చెక్‌ చేస్తానంటూ ట్రాన్స్‌ఫర్‌

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : ఫోన్‌పే యాప్‌ ద్వారా పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లోని పలువురు వ్యాపారులు వద్ద ఆర్థిక మోసాలకు పాల్పడి రూ.11.19 లక్షలు కాజేసిన యువకుణ్ణి పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. అతని వద్ద నుండి రూ.8.67 లక్షలు స్వాధీనం చేసుకోవడంతోపాటు బ్యాంకు ఖాతాలోని రూ.2.26 లక్షలను సీజ్‌ చేశారు. ఈ మేరకు వివరాలను నరసరావుపేటలోని పల్నాడు జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ వై.రవిశంకర్‌రెడ్డి గురువారం వెల్లడించారు. రాజుపాలెం మండలం అంచులవారిపాలేనికి చెందిన వేపూరి శరత్‌బాబు ఇంటర్మీడియట్‌ చదువుతూ మధ్యలోనే ఆపేశాడు. ఆన్‌లైన్‌ బెట్టింగులు, ఇతర వ్యసనాలకు అలవాటుపడి డబ్బుల కోసం అడ్డదారులు తొక్కడం మొదలుపెట్టాడు. రద్దీగా ఉండే దుకాణాల వద్దకు వెళ్లి వస్తువులు కొనుగోలు చేసిన అనంతరం తన ఖాతాలో డబ్బులు లేవని తన బంధువులు ఫోన్‌పే చేస్తారని వ్యాపారులను నమ్మించేవాడు. ముందు ఒక రూపాయి పంపించాలని వ్యాపారులకు చెప్పేవాడు. వారు పంపించే క్రమంలో వారి పిన్‌ నంబర్‌ను గమనించి ఆ తర్వాత డబ్బులు వచ్చాయో లేదో చెక్‌ చేస్తానంటూ దుకాణదారుల ఫోన్‌ తీసుకుని దాని నుండి డబ్బులను తనకు సంబంధించిన బెట్టింగ్‌ రాయుళ్లకు పంపించుకుని క్షణాల్లో అక్కడి నుండి ఉడాయించేవాడు. ఈ విధంగా పల్నాడు జిల్లా నరసరావుపేట, వినుకొండ, ఈపూరు, శావల్యాపురం, నాదెండ్ల, బండ్లమోటు, గురజాల, మాచర్ల, రెంటచింతల, బాపట్ల జిల్లా వెదుళ్లపల్లి, గుంటూరు జిల్లా లాలా పేట, ప్రకాశం జిల్లా ఎర్రగొండ పాలెం, టంగుటూరు పోలీసు స్టేషన్లలో కేసులు నమోద య్యాయి. ఈ నేపథ్యంలో నిందితు డు వినుకొండ పట్టణంలోని వెల్లటూరు రోడ్డులో ఉన్నట్లు పోలీసు లకు సమాచారం అందడొంతో వినుకొండ సిఐ ఎస్‌.సాంబశివరావు ఆధ్వర్య ంలో పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. విచారణలో తాను చేసిన నేరాలను శరత్‌బాబు అంగీకరించినట్లు ఎస్పీ తెలిపారు.
ఆన్‌లైన్‌ మోసాలకు గురైతే చెప్పండి
ఆన్‌లైన్‌ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ వై.రవిశంకర్‌రెడ్డి సూచించారు. అపరిచిత వ్యక్తులకు వ్యక్తిగత సమాచారం కానీ బ్యాంక్‌ ఖాతా వివరాలు, ఫోన్లు ఇవ్వరాదని, ఫోన్‌ పే పాస్‌వర్డ్‌ ఎదుటివారికి కనపడే విధంగా టైప్‌ చేయొద్దని సూచించారు. బ్యాంక్‌ నుండి ఫోన్‌ చేస్తున్నామని ఖాతా వివరాలు ఓటిపి వంటివి ఎట్టి పరిస్థితుల్లో చెప్పరాదన్నారు. ఒకవేళ ఎవరైనా ఆన్‌లైన్‌ మోసానికి గురై నగదు కోల్పోతే తక్షణమే సైబర్‌ క్రైమ్‌ హెల్ప్‌ డెస్క్‌ 1930 నంబర్‌కు ఫోన్‌ చేసి వివరాలు చెప్తే బాధితుని ఖాతా నుండి నగదు ఏ ఖాతాకు బదిలీ అయ్యాయో ఆ ఖాతాను డబ్బులు ఏ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్‌ అయ్యాయో తెలుసుకొని ఆ ఖాతాను ఫ్రీజ్‌ చేసి బాధితునికి నగదును వెనక్కి ఇప్పిస్తామని తెలిపారు.

➡️