- 4 థీమ్‌లుగా పరిశుభ్రత కార్యక్రమాలు
- పట్టణాభివృద్ధిశాఖ మంత్రి నారాయణ
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : చెత్త నిర్వహణకు పంచాయతీలు, పురపాలక సంఘాలు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని పట్టణాభివృద్ధిశాఖ మంత్రి నారాయణ తెలిపారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యాన కెపాసిటీ బిల్డింగ్, ఆలోచనా మార్పులపై విజయవాడలో సోమవారం ఒకరోజు వర్కుషాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రతిరోజూ 6,500 సాలిడ్‌వేస్ట్ వస్తుందని, లిక్విడ్ వేస్ట్ తొలగించడం ఎంతో సవాల్‌తో కూడుకున్నదని అన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలు చెత్తను తొలగించడానికి తీసుకుంటున్న ఉత్తమ నిర్ణయాలను క్రోఢకీరించి రాష్ట్రంలో అమలు చేస్తున్నామని తెలిపారు. ఏరోజుకారోజు చెత్తను తొలగించాలనే దృక్పథంతో ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. నాలుగు థీమ్‌లుగా పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నామని, వాటిని క్రమబద్ధంగా అమలు చేసి దేశంలోనే మొదటి రాష్ట్రంగా నిలిచేలా కృషి చేస్తామని నారాయణ పేర్కొన్నారు. ప్రజల్లో అవగాహన చర్యలను ఏ మేరకు సమర్ధవంతంగా అమలు చేశామన్నది అన్నిటికన్నా ముఖ్యమని వివరించారు. రీసైక్లింగ్‌పై చైతన్యం కలిగించే అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ద్వారానే రాష్ట్రంలో వేస్ట్ మేనేజ్‌మెంట్‌లో ఎపి అగ్రగామిగా ఉంటుందని వివరించారు. అందరి సూచనలు స్వీకరించి స్వచ్ఛత విషయంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. యూరప్‌లో ప్రజలకు స్వచ్ఛతపై అవగాహన అమోఘమని తన పర్యటనలో గుర్తించినట్లు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ ఉండాలని, విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు చేయాల్సిన పనులను ప్రణాళికాబద్ధంగా వివరిస్తే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్‌ను మరింత ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉందని అన్నారు. పట్టణాభివృద్ధిశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్‌కుమార్ మాట్లాడుతూ.. విదేశాల్లో స్వచ్ఛతకు ప్రాధాన్యత ఇస్తారని తెలిపారు. ఇక్కడ కూడా అలాంటి పద్ధతులు అలవాటు చేసుకోవాలని సూచించారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో రాష్ట్రం గతేడాది ఆరోస్థానంలో ఉందని, ఈ ఏడాది మెరుగుపరుచుకుంటామని చెప్పారు. ప్లాస్టిక్‌ను డ్రెయిన్లలో వేయకూడదని తెలిపారు. అనంతరం పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పట్టణాభివృద్ధిశాఖ డైరెక్టర్ సంపత్‌కుమార్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎమ్‌డి అనిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.