దళిత నేతలపై నిర్బంధం

Oct 1,2024 00:11 #house arest, #KVPS, #leaderes
  • కెవిపిఎస్‌ రౌండ్‌టేబుల్‌ సమావేశాన్ని అడ్డుకున్న పోలీసులు
  • పలువురు నేతల హౌస్‌ అరెస్టు

ప్రజాశక్తి – భీమవరం : దళిత సంఘాల నేతలపై పోలీసులు నిర్బంధం ప్రయోగించారు. ఉండి ఎమ్మెల్యే రఘరామకృష్ణంరాజుకు వ్యతిరేకంగా చేపట్టిన రౌండ్‌టేబుల్‌ సమావేశాన్ని అడ్డుకునేందుకు ఆదివారం రాత్రి నుంచి దళిత నేతలను ఎక్కడికక్కడ గృహనిర్బంధం చేశారు. ఏలూరుపాడులో నాగేంద్రస్వామి విగ్రహానికి వెళ్లేదారికి అడ్డుగా ఉందనే పేరుతో అంబేద్కర్‌ ఫ్లెక్సీని స్వయంగా ఎమ్మెల్యే రఘరామకృష్ణంరాజు తొలగించడం, ఆపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్ని దళిత సంఘాలను కలుపుకుని రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహణకు కెవిపిఎస్‌ పిలుపునిచ్చింది. ఆదివారం రాత్రి నుంచి జిల్లావ్యాప్తంగా దళిత నేతల కోసం జల్లెడ పట్టారు. భీమవరం సిఐటియు కార్యాలయంలో ఉన్న కెవిపిఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి కారుమంచి క్రాంతిబాబును సోమవారం అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. అక్కడే ఉన్న సిఐటియు నేతలు అడ్డుకోవడంతో వాగ్వివాదం చోటుచేసుకుంది. అనంతరం క్రాంతిబాబును అదుపులోకి తీసుకుని ఆయన స్వగ్రామం పాలకోడేరు మండలం మోగల్లు తీసుకెళ్లి అక్కడ గృహనిర్బంధం చేశారు. మాజీ ఎమ్మెల్యే, కెవిపిఎస్‌ రాష్ట్ర కమిటీ సభ్యులు దిగుపాటి రాజగోపాల్‌ను పాలకొల్లులోని ఆయన ఇంట్లో, ఆచంటలో దళిత సంఘాల నేత నన్నేటి పుష్పరాజును, పాలకొల్లులో నల్లి రాజేష్‌ను గృహనిర్బంధంలో ఉంచారు. వీరందరినీ సోమవారం సాయంత్రం నాలుగు గంటల తర్వాత విడిచిపెట్టారు. ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని దళిత, ప్రజాసంఘాల నేతలు జిల్లా ఎస్‌పిని కలిసి వినతిపత్రం అందజేశారు.
నిర్బంధాల నడుమ సమావేశం
అక్రమ నిర్బంధాల నడుమ రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. అంబేద్కర్‌ ఫ్లెక్సీ పట్ల దురుసుగా వ్యవహరించడం సబబు కాదన్నారు. ఫ్లెక్సీ అడ్డువస్తే అధికారులకు ఆదేశాలివ్వాలని, లేదా సంబంధిత వ్యక్తులను పిలిపించి మాట్లాడాలని, అంతేగాని ప్రజాప్రతినిధి అలా వ్యవహరించడం సరికాదన్నారు. ఫ్లెక్సీ విషయంలో ఇప్పటికైనా ఎమ్మెల్యే తన పొరపాటును గుర్తించి, తన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని కోరారు. మతాల ప్రస్తావన రాజ్యాంగ విరుద్ధమన్నారు. తక్షణం రఘురామకృష్ణంరాజు తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోకపోతే జిల్లావ్యాప్త ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.

➡️