Kazakhstan: కజకిస్తాన్‌లో కూలిన విమానం

30 మందికిపైగా మృతి
మాస్కో : అజర్‌బైజాన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం 67 మంది ప్రయాణికులతో వెళ్తుండగా కజకస్తాన్‌ నగరమైన అక్టౌలో బుధవారం కూలిపోయింది. ఈ ప్రమాదంలో 30 మందికి పైగా ప్రయాణికులు మరణించారు. ప్రమాద సమయంలో విమానంలో ఐదుగురు సిబ్బందితో సహా 67 మంది ఉన్నారని కజకస్తాన్‌ అత్యవసర వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇప్పటివరకు నాలుగు మృత దేహాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రాధమిక సమాచారం ప్రకారం చనిపోయినవారిలో ఇద్దరు విమాన పైలట్లు కూడా ఉన్నారు. అక్టౌ నగరానికి 3కిలోమీటర్ల దూరంలో విమానం అత్యవసరంగా దిగిందని అంతకుముందు అజర్‌బైజాన్‌ ఎయిర్‌లైన్స్‌ తెలిపింది. అజర్‌బైజాన్‌ రాజధాని బాకూ నుండి బయలుదేరిన ఈ విమానం రష్యా నగరమైన గ్రోజ్నీకి వెళ్ళాల్సి వుంది. ప్రయాణికుల్లో 37 మంది అజర్‌బైజాన్‌ పౌరులు కాగా, 16 మంది రష్యన్లు, ఆరుగురు కజక్‌ జాతీయులు, ముగ్గురు కిర్గిస్తాన్‌ జాతీయులు వున్నారని ఎయిర్‌లైన్స్‌ ఒక ప్రకటనలో పేర్కొంది. అగ్ని గోళంలా భూమిపై కూలిపోవడానికి ముందుగా విమానం ఒక్కసారిగా బాగా కిందకు వంగినట్లు మొబైల్‌ ఫోన్‌ ఫుటేజీ ద్వారా తెలుస్తోంది. విమానం ప్రధాన భాగం విడిపోయి దూరంగా పడిపోయినట్లు మరో వీడియోలో తెలుస్తోంది. బతికి బయటపడిన వారు విమాన శిధిలాల్లో చిక్కుకున్న వారిని లాగడం కూడా కనిపిస్తోంది. ఫ్లైట్‌ రాడార్‌ నుండి అందిన డేటా ప్రకారం కూలిపోవడానికి కొద్ది నిముషాలు ముందు విమానం గాల్లోనే పల్టీలు కొట్టినట్లుగా భావిస్తున్నారు. జిపిఎస్‌ జామింగ్‌ కూడా ఒక కారణమై వుండవచ్చని ఫ్లైట్‌ రాడార్‌ పేర్కొంది. సంఘటనా స్థలంలోనే దర్యాప్తు జరపడానికి అధికారుల బృందం అక్కడకు బయలుదేరి వెళ్ళింది. సంఘటన పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేసిన అజర్‌బైజాన్‌ అధ్యక్షుడు ఇల్హామ్‌ అలియెవ్‌ బాధితుల కుటుంబాలకు సానుభూతిని తెలియచేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌, అలియెవ్‌తో మాట్లాడి విషయాలు తెలుసుకున్నారు.

➡️