జుగుప్సాకరం

కడప కార్పొరేషన్‌లో కుర్చీ రాజకీయం జుగుప్సను కలిగిస్తోంది. గత సర్వసభ్య సమావేశాన్ని ఎమ్మెల్యే పెద్దఎత్తున అనుచరులతో నింపేయడం చర్చనీయాంశమైంది. అనంతర రాజకీయ ఎత్తుగడల్లో భాగంగా మేయర్‌ ఇంట్లో ఎమ్మెల్యే అనుచరులు చెత్త రాజకీయం వేయడంతో అపరిణిత రాజకీయానికి తెరలేసింది. హుందా రాజకీయాల స్థానంలో అగ్రెసివ్‌ రాజకీయం చేయడం విమర్శలకు దారితీసింది. ఏ రాజకీయం చేసిన ప్రజా సమస్యలే ఆలంభన ఉండాలి. ఇందుకు విరుద్ధంగా వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని ముందుకెళ్లడం శోచనీయం. కార్పొరేషన్‌ పాలకవర్గం సర్వసభ్య సమావేశానికి హాజరవుతున్న మహిళా కార్పొరేటర్లకు భద్రత కల్పించాలని ఎస్‌పిని కలిసి విజ్ఞప్తి చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రొటోకాల్‌ పేరుతో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు కార్పొరేటర్ల సరసన కుర్చీలు ఏర్పాటు చేయడం అగ్నికి ఆజ్యంపోసింది. గతంలో వైసిపికి చెందిన ఎమ్మెల్యేలకు వర్తించని ప్రొటోకాల్‌, టిడిపి ఎమ్మెల్యేలకు వర్తించకపోవడం గమనార్హం. తేడా ఏమిటంటే వైసిపి ఎమ్మెల్యేల అనుచరులు ఇంతటి స్థాయిలో సమావేశంలోని కుర్చీలను ఆక్రమించకపోవడమే. ఎత్తుకు పెఎత్తుగడల రాజకీయాలతో ప్రజా సమస్యలు గాలికిపోవడం విస్మయాన్ని కలిగించింది. కడప ఎమ్మెల్యే ప్రజా సమస్యల పేరుతో అజెండాను భేఖాతరు చేస్తూ ప్రసంగాన్ని కొనసాగించడం, మేయర్‌ ఇచ్చిన అవకాశాన్ని పూర్తిగా రాజకీయానికి వాడుకోవడం హేయనీయం. ఎజెండా ఫాలో అవుదామని కోరిన మేయర్‌తో వాగ్వివాదానికి దిగడంతో కార్పొరేటర్లు, మేయర్‌ భారు కాట్‌ చేసి వెళ్లిపోవడంతో ప్రజాసమస్యలు చర్చకు రాకుండా పోయింది. కమిషనర్‌ ఎమ్మెల్యే కనుసన్నల్లో మెలగడం రాజకీయాన్ని తలపించింది. ప్రజా సమస్యలను చర్చించాల్సిన కార్పొరేషన్‌ నాయకత్వం రాజకీయానికి వాడుకోవడం ఆందోళనకరం. ర్యాటిఫికేషన్‌పై పనులు చేయడాన్ని తప్పుబట్టిన ఎమ్మెల్యే విచారణ చేయించి వాస్తవాలను నిగ్గుతేల్చాలి. మూడు నెలలుగా విచారణ చేయించకుండా ఎవరు ఆపారో ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంతటితో ఆగకుండా 2024 సార్వత్రిక ఎన్నికల్లో తనకు మేయర్‌ సహకరించారనే అంశాన్ని వెలుగులోకి తీసుకు రావడంలోని మర్మమేమిటో తెలియడం లేదు. ఎన్నికల్లో ప్రత్యర్థి నాయకులు ఎవరైనా సహకారం అందిస్తే కృతజ్ఞతను కలిగి ఉండాలి. సహకరించిన వారి పేర్లను గుప్తంగా ఉంచాల్సిన కనీస బాధ్యత లబ్ధిదారునిది. ఇటువంటి కనీస ధర్మాన్ని సైతం రాజకీయం చేయడంలోని ఔచిత్యమేమిటో తెలియడం లేదు. అనంతరం సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి ఎమ్మెల్యేకు ఎటువంటి సహకారం అందించలేదనే పేరుతో మేయర్‌ దిద్దుబాటు చర్యలకు దిగినప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయిందని గ్రహించాలి.- ప్రజాశక్తి – కడప ప్రతినిధి

➡️