స్ట్రాంగ్‌ రూముల్లో ఇవిఎంలు

May 15,2024 01:03 #evms, #strong rooms

ప్రజాశక్తి – అమరావతి : ఓట్లకు జనం పోటెత్తడంతో సోమవారం అర్థరాత్రి వరకు పోలింగ్‌ సాగడంతో ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలు (ఇవిఎంలు) స్ట్రాంగ్‌ రూములకు చేర్చడం ఆలస్యమైంది. సోమవారం అర్థరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు కట్టుదిట్టమైన భద్రత నడుమ ఇవిఎంలను తరలించారు. నియోజకవర్గాలు, పోలింగ్‌ కేంద్రాల వారీగా స్ట్రాంగ్‌రూంలో ఇవిఎంలు భద్రపరిచి అధికారులు సీలు వేశారు. స్ట్రాంగ్‌రూముల వద్ద మూడు అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. నిరంతరం సిసి కెమెరా పర్యవేక్షణ కొనసాగుతోంది. పోలింగ్‌ కేంద్రాల నుంచి పకడ్బందీ బందోబస్తు మధ్య ప్రత్యేక వాహనాల్లో ఇవిఎంలను స్ట్రాంగ్‌రూంలకు తరలించి భద్రపరిచారు. ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన 234 పోలింగ్‌ కేంద్రాలకు సంబంధించిన ఇవిఎంలను ఇబ్రహీంపట్నంలోని నోవా ఇంజినీరింగ్‌ కళాశాలకు తరలించారు. నందిగామకు చెందిన 222 ఇవిఎంలను సైతం ఇదే కళాశాలలో భద్రపరిచారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ఇవిఎంలను ఒక చోటకు చేర్చి అక్కడి నుంచి భారీ బందోబస్తు మధ్య స్ట్రాంగ్‌ రూములకు తరలించారు.
నోవా, నిమ్రా ఇంజినీరింగ్‌ కళాశాల్లో భద్రపరిచిన ఇవిఎంలను కలెక్టర్‌ పరిశీలించారు. గుడివాడ, మచిలీపట్నం, పెడన, అవనిగడ్డ, పామర్రుకు చెందిన ఇవిఎంలను కష్ణా యూనివర్సిటీలోని ప్రధాన స్ట్రాంగ్‌రూంకు తరలించారు. స్ట్రాంగ్‌రూముల వద్ద కేంద్ర పారామిలటరీ బలగాలతోపాటు రాష్ట్ర పోలీసులు పహారా కాస్తున్నారు.
గుంటూరు పార్లమెంట్‌ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన వివిఎంలను ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని స్ట్రాంగ్‌రూంలో భద్రపరిచారు. విశాఖ జిల్లా వ్యాప్తంగా మొత్తం 1900 పోలింగ్‌ కేంద్రాల నుంచి ఇవిఎంలను పటిష్టమైన భద్రత మధ్య ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని స్ట్రాంగ్‌రూంకు తరలించారు. సత్యసాయి జిల్లా హిందూపురం సమీపంలోని బిట్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూమ్‌కు ఇవిఎంలను తరలించి భద్రపరిచారు. మడకశిర, పెనుగొండ, కదిరి, హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గాలు, పార్లమెంటుకు సంబంధించిన ఇవిఎంలను అధికారులు భద్రపరిచారు.
కర్నూలు జిల్లాలోని ఇవిఎంలను రాయలసీమ యూనివర్సిటీకి తరలించారు. 8 అసెంబ్లీ, కర్నూలు పార్లమెంటు నియోజకవర్గాల ఇవిఎంలు వర్సిటీలోని స్ట్రాంగ్‌రూంలో భద్రపరిచారు. అనంతపురం పార్లమెంట్‌ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి తెల్లవారుజామున జెఎన్‌టియు స్ట్రాంగ్‌రూంకు ఇవిఎంలను తరలించారు. అన్నమయ్య జిల్లా రాజంపేట పార్లమెంట్‌ నియోజకవర్గంలోని ఇవిఎంలను రాయచోటి సాయి ఇంజినీరింగ్‌ కళాశాలకు తరలించి స్ట్రాంగ్‌రూంలో భద్రపరిచారు.

➡️