ఎమ్మెలే వర్సెస్‌ మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌

Oct 30,2024 21:29

మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఇద్దరి మధ్య వాగ్వివాదం

ప్రొటోకాల్‌ విషయంలో గొడవ పడ్డ నేతలు

సమావేశం మధ్యలో వెళ్లిపోయిన ఎమ్మెల్యే

ప్రజాశక్తి – నెల్లిమర్ల : నెల్లిమర్ల నియోజకవర్గంలో జనసేన, టిడిపి నాయకుల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరుతున్నాయి.తాజాగా నెల్లిమర్ల నగర పంచాయతీ కౌన్సిల్‌ సమావేశం సాక్షిగా ఎమ్మెల్యే లోకం నాగ మాధవి, ఎపి మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌ కర్రోతు బంగార్రాజు మధ్య విభేదాలు బయటపడ్డాయి. బుధవారం నెల్లిమర్ల నగర పంచాయతీ కౌన్సిల్‌ సమావేశంలో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. సమావేశాన్ని నడిపించే అధికారం ఎమ్మెల్యేకు లేదని బంగార్రాజు ఆరోపించగా, సమావేశం నుంచి బంగార్రాజు బయటకు వెళ్లిపోవాలని ఎమ్మెల్యే అనడంతో సమావేశం రసాభాసగా మారింది. తీవ్ర ఆవేదనకు గురైన ఎమ్మెల్యే సమావేశం రద్దు చేస్తున్నట్లు ప్రకటించి, అక్కడి నుంచి అర్ధాంతరంగా వెళ్లిపోయారు. ఆమె వెళ్లిపోయిన తర్వాత బంగార్రాజు సూచనతో చైర్‌ పర్సన్‌ బంగారు సరోజిని సమావేశం కొనసాగించారు.ముందుగా ఈ సమావేశంలో విద్యుత్‌ స్థంబాలు, లైట్లు సమస్యలపై చర్చ జరుగుతుండగా ఎమ్మెల్యే లోకం నాగ మాధవి కలుగు చేసుకొని నగర పంచాయతీలో నిధులు కొరత ఉందని చెప్పగా మార్క్‌ఫెడ్‌ రాష్ట్ర ఛైర్మెన్‌ కర్రోతు బంగార్రాజు కలుగు చేసుకోని సభ్యులు అడిగిన సమస్యల పై సంబంధిత అధికారులు, ప్రజలు ఎన్నుకున్న చైర్‌ పర్సన్‌ సమాధానం చెప్పాలి గాని అన్నీ మీరై సమాధానం చెప్పడమేమిటని ప్రశ్నించారు. దీంతో ఎమ్మెల్యే లోకం మాధవి ఆగ్రహానికి గురై అసలు సమావేశానికి మీరెందుకు వచ్చారని మీకేంటి సంబంధమని బంగార్రాజును బయటకు పంపాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. బంగారు రాజు సమాధానం ఇస్తూ కౌన్సిల్‌ సమావేశానికి తనను చైర్‌పర్సన్‌, కమిషనర్‌ ఆహ్వానించారని, ఈ సమావేశానికి చైర్‌ పర్సన్‌ బాధ్యత వహించాలి గాని చైర్‌ పర్సన్‌ని పక్కకు తప్పించి మీరు సమస్యలపై సమీక్ష చేయాల్సిన అవసరం లేదని ఘాటుగా సమాధాన మిచ్చారు. ఈ వాగ్వివాదం నేపథ్యంలో ఆగ్రహానికి గురైన ఎమ్మెల్యే సమావేశాన్ని రద్దు చేయాలని వాకౌట్‌ చేసి బయటకు వెళ్లిపోయారు. అయితే నగర పంచాయతీ చైర్‌ పర్సన్‌ బంగారు సరోజినీ జనసేన పార్టీకి చెందినప్పటికి సమావేశాన్ని రద్దు చేయకుండా కొనసాగించడం కొసమెరుపు. పొత్తు ధర్మం ఎమ్మెల్యే పాటించరా.?: కర్రోతుఎమ్మెల్యే లోకం నాగ మాధవి కూటమి పొత్తు ధర్మాన్ని మరిచి ఇష్టాను సారంగా వ్యవహరిస్తున్నారని మార్క్‌ ఫెడ్‌ రాష్ట్ర ఛైర్మెన్‌ కర్రోతు బంగార్రాజు విమర్శించారు. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ టిడిపి, జనసేన కూటమి అభ్యర్థిగా ఎమ్మెల్యేగా గెలిచిన లోకం నాగ మాధవి పొత్తు ధర్మాన్ని మరిచి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. టిడిపి, జనసేన కూటమిగా అన్ని కార్యక్రమాల్లో వ్యవహరించాల్సి ఉండగా ఎమ్మెల్యే వైసిపి, జనసేన కూటమిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇటీవలి ఎన్‌ఇఆర్‌జిఎస్‌ పనుల కేటాయింపులో కూడా ఎమ్మెల్యే వైసిపికి అధిక శాతం పనులు కేటాయించడం ఉదాహరణగా పేర్కొన్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే తీరుపై ఇంఛార్జి మంత్రికి ఫిర్యాదు చేశామని, పవన్‌ కల్యాణ్‌తో కూడా మాట్లాడామని చెప్పారు.

➡️