Mar 16,2025 21:39

పది పరీక్షలకు సర్వం సిద్ధం

డిఇఒ ఇవివిఎన్‌ఎస్‌ఎస్‌బిఎల్‌. నారాయణ

ప్రజాశక్తి – భీమవరం జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి ఏప్రిల్‌ 1వ తేదీ వరకూ నిర్వహించబోయే పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు సర్వం సిద్ధం చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఇవివిఎన్‌ఎస్‌ఎస్‌బిఎల్‌.నారాయణ తెలిపారు. జిల్లాలో 128 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని, సుమారు 24,398 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ విధించడం జరిగిందన్నారు. నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతించేది లేదని స్పష్టం చేశారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 1600 మంది అధికారులు పరీక్షల విధులు నిర్వహించనున్నారని తెలిపారు. పది పరీక్షల నిర్వహణకు సంబంధించి ప్రజాశక్తి నిర్వహించిన ముఖాముఖిలో డిఇఒ నారాయణ వివరాలు వెల్లడించారు. ప్రశ్న : ఎంతమంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు?డిఇఒ : జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది 24,393 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. దీనిలో బాలురు 11,919 మంది, బాలికలు 10,847 మంది ఉన్నారు. కంపార్ట్మెంట్లో మరో 2,228 మంది, ఓపెన్‌ విద్యార్థులు మరో 500 మంది పరీక్షలు రాయనున్నారు.ప్రశ్న : ఎన్ని పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు?డిఇఒ : జిల్లాలో 128 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశాం. అలాగే ఓపెన్‌ కేటగిరిలో పరీక్షలు రాసే విద్యార్థులకు 7 కేంద్రాలను ఏర్పాటు చేశాం. ప్రశ్న : పరీక్షల విధులకు ఎంతమంది అధికారులను నియమించారు? డిఇఒ : చీఫ్‌ సూపరింటెండెంట్లు 128 మంది, డిపార్ట్మెంట్‌ అధికారులు 128 మంది, రూట్‌ అధికారులు 23 మంది, ఏడు సెట్టింగ్‌ స్క్వాడ్లు, ఇన్విజిలేటర్లో కలిపి మొత్తంగా 1,600 మంది అధికారులను పరీక్షల విధులకు నియమించాం.ప్రశ్న : పరీక్షలు ఎప్పటి వరకూ కొనసాగుతాయి? డిఇఒ : ఈ నెల 17 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 31వ తేదీ వరకూ కొనసాగునున్నాయి. ఒక వేళ 31వ తేదీన రంజన్‌ పండగ వస్తే ఏప్రిల్‌ 1వ తేదీ వరకూ జరుగుతాయి. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 వరకూ జరుగుతాయి. గంట ముందుగా విద్యార్థులు పరీక్షా కేంద్రానికి హాజరు కావాలి. నిమిషం ఆలస్యమైనా అనుమతించే ప్రసక్తి ఉండదు. ఈ విషయాన్ని విద్యార్థులు గమనించాలి.ప్రశ్న : పరీక్షా కేంద్రాలో ఎటువంటి సౌకర్యాలు కల్పించారు.డిఇఒ : పరీక్షా కేంద్రాల్లో అన్ని సౌకర్యాలూ కల్పించాం. కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ విధించాం. కేంద్రానికి 100 మీటర్ల దూరంలో ఎటువంటి జిరాక్స్‌ షాపులు లేకుండా చర్యలు చేపట్టాం. పరీక్షా కేంద్రంలోకి ఎటువంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలు అనుమతించం. అలాగే పరీక్షా కేంద్రం వద్ద తాగునీరు, మరుగుదొడ్లు, మెడికల్‌ క్యాంపు, ఒఆర్‌ఎస్‌ ప్యాకెట్లు ఏర్పాటు చేశాం. నిరంతరం విద్యుత్తు అందుబాటులో ఉంచే విధంగా ముందస్తు చర్యలు చేపట్టాం. ముఖ్యంగా విద్యార్థులు హాల్‌ టికెట్‌ చూపిస్తే ఉచిత ఆర్‌టిసి బస్సు ప్రయాణం కల్పించే విధంగా చర్యలు తీసుకున్నాం.ప్రశ్న : సమస్యాత్మక పరీక్షా కేంద్రాలు ఉన్నాయా?డిఇఒ : తాడేపల్లిగూడెం, పెంటపాడు, పెనుగొండ, ఆచంట, పాలకోడేరు, నరసాపురం మండలాల్లోని ఆరు సంవత్సరాల పరీక్షా కేంద్రాలను గుర్తించాం. ఈ కేంద్రాల్లో సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు జరుగుతాయి. కావాలని సమస్యలు సృష్టిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి వెనకాడం.ప్రశ్న : విద్యార్థులకు మీరిచ్చే సూచనలు ఏంటి?డిఇఒ : ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాసే విధంగా అన్ని ఏర్పాట్లూ పకడ్బందీగా చేశాం. విద్యార్థులు ఆందోళనకు గురికాకుండా పరీక్షలు రాయాలి. సమయపాలన పాటించి పరీక్షలు రాయాలి. తల్లిదండ్రులు విద్యార్థులను ప్రోత్సహించాలి. ముందుగానే పరీక్షా కేంద్రాలకు రావాలి. అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే సమయస్ఫూర్తి ఎంతో కావాలి. దీనికి అనుకూలంగా విద్యార్థులు నడుచుకోవాలి.

➡️