ఆలయ పునరుద్ధరణ పేరిట బిజెపి మతతత్వ అజెండా
పాట్నా : బీహార్‌లో ఈ ఏడాది అక్టోబర్-నవంబర్‌లో శాసనసభ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ బీజేపీ అప్పుడే మత రాజకీయాలకు తెర లేపుతోంది. హిందూ ఓట్లను తనకు అనుకూలంగా సంఘటితం చేసేందుకు సీతాదేవి ఆలయ పునరుద్ధరణ నినాదాన్ని అందుకుంది. మిథిల ప్రాంతంలోని సీతామర్హిలో ఈ ఆలయం ఉంది. దీనిని పునరుద్ధరించి, పూర్వ వైభవం తీసుకురావడం ద్వారా దానిని ఎన్నికల అంశంగా మార్చేయాలని కమలదళం ప్రయత్నిస్తోంది. అటు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని ఐక్య జనతాదళ్ కూడా ఈ ప్రాజెక్టుకు కేంద్రం మరిన్ని నిధులు అందజేయాలని డిమాండ్ చేస్తోంది.
గత ఆదివారం అహ్మదాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రసంగిస్తూ సీతాదేవి ఆలయ పునరుద్ధరణను ప్రస్తావించారు. ‘మేము ఇప్పటికే అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించాము. ఇప్పుడు బీహార్‌లో అతి గొప్ప సీతామాత దేవాలయాన్ని నిర్మించడానికి సమయం ఆసన్నమైంది. సీతామాత తన జీవితంలో ఏ విలువలకు కట్టుబడి ఉన్నదో ఆ సందేశాన్ని ఈ ఆలయం సమాజానికి అందిస్తుంది. బీహార్‌లో జానకీ మాత ఆలయాన్ని నిర్మించి తీరతాం. నాతో చేతులు కలపాల్సిందిగా మిథిల ప్రజలను ఆహ్వానిస్తున్నాను. శాసనసభ ఎన్నికలకు ముందు బీహార్‌లో మకాం వేసి ఆలయ నిర్మాణాన్ని చేపడతాం’ అని ఆయన అన్నారు. అమిత్ వ్యాఖ్యలపై ప్రధాన ప్రతిపక్షమైన ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ నిప్పులు చెరిగారు. శిబిరాలు నిర్వహించడానికి ఇక్కడ అమిత్‌కు చోటే లేదని చెప్పారు.
బీహార్‌లో సీతాదేవి జన్మస్థలమైన సీతామర్హిలోని పునౌరా గ్రామంలో దేవాలయ పునరుద్ధరణ, ఆధునీకరణకు 2023 సెప్టెంబరులో అప్పటి మహా గట్‌బంధన్ కూటమి ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. ఈ కూటమిలో జేడీయూ, ఆర్జేడీ భాగస్వాములుగా ఉన్నాయి. అయితే గత సంవత్సరం జనవరిలో కూటమి నుండి జేడీయూ బయటికి వచ్చి ఎన్డీఏలో చేరింది. ఈ నేపథ్యంలో సీతాదేవి ఆలయ పునరుద్ధరణ ద్వారా బీజేపీ రాజకీయ లబ్ది పొందకుండా చూడాలని ఆర్జేడీ పట్టుదలగా ఉంది. సీతాదేవి పేరు చెప్పి ఓట్లు దండుకుందామంటే బీహార్‌లో కుదరని పని అని ఆర్జేడీ ప్రతినిధి సారికా పాశ్వాన్ తెలిపారు. కాగా అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రతిష్టాపనకు, సీతామర్హిలో సీతాదేవి ఆలయ ప్రాజెక్టుకు ముడి పెట్టి రాజకీయ ప్రయోజనం పొందాలని బీజేపీ చూస్తోంది. అసలు ఈ ప్రాజెక్టుతో కేంద్ర ప్రభుత్వానికి ఏమి పని అని కాంగ్రెస్ నిలదీస్తోంది. అమిత్ వచ్చి బీహార్‌లో మకాం వేస్తే నెరవేర్చని హామీలపై ప్రజల నుండి ప్రశ్నల పరంపరను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆ పార్టీ అంటోంది.