ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలి

ప్రభుత్వ పాఠశాలలను

మాట్లాడుతున్న యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి కిషోర్‌ కుమార్‌

  • యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌.కిషోర్‌ కుమార్‌

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం ద్వారా అందరికీ నాణ్యమైన విద్య అందుతుందని యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌.కిషోర్‌ కుమార్‌ అన్నారు. నగరంలోని తిలక్‌ నగర్‌లో గల యుటిఎఫ్‌ జిల్లా కార్యాలయంలో ఆ సంఘ జిల్లా కార్యవర్గ సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను బోధించే బాధ్యతను ఉపాధ్యాయులు తీసుకోవడం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచుకోవడం కోసం ఉపాధ్యాయులే ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించాలని సూచించారు. నూతన ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల ప్రకారం మెగా డిఎస్‌సిని తక్షణమే ప్రకటించాలని, విద్యారంగ బలోపేతానికి కృషి చేయాలన్నారు. జిఒ నంబర్‌ 117 రద్దు చేసి ప్రాథమిక పాఠశాలల వ్యవస్థను కాపాడాలని కోరారు. గతేడాది 4,600 ప్రాథమిక పాఠశాలల్లోని మూడు, నాలుగు, ఐదు తరగతులను కిలోమీటరు లోపు ఉన్న ఉన్నత పాఠశాలల్లో విలీనం చేశారని గుర్తుచేశారు. మూసేసిన ఆ ప్రాథమిక పాఠశాలలను పునరుద్ధరించాలని కోరారు. వాస్తవ గణాంకాలను పరిగణనలోకి తీసుకుని మెగా డిఎస్‌సిని వెంటనే ప్రకటించి, ఉపాధ్యాయ పోస్టులన్నింటినీ భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగ ,ఉపాధ్యాయులను నిరంతరం చర్చలకు పిలవడం, ప్రజాస్వామ్య పద్ధతిగా వ్యవహరించడం వల్ల ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి వీలుంటుందన్నారు. న్యాయమైన డిమాండ్లను నెరవేర్చడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేయాలని కోరారు. యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎల్‌.బాబూరావు, బి.శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, నైతిక విలువలు పెంపుదల ఉంటాయన్న నమ్మకాన్ని తల్లిదండ్రులు, సమాజంలో కల్పించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో జిల్లా గౌరవాధ్యక్షులు కోరాడ వైకుంఠరావు, సహాధ్యక్షులు కె.దాలయ్య, బి.ధనలక్ష్మి, కోశాధికారి బి.రవికుమార్‌, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చౌదరి రవీంద్ర, రాష్ట్ర కౌన్సిలర్‌ పి.అప్పారావు, జి.గిరిధర్‌, జిల్లా కార్యదర్శులు హెచ్‌.అన్నాజీరావు, పి.సూర్యప్రకాష్‌, ఎం.వి రమణ, పి.మురళీధరరావు తదితరులు పాల్గొన్నారు.

➡️