జిజిహెచ్‌కు సూపరింటెండెంట్‌ కావలెను!

ప్రజాశక్తి – కడప ప్రతినిధిజిల్లా సర్వజన ప్రభుత్వాస్పత్రికి సమర్థ సూపరింటెండెంట్‌ అనివార్యమనే వాదన వినిపిస్తోంది. ప్రస్తుత జిజిహెచ్‌ సూపరింటెండెంట్‌ ఆమె కుమారుడు అమెరికా నుంచి వస్తున్న నేపథ్యంలో 10 రోజుల కింద సెలవుపై వెళ్లినట్లు తెలుస్తోంది. 10 రోజులు దాటితే జిజిహెచ్‌ బాధ్యత నిర్వహణను డిప్యూటీ సూపరింటెండెంట్‌, ఇతర ఉన్నతాధికారులకు ఫుల్‌ అడిషనల్‌ ఛార్జి (ఎఫ్‌ఎసి) అప్పగించి వెళ్లాల్సి ఉంది. ఈమేరకు సీనియర్‌ అసిస్టెంట్‌ కలెక్టర్‌కు ఫైలు నడిపి కలెక్టర్‌ దృష్టిలో సెలవు పెట్టిన విషయాన్ని ఉంచాల్సి ఉంది. ఇటువంటి ప్రయత్నం చేయని నేపథ్యంలోనే జిజిహెచ్‌ కార్యాలయ ఉద్యోగుల మధ్య విభేదాలు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితికి చేరుకున్నాయి. వివాదాలు..ఫిర్యాదులు..దాడులు..ఎన్‌జిఒ సంఘాల నాయకులు, పోలీస్‌స్టేషన్‌ వరకు విభేదాల వ్యవహారం చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది. కొన్ని నెలల తరబడి ఉద్యోగుల మధ్య విబేధాలు కొన సాగుతున్నట్లు తెలుస్తోంది. ఫలితంగా జిజిహెచ్‌ పర్యవేక్షణ కొరవ డింది. నిత్యం వందలాది మంది రోగులతో కిటకిటలాడుతున్న జిజిహెచ్‌ పనితీరును గాలికి వదిలేయడమేమిటనే చర్చ నడుస్తోంది. కొన్ని నెలల కిందట డిప్యూటీ డైరెక్టర్‌ (డిడి)పై కార్యాలయ ఉద్యోగులు పోలీసులకు రెండు దఫాలుగా ఫిర్యాదులు చేయడం, విచారణలు చేపట్టడం తెలుస్తోంది. తాజాగా ఓ కంపాసినేట్‌ అపాయింట్‌ మెంట్‌, స్పౌస్‌ నిర్ధారణ అంశాల్లో ఉద్యోగుల మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలు రావడం, చిలికి చిలికి విభేదాలు గాలివానగా మారడంతో ఇటీవల డిప్యూటీ సూపరింటెండెంట్‌కు డిడిపై ఫిర్యాదు చేశారు. దీనిపై డిప్యూటీ సూపరింటెండెంట్‌ జోక్యం చేసుకుని ఇరువురిని మందలించి సర్దుబాటు చేసినట్లు సమాచారం. అనంతరం అంతటితో ఆగకుండా ఓ ఆఫీసు సూపరింటెండెంట్‌పై బెదిరింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది. దీంతో సదరు సూపరింటెండెంట్‌ తనకు రక్షణ కల్పించాలని కోరుతూ పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించడం, ఎన్‌జిఒ సంఘాల నాయకులు మధ్యవర్తిత్వం నెరపుతుండడం చర్చనీ యాంశంగా మారింది. కొన్ని నెలల తరబడి ఉద్యోగుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకుని పోలీస్‌ కేసుల వరకు పరిస్థితి వెళ్తుంటే జిజిహెచ్‌ సూపరింటెండెంట్‌ ఏమి చేస్తున్నారనే విమర్శలు జోరు వెల్లువెత్తుతోంది. ఎఫ్‌ఎసి ఇవ్వలేదు.. జిజిహెచ్‌ సూపరింటెండెంట్‌ సెలవుపై వెళ్లిన మాట వాస్తవమే. కానీ తనకు ఎఫ్‌ఎసి బాధ్యతల్ని ఇవ్వలేదు. మంగళవారంతో సూప రింటెండెంట్‌ 10 రోజుల సెలవు పీడియడ్‌ ముగియనుంది. ఈనేపథ్యంలో మరో మూడు రోజులు విధులకు హాజరు కాలేనని సమాచా రం అందించారు.- సురేశ్వరరెడ్డి, డిప్యూటీ సూపరింటెండెంట్‌, జిజిహెచ్‌, కడప.

➡️