ప్రజాశక్తి-మదనపల్లె అర్బన్ రాష్ట్రాన్ని నిట్టనిలువునా ముంచిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి రాష్ట్రంలో పర్యటించే అర్హత లేదని సిపిఎం జిల్లా కన్వీనర్ పి.శ్రీనివాసులు అన్నారు. మంగళవారం పట్టణంలోని మార్కెట్ యార్డు వద్ద సిపిఎం ఆధ్వర్యంలో 8వ తేదీ మోడీ రాష్ట్ర పర్యటనను నిరసిస్తూ గో బ్యాక్ మోడీ అంటూ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విభజన చట్టంలో భాగంగా కడప ఉక్కు పరిశ్రమను రూ.20 వేల కోట్ల పెట్టుబడి అంచనాతో 20 లక్షల టన్నుల సామర్థ్యంతో, ప్రత్యక్షంగాను, 25 వేలు పరోక్షంగాను, లక్ష మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలిపిస్తామని గత పదేళ్లుగా చెప్పిన బిజెపి ఇప్పుడు కడప ఉక్కు మా పరిశీలనలో లేదని చేతులెత్తేసిందని విమర్శించారు. రాష్ట్ర విభజన హామీలు అమలు చేయకుండా, వెనుకబడిన ప్రాంతాలకు నిధులు ఇవ్వకుండా పదేళ్లుగా మోసం చేసిన బిజెపి తెలుగుదేశం, జనసేన పార్టీల ఊతకర్రల సహాయంతో మూడోసారి కేంద్రంలో అధికారం చేపట్టి రాష్ట్రానికి అన్యాయం చేయగలుగుతందంటే అందుకు అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలే కారణమన్నారు. ఆంధ్రుల హక్కుగా సాధించుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకునేందుకు సుమారు రెండేళ్లుగా కార్మికులు, ప్రజలు పోరాడుతున్న విశాఖపట్నానికి ప్రధాని రావడం ఆంధ్రులను అగౌరపరచడమేనన్నారు. అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి నుండి మొదలుకొని చంద్రబాబు, జగన్ మోహన్‌రెడ్డిల వరకు అందరూ కడపలో ఉక్కు పరిశ్రమను నిర్మించాలని శంకుస్థాపన చేశారని, మాటలు కోటలు దాటినా కాలు గడప కూడా దాటలేదన్న చందంగా ఏళ్ళు గడచిన కడప ఉక్కు పరిశ్రమ ఒక్క అడుగు ముందుకు పడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పునర్విభజన చట్టం-2014 ప్రకారం ప్రభుత్వరంగంలోనే కడపలో భారీ ఉక్కు పరిశ్రమను నిర్మిస్తామని అప్పటి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని, ఇప్పటి అధికార బిజెపి బలపరచిందని గుర్తు చేశారు. కడపలో ఉక్కు పరిశ్రమ స్థాపిస్తామని, రాయసీమలో రెండో రాజధాని, కర్నూలులో హైకోర్టు ఏర్పాటు, సాగునీటి ప్రాజెక్టులకు రూ.20వేల కోట్ల నిధులు అంటూ కర్నూలులో 16 డిమాండ్లతో కూడిన ‘రాయలసీమ డిక్లరేషన్’ను బిజెపి ప్రకటించిందన్నారు. వీటిలో ఒక్కటంటే ఒక్కటి అమలు చేయకుండా రాయలసీమకు ద్రోహం చేసిందన్నారు. విభజిత ఆంధ్రప్రదేశ్లో వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజీ ఇస్తామని ఏడు జిల్లాలకు, జిల్లాకు ఏడాదికి రూ.50 కోట్ల చొప్పున మూడేళ్లు మాత్రమే ఇచ్చి దగా చేసిందన్నారు. ఐఐఐటి, రైల్వే కోచ్ నిర్మాణ పరిశ్రమ, తిరుపతిలో కండలేరు ప్రాజెక్టు, చిత్తూరులో చెన్నై-విశాఖ పారిశ్రామిక కారిడార్, అనంతపురం జిల్లాలో కేంద్రీయ విశ్వవిద్యాలయం, బెల్, నాసెన్ పరిశ్రమలు, టైమ్ స్టైల్ పార్క్ ఇలా ఏ ఒక్క హామీ ఇప్పటికీ పూర్తి చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హౌదా ఇస్తామంటూ, పూటకోమాట మార్చి రాష్ట్ర ప్రజలను నమ్మించి ద్రోహం చేసి నట్టేటముంచిందని విమర్శించారు. