‘వక్ఫ్‌’ సవరణ బిల్లు ఆస్తులను దుర్వినియోగ పరచడానికేనా?

Nov 29,2024 05:30 #Articles, #editpage, #Waqf Boards

కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం (2014) వచ