కలెక్టర్ వెట్రిసెల్వి
ప్రజాశక్తి – ఏలూరు
ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని, ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిగేలా చూడాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో ఆమె జిల్లా అధికారులతో మాట్లాడారు. పరీక్షా పత్రాలు భద్రపర్చే కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ నెల 17 నుండి 31వ తేదీ వరకు పదో తరగతి రెగ్యులర్ వారికీ, 17 నుండి 28వ తేదీ వరకూ ఓపెన్ స్కూల్స్ విద్యార్థులకు పరీక్షలు ఉదయం 9.30 గంటల నుండి 12.45 వరకు జరుగుతాయన్నారు. రెగ్యులర్, ప్రయివేటు కలిపి జిల్లాలో 133 కేంద్రాల్లో 25,179 మంది విద్యార్ధులు హాజరు కానున్నారని తెలిపారు. ఓపెన్ స్కూళ్ల నుండి 793 మంది విద్యార్థులకుగాను 17 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా పరీక్షల సమయంలో అవసరమైన బస్సులను నడపాలని ఆర్‌టిసి అధికారులను ఆదేశించారు. ఈ పరీక్షలు కట్టుదిట్టంగా, ఎక్కడా కాపీయింగ్ జరగకుండా నిర్వహించాలన్నారు. పరీక్షలు నిర్వహించే సమయంలో అన్ని పరీక్షా కేంద్రాల పరిధిలో 163-బి సిఆర్‌పిసి సెక్షన్ అమలు చేయాలని, జిరాక్స్ కేంద్రాలను, నెట్ సెంటర్లను మూసి వేయాలని అన్నారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంతోపాటు ముందస్తుగా పరిశీలన చేసుకోవాలన్నారు. దీనికి ముందు అమరావతి నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌తోపాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఎస్‌ఎస్‌సి పరీక్షలకు సంసిద్ధత, రాబోయే కలెక్టర్ల కాన్ఫరెన్స్ కోసం సూచనలు, స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమం, సానుకూల ప్రజావగాహన, పి4 మోడల్ సర్వే తదితర అంశాలపై కలెక్టర్లు, ఎస్‌పిలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా పదో తరగతి పరీక్షల నిర్వహణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇతర చర్యలపై పలు కీలక సూచనలు చేశారు. పరీక్షా కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లను అనుమతించరాదని స్పష్టం చేశారు. పరీక్షల నిర్వణపై సోషల్ మీడియాలో ఎటువంటి రూమర్లకూ తావులేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఒ వాసుదేవరావు, డిఇఒ వెంకటలక్ష్మమ్మ, డివిఇఒ ప్రభాకరరావు, ఎపిఇపిడిసిఎల్ ఎస్‌ఇ పి.సాల్మన్‌రాజు, డిసిహెచ్‌ఎస్ డాక్టర్ పాల్ సతీష్, డ్వామా పీడీ సుబ్బారావు, డిపిఒ కె.అనురాధ, ఆర్‌టిసి డిఎం బి.వాణి, డిఎంహెచ్‌ఒ డాక్టర్ ఆర్.మాలిని, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
