ప్రజాశక్తి-పాడేరు టౌన్: నోటి భద్రతతోనే ఆరోగ్యం సాధ్యమని, తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ హేమలత తెలిపారు. వరల్డ్ ఓరల్ హెల్త్ డే సందర్భంగా డెంటల్ సర్జన్ హ్యాపీ క్రిస్టియన్ రాజు ఆధ్వర్యంలో పాడేరులోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ఆధ్వర్యాన శనివారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక సుండ్రుపుట్టు ఎంపిపి పాఠశాలలో మెడికల్ క్యాంపు నిర్వహించారు. వందమంది చిన్నారులతో పాటు పాఠశాల సిబ్బందికి ఉచితంగా దంత పరీక్షలు చేశారు. చిన్నారులకు మందులు, టూత్ బ్రష్, టూత్ పేస్ట్, టంగ్ క్లీనర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హ్యాపీ క్రిస్టియన్ రాజు మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరికి నోటి ఆరోగ్యం చాలా అవసరమన్నారు. ప్రతిరోజు గోరువెచ్చటి నీటితో పుక్కిలించాలని, ఉదయం, రాత్రి దంతాలను శుభ్రం చేసుకోవాలని తెలిపారు. నోటిని పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పలు వ్యాధులు దరి చేరవన్నారు. దంతాలను సరియైన విధానంలో శుభ్రం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ కాలేజ్ సూపరింటెండెంట్ డాక్టర్ విశ్వమిత్ర, డిఎంఅండ్ హెచ్‌ఓ డాక్టర్ జమాల్ భాషా పాల్గొన్నారు.
