భీమవరం సమగ్రాభివృద్ధికి చర్యలు

ప్రజాశక్తి – భీమవరం

భీమవరం పట్టణాభివృద్ధిపై పక్కా ప్రణాళికతో దృష్టి సారించామని కలెక్టర్‌ చదలవాడ నాగరాణి తెలిపారు. మంగళవారం లోసరి రోడ్డులోని యనమదుర్రు గట్టుపై చెత్త డంపింగ్‌ ప్రాంతంలో ఏర్పాటు చేసిన చెత్త ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ నిబంధనలు అనుసరించి ప్రతి పట్టణంలో గత 20 సంవత్సరాలుగా భూమిలో నిక్షిప్తమైన లెగసి వ్యర్థాలను తవ్వి తీసి ట్రీట్మెంట్‌ ప్లాంట్‌ ద్వారా మట్టిగా మార్చే ప్రక్రియను చేపట్టాల్సి ఉందన్నారు. దీనిలో భాగంగా 12 వేల మెట్రిక్‌ టన్నుల వ్యర్థాలే లక్ష్యంగా మట్టిగా మార్చే ప్రక్రియ చేపడుతున్నామని, దీని నిమిత్తం అయ్యే ఖర్చు మొత్తం రూ.96 లక్షలు సంబంధిత ఏజెన్సీకి ప్రభుత్వం చెల్లిస్తుందని అన్నారు. వ్యర్థాలు ట్రీట్మెంట్‌ ప్లాంట్‌లో ప్రాసెస్‌ అయిన తర్వాత వచ్చే మట్టి వంటి మెటీరియల్‌ను ఖాళీ స్థలాల్లో డంపింగ్‌ చేసి పూడ్చుకోవడానికి ఉపయోగిస్తామన్నారు. ఇప్పటికే లెగిసి వ్యర్ధాల ట్రీట్మెంట్‌ ప్రారంభమైందన్నారు. దీని కారణంగా భూగర్భ జలాలు కలుషితం కాకుండా ఉండటంతోపాటు ఏళ్లతరబడి భూమిలో పొరల్లో కరగకుండా మిగిలిపోయిన ప్లాస్టిక్‌ వ్యర్థాలు ట్రీట్మెంట్‌ ప్లాంట్‌ ద్వారా మట్టిగా మార్పు చెందుతాయన్నారు. ప్రతి నగరంలో చెత్త అనేది పెద్ద సమస్యగా తయారైందని, ట్రీట్మెంట్‌ ప్లాంట్‌ ద్వారా దీనికి పరిష్కారం లభిస్తుందన్నారు. అనంతరం నగరంలోని బివి.రాజు పార్కును సందర్శించి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. కొలనులోని నీటిని ఫిల్టరైజేషన్‌ ప్రక్రియ ద్వారా స్వచ్ఛంగా ఉండేటట్లు చూడాలన్నారు. పార్కింగ్‌ ప్రదేశం, పార్కుకు వెనుక భాగంలో ఏర్పాటు చేసిన ప్రవేశద్వారాన్ని పరిశీలించి, ద్వారానికి ఆనుకుని ఉన్న తోపుడుబళ్లను వెంటనే తొలగించాలని ఆదేశించారు. అనంతరం గతంలో తాడేరు రోడ్డులో డంపింగ్‌ యార్డు నిమిత్తం కొనుగోలు చేసిన 6.5 ఎకరాల భూమిని పరిశీలించి, డంపింగ్‌కు అడ్డంకిగా ఉన్న విషయాలపై ఆరా తీశారు. ఈ స్థలాన్ని వాటర్‌ ఎనర్జీ ప్లాంట్‌ లేదా బయోగ్యాస్‌ మిథైన్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు వినియోగించాలని మున్సిపల్‌ కమిషనర్‌కు సూచించారు. తరచూ నగరంలో అన్ని ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో సందర్శించి ఆయా ప్రాంతాల అభివృద్ధికి చేపట్టాల్సిన పనులపై ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లనున్నట్లు కలెక్టర్‌ వెల్లడించారు. ఈ పర్యటనలో కలెక్టర్‌ వెంట భీమవరం మున్సిపల్‌ కమిషనర్‌ ఎం.శ్యామల, మున్సిపల్‌ ఇంజినీర్‌ త్రినాధ్‌రావు, అసిస్టెంట్‌ కమిషనర్‌ ఎ.శ్రీవిద్య, తహశీల్దార్‌ రావి రాంబాబు, సర్వే, మున్సిపల్‌, రెవెన్యూ శాఖల సిబ్బంది ఉన్నారు.

➡️