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరిస్తూ, ప్రైవేట్ రంగంలో మిట్టల్ కంపెనీకి అనుమతులు ఇచ్చిందన్నారు. రాష్ట్రంలోని ఓడరేవులు, రోడ్లు, రైల్వేలైన్లు ఆదాని కంపెనీకి అప్పగించిందని,సోలార్, గాలిమరల విద్యుత్ ఉత్పత్తి పేరుతో రాయలసీమలోవేల ఎకరాల భూములను కార్పొరేట్ కంపెనీలకు అప్పగిస్తోందన్నారు. ఇన్ని రకాలుగా ఆంధ్రప్రజలను దగా చేస్తున్న బిజెపిని నిలదీయాల్సిన టిడిపి, జనసేన వారి సేవలో తరిస్తున్నాయని, ప్రతిపక్షంలో ఉండి కూడా కేంద్రం చేస్తున్న అన్యాయంపై ఒక్క మాట మాట్లడలేని స్థితిలో వైసిపి ఉందన్నారు. బిజెపి చేస్తున్న అన్యాయాలపై ప్రజలు నిల దీయాలనీ, సిపిఎంతో కలసి రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు హరిశర్మ, నాగరాజు, నరసింహ, జయబాబు, శ్రీరాములు, నాగరాజ, పాపిరెడ్డి, అర్షిద్, రమణ పాల్గొన్నారు. రాయచోటి టౌన్ : సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం స్థానిక బస్టాండ్ ఎదురుగా సిపిఎం ధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ అభివద్ధికి అన్యాయం చేసిన మోడి గో బ్యాక్ అంటూ నిరసన తెలిపారు. ఈ సందర్బంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎ.రామాంజులు మాట్లాడుతూ 2000-2006 సంవత్సరాల కాలంలో రాయలసీమ తీవ్ర కరువుతో లక్షలాది మంది పేదలు వలస బాట పడితే వేలాది రైతులు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి నుండి తేరుకోక ముందే 2014లో రాష్ట్రాన్ని తమ స్వార్థ రాజకీయాల కోసం అడ్డుగోలుగా విభజించారని చెప్పారు. విభజన హామీలు అమలుచేయలేదని అన్నారు. కడప ఉక్కు శంకుస్థాపనలతోనే సరిపెట్టారని, వెనుకబడిన జిల్లాలకు బుందేల్ తరహా ప్యాకేజి ఇస్తామని ఆంధ్రప్రదేశ్‌కు పదేళ్ల వరకు ప్రత్యేక హోదా కలిపిస్తామని, పరిశ్రమలు తెస్తామని నేడు ఉన్న విశాఖ ఉక్కును అమ్మడానికి ప్రయత్నిస్తున్నారని వాపోయారు. బసవన్నల పాలక ప్రతిపక్షాలు వ్యవహారిస్తున్నాయన్నారు. ఎపి మత ఘర్షణలకి అడ్డాగా మారుతున్న నేపథ్యంలో సిపిఎం ఆంధ్రప్రదేశ్ అభివద్ధిని ప్రశ్నిస్తోందని అందుకే మోడి గో బ్యాక్ కార్యక్రమం చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో సిపిఎం శాఖ కార్యదర్శి జి. మాధవయ్య, కె.నాగబసిరెడ్డి, సిఐటియు నాయకులు యం. చెన్నయ్య సురేంద్ర, బాషా, రెడ్డెయ్య, ఖాదర్ వలి పాల్గొన్నారు.