుక్రవారం 18వ రోజుకు చేరింది. గుంటూరు కలెక్టరేట్‌ ఎదుట సమ్మె శిబిరంలో రిలేదీక్షలను ప్రారంభించగా అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసన తెలిపారు. పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో సమ్మె శిబిరాన్ని ఆవాజ్‌ రాష్ట్ర కార్యదర్శి ఎంఎ చిస్టి సందర్శించి సంఘీభావం తెలపగా శిబిరం నుండి ఆర్‌డిఒ కార్యాలయం వరకూ ప్రజా సంఘాలు ప్రదర్శనగా వెళ్లి ఆర్‌డిఒకు విన్నవించాయి. అంగన్వాడీలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ దిష్టిబొమ్మను శిబిరం వద్ద దహనం చేశారు. గుంటూరులో కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు, మాజీ ఎమ్మెల్యే లింగంశెట్టి ఈశ్వరరావు, టిడిపి నాయకులు కనపర్తి శ్రీనివాసరావు, జనసేన పార్టీ నాయకులు బోనబోయిన శ్రీనివాస్‌యాదవ్‌, మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ సోమి శంకరరావు తదితరులు సందర్శించి మద్దతు తెలిపారు. ఎల్‌.ఈశ్వరరావు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో సమ్మె చేసే హక్కు ఉందని, ప్రభుత్వంపై సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత ఉందని అన్నారు. తక్షణమే సమస్యలు పరిష్కరించి, సమ్మె విరమణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. కనపర్తి శ్రీనివాసరావు మాట్లాడుతూ అంగన్‌వాడీలకు తెలంగాణ కంటే వేతనాలు పెంచుతామని గత ఎన్నికలప్పుడు హామీఇచ్చిన వైసిపి ఆ హామీని నిలబెట్టుకోవాలని కోరారు. ఇప్పుడున్న ధరలతో పోల్చితే అంగన్‌వాడీల జీతాలు కుటుంబ పోషణకు ఏమాత్రం సరిపోవని, కావున వేతనాలు పెంచాలని కోరారు. బోనబోయిన శ్రీనివాస్‌ యాదవ్‌ మాట్లాడుతూ అంగన్‌వాడీల ప్రభుత్వ నిర్లక్ష్యం తగదన్నారు. సమస్యలు పరిష్కరించకపోగా, సమ్మెను విచ్ఛిన్నం చేయానికి అనేక ప్రయత్నాలు చేసిందన్నారు. సమ్మె శిబిరానికి అధ్యక్షత వహించిన అంగన్‌వాడీ యూనియన్‌ నగర గౌరవాధ్యక్షులు కె.శ్రీనివాస్‌ మాట్లాడుతూ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యం చేస్తే సమ్మె అంత ఉధృతం అవుతుందని హెచ్చరించారు. ప్రభుత్వం పట్టువీడి సమస్యలు పరిష్కరించాలన్నారు. దీక్షల్లో టి.రాధ, చిన్న వెంకాయమ్మ, మెర్సీ, పద్మ, వేదవతి, శ్రీదేవి, రోజమ్మ, రమాదేవి కూర్చున్నారు. అంగన్వాడీల సమస్యల పరిష్కారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ప్రజా సంఘాల నాయకులు మండిపడ్డారు. కనీస వేతనాలు అమలుతోపాటు గ్రాట్యుటీ ఇవ్వాలని, రిటైర్‌మెంట్‌ బెనిఫిట్లు కల్పించాలని అంగన్వాడీలు పదేపదే విన్నవిస్తున్నా, ఆందోళనలు చేస్తున్నా పాలకుల్లో చలనం ఉండడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని సమ్మె శిబిరం నుండి ఆర్‌డిఒ కార్యాలయం వరకూ ప్రదర్శనగా వెళ్లి ఆర్‌డిఒకు వినతిపత్రం ఇచ్చారు. మార్గం మధ్యలో సమగ్ర శిక్ష ఉద్యోగులు, మున్సిపల్‌ కార్మికుల సమ్మె శిబిరాలను సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌.ఆంజనేయ నాయక్‌ మాట్లాడుతూ న్యాయమైన డిమాండ్లతో అంగన్వాడీలు చేస్తున్న సమ్మెకు తమ పూర్తి మద్దతు ఉంటుందని, కేంద్రాల తాళాలు పగలగొట్టి ఇతర ఉద్యోగుల ద్వారా నడిపించాలనే ప్రభుత్వ యత్నాలను అడ్డుకుంటామని చెప్పారు. తొలుత గాంధీపార్కు వద్ద దీక్ష శిబిరాన్ని ఆవాజ్‌ రాష్ట్ర కార్యదర్శి ఎంఎ చిస్టి సందర్శించి సంఘీభావంగా మాట్లాడారు. పిల్లలు, బాలింతలు, గర్భిణులకు అంగన్వాడీలు అందిస్తున్న సేవల విలువను ప్రభుత్వాలు గుర్తించాలని, వారికి కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయాలని కోరారు. ప్రభుత్వ బెదిరింపులను అధిగమించి అంగన్వాడీలు చేస్తున్న సమ్మెకు తమ పూర్తి మద్దతు ఉంటుందని చెప్పారు. అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి గుంటూరు మల్లీశ్వరి మాట్లాడుతూ హెల్పర్ల ప్రమోషన్లలో నిబంధనలు రూపొందించాలన్నారు. సర్వీసులో చనిపోయిన అంగన్వాడి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ మెనూ ఛార్జిలు పెంచాలని, బకాయిలను విడుదల చేయాలని కోరారు. సరుకులు ఒక యాప్‌ ద్వారా మాత్రమే నిర్వహించే విధంగా చేయాలన్నారు. ఎఐటియుసి జిల్లా సహాయ కార్యదర్శి కె.రాంబాబు మాట్లాడుతూ అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. సమ్మెకు టిడిపి రాష్ట్ర కార్యదర్శి గోనుగుంట్ల కోటేశ్వరరావు మద్దతు తెలిపారు. టిడిపి అధికారంలోకి రాగానే అంగన్వాడీల సమస్యలను పరిష్కరిస్తుందని చెప్పారు. ప్రతిపక్ష నేతగా అనేక హామీలను ఇచ్చిన జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక సమస్యలేమీ పట్టించుకోకుండా రూ.కోట్లు దండుకుంటున్నారని విమర్శించారు. కార్యక్రమంలో యూనియన్‌ అధ్యక్షులు కెపి మెటిల్డాదేవి, సిఐటియు జిల్లా అధ్యక్షులు కె.హనుమంతరెడ్డి, ఉపాధ్యక్షులు గుంటూరు విజయకుమార్‌, వివిధ సంఘాల నాయకులు డి.శివకుమారి, ఏపూరి గోపాలరావు, కె.రామారావు, సిలార్‌ మసూద్‌, వెంకటేశ్వరరాజు, రవిబాబు, టి.శ్రీనివాసరావు, వెంకట్‌, రంగయ్య, శోభారాణి పాల్గొన్నారు.

➡️