- ‘ఓటుకు నోటు’ కేసులో సుప్రీం ధర్మాసనం
- తదుపరి విచారణ సెప్టెంబర్ 2కు వాయిదా
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కేవలం అపోహలతో విచారణ బదిలీ చేస్తే దేశ న్యాయ వ్యవస్థపై నమ్మకం లేనట్టేనని’ఓటుకు నోటు’ కేసు విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. అయితే ప్రస్తుత స్థితిలో ఓటుకు నోటు విచారణ బదిలీ పిటిషన్‌ను ముందస్తుగా రద్దు చేయడం లేదని స్పష్టం చేసింది. అలాగే ఢిల్లీ మద్యం కేసులో కవిత బెయిల్‌పై సిఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ధర్మాసనం తప్పుబట్టింది. ఈ వ్యవహారంలో సిఎంను మందలించింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారని, ఆయన దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశాలున్నాయని, అందుకనే ఆ కేసును మధ్యప్రదేశ్‌కు బదిలీ చేయాలని ఈ ఏడాది జనవరి 31న బిఆర్‌ఎస్ నేతలు, మాజీ డిప్యూటీ సిఎం మహ్మద్ అలీ, మాజీ మంత్రులు జగదీశ్ రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజరు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను గురువారం సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ పికె మిశ్రా, జస్టిస్ కెవి విశ్వనాథన్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారించింది.
తెలంగాణ ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహిత్గి, సిద్దార్థ్ లూత్రా, మేనకా గురుస్వామి హాజరవ్వగా, , పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాదులు ఆర్యమా సుందరం, దామా శేషాద్రి నాయుడు, మోహిత్ రావులు హాజరయ్యారు. గురువారం ఉదయం ఈ కేసు విచారణకు చేపట్టినప్పుడు ఈ కేసులో నిందితుడు సిఎంగా ఉన్నారని, హౌంశాఖ, అవినీతి నిరోధక శాఖలు స్వయంగా ఆయన చేతిలో ఉన్నాయని తెలిపారు. అంతేకాకుండా ఈ కేసులో ప్రత్యక్ష సాక్షులను, దర్యాప్తు సంస్థల అధికారులను ఇంకా విచారించలేదన్నారు. దీనికి ప్రభుత్వ తరపు న్యాయవాదులు ముకుల్ రోహిత్గి, సిద్దార్థ లూత్రా, మేనకాగురుస్వామిలు అభ్యంతరం తెలిపారు. మొదటి నుంచి కేసు దర్యాప్తు అధికారుల్లో ఎలాంటి మార్పు లేదని కోర్టకు నివేదించారు. ఆగష్టు 2021లో జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణను నిలిపివేసిందని నివేదించారు. ఈ సందర్భంగా జస్టిస్ బిఆర్ గవాయి స్పందిస్తూ కేవలం అపోహలతో విచారణను బదిలీ చేస్తే దేశ న్యాయ వ్యవస్థపై నమ్మకం పోతుందని వ్యాఖ్యానించారు. 2021 నుంచి స్టే అమలులో ఉందని, 2024 ఎన్నికల తరువాత పిటిషనర్లు కోర్టును ఆశ్రయించారని పేర్కొంది. విచారణ బదిలీని నిరాకరిస్తూనే, ఇరు పక్షాల్లో విశ్వాసాన్ని నింపేలా స్వతంత్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పిపి)ను ఏర్పాటు చేస్తామని, ఈ పిటిషన్‌ను డిస్మిస్ చేస్తామని వ్యాఖ్యానించింది.
తెలంగాణ సిఎం సైతం దేశ అత్యున్నత న్యాయస్థానం పట్ల గౌరవం లేకుండా, ఇలాంటి ప్రవర్తనే కలిగి ఉంటే, ఆయన తెలంగాణకు వెలుపల కోర్టులో విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.. ప్రభుత్వ తరపు న్యాయవాదులు ముకుల్ రోహిత్గి జోక్యం చేసుకొని సిఎం పక్షాన క్షమాపణ చెప్పగా, మరో న్యాయవాది సిద్ధార్థ లూత్రా సిఎంకు కౌన్సిలింగ్ చేస్తామని ధర్మాసనానికి తెలిపారు. మరోవైపు పిటిషనర్ తరపు న్యాయవాది శేషాద్రి నాయుడు స్పందిస్తూ సుప్రీంకోర్టు గురించి సిఎం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు, హైకోర్టు, దిగువ కోర్టుల్లో న్యాయమూర్తుల పరువు గురించి ఎలాంటి ఆందోళనలు ఉంటాయో ఆలోచించాలన్నారు. కాగా, పిపి నియామకం విషయంలో వి. సురేందర్ రావు(ప్రస్తుతం సిఎం కేసులో ప్రాసిక్యూటర్), ఉమా మహేశ్వర్ రావు పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకొని ధర్మాసనం, తదుపరి విచారణను సెప్టెంబర్ 2కు వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది. పిటిషన్ కోరినట్లు విచారణ బదిలీ అంశాన్ని ప్రస్తుత స్థితిలో రద్దు చేయలేమని స్పష్టం చేసింది.