రఘురామకు మొండిచెయ్యి

Mar 25,2024 08:28 #BJP, #seats, #Tickets
  • టికెట్‌ రాకుండా చక్రం తిప్పిన వైసిపి
  • ఆరు లోక్‌సభ స్థానాలకు బిజెపి అభ్యర్థుల ప్రకటన
  • సీట్ల కేటాయింపులో వలసవాదులకు పెద్దపీట

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ఎన్‌డిఎ కూటమిలో బిజెపి అభ్యర్థిగా నరసాపురం ఎంపి రఘురామ కృష్ణరాజుకు టికెట్‌ దక్కుతుందని అందరూ ఊహించినప్పటికీ బిజెపి కేంద్ర నాయకత్వం ఆయనకు ఝలక్‌ ఇచ్చింది. ఆదివారం ప్రకటించిన ఐదో విడత లోక్‌సభ అభ్యర్థుల జాబితాలో నరసాపురం సీటు వేరొకరికి కేటాయించింది. గత నాలుగేళ్లుగా సిఎం జగన్‌పై తనదైన శైలిలో రఘురామ విమర్శలు చేశారు. ఇటీవల తాడేపల్లిగూడెంలో జరిగిన టిడిపి, జనసేన బహిరంగ సభలోనూ నరసాపురం నుంచి తప్పకుండా పోటీ చేస్తానని రఘురామ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎట్టి పరిస్థితుల్లోనూ రఘురామకు టికెట్‌ దక్కకూడదంటూ వైసిపి అధిష్టానం తనకు అనుకూలమైన బిజెపి నేతలతో కేంద్ర నాయకత్వంపై ఒత్తిడి తెచ్చి టికెట్‌ లేకుండా చేయడంలో సక్సెస్‌ అయిందనే వాదన రాజకీయ వర్గాల్లో వినబడుతోంది. రాష్ట్రానికి సంబంధించి ప్రకటించిన ఆరు లోక్‌సభ స్థానాల్లో ఐదుగురు ఇతర పార్టీల నుంచి బిజెపిలో చేరినవారే కావడం గమనార్హం. దీంతో బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ అనుకూల నేతలకు టికెట్లు దక్కలేదు. సీట్లు దక్కించుకున్న వారిలో అరకు (ఎస్‌టి) కొత్తపల్లి గీత, అనకాపల్లి నుంచి సిఎం రమేష్‌, రాజమండ్రి నుంచి దగ్గుబాటి పురందేశ్వరి, నరసాపురం నుంచి భూపతిరాజు శ్రీనివాసవర్మ, తిరుపతి (ఎస్‌సి) నుంచి గూడూరు వైసిపి ఎమ్మెల్యే వరప్రసాదరావు, రాజంపేట నుంచి మాజీ సిఎం ఎన్‌ కిరణ్‌కుమార్‌రెడ్డి ఉన్నారు. దేశవ్యాప్తంగా 111 మంది పేర్లతో బిజెపి తన ఐదో జాబితాను ప్రకటించింది. హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ నియోజకవర్గం నుంచి బిజెపి అభ్యర్థిగా బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ పోటీ చేయనున్నారు. ఈ జాబితాలో మేనకా గాంధీ (యుపిలోని సుల్తాన్‌పూర్‌ నియోజకవర్గం), ఉత్తరప్రదేశ్‌ మంత్రి జితిన్‌ ప్రసాద, సీతా సోరెన్‌ (డుంకా) కూడా చోటు లభించింది.

నేడు అసెంబ్లీ అభ్యర్థుల ప్రకటన !

టిడిపి, జనసేనతో సర్దుబాట్లలో భాగంగా బిజెపి 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తోంది. అధికారికంగా ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రకటన సోమవారం వెలువడనుందని బిజెపి వర్గాలు పేర్కొంటున్నాయి. విజయవాడ వెస్ట్‌ నుంచి కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి, కైకలూరు నుంచి మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్‌, జమ్మలమడుగు నుంచి మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, ధర్మవరం నుంచి బిజెపి జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ పేర్లు ఖరారైనట్లు సమాచారం. మిగిలిన సీట్లలో అభ్యర్థులు ఎవరనే విషయం ఇంకా నిర్ధారణ కాలేదు.

➡️