– రాష్ట్రంలో పెట్టుబడులకు ప్రోత్సాహకాలు
– వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ వీరపాండ్యన్
ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : రాష్ట్రంలో ఫార్మా రంగానికి ఉజ్వల భవిష్యత్తు ఉందని, ఈ రంగంలో పెట్టుబడి పెట్టే పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం తగిన ప్రోత్సహకాలు ఇస్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ జి.వీరపాండ్యన్ తెలిపారు. బెంగళూరుకు చెందిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మేనేజ్‌మెంట్ రీసెర్చ్ ఆధ్వర్యంలో గుంటూరులోని ఒక హోటల్‌లో ‘ఫార్మా టెక్ కవరేజి-2025’ అనే అంశంపై శుక్రవారం సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దేశంలో 60 శాతం వ్యాక్సిన్‌లు రాష్ట్రంలోనే తయారవుతున్నాయని తెలిపారు. జనరిక్ మెడిసిన్స్‌లో అత్యధిక తయారీ, విక్రయాలు రాష్ట్రంలోనే ఉన్నాయని తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో రాష్ట్రంలోని వైద్యులు ముందంజలో ఉన్నారని, ఆర్టిఫిషియల్ ఇంటిల్‌జెన్స్ (ఎఐ) కూడా వైద్య రంగంలో ఉపయోగించుకునేందుకు ప్రభుత్వం తగిన విధంగా ప్రోత్సహిస్తోందని తెలిపారు. విశాఖలో మెడ్‌టెక్ జోన్‌ను ఏర్పాటు చేసి వంద ఫార్మా కంపెనీల ఏర్పాటుకు అనుమతి ఇచ్చినట్లు చెప్పారు. ˜ార్మా రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తే ప్రభుత్వం తగిన చేయూతను ఇస్తుందన్నారు. ఎన్‌టిఆర్ వైద్య సేవ సిఇఒ, రాష్ట్ర డ్రగ్స్ కంట్రోల్ డైరక్టర్ జనరల్ పి.రవి సుభాష్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలు, రిమోట్ ఏరియాలకు కూడా ప్రభుత్వం మందుల సరఫరాను పెంచిందన్నారు. సిప్లా కంపెనీ బిజినెస్ యూనిట్ హెడ్ ఎస్.బెనర్జి, ఇఎస్‌ఐ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్, మాజీ ఐఎఎస్ అధికారి డాక్టర్ కె.ఎస్.కేదర్, బెంగళూరు ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మేనేజ్‌మెంట్ రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ ఉషా మంజునాథ్, ఫార్మా కంపెనీల నిర్వహాకులు, ఫార్మా విద్యార్థులు పాల్గన్నారు.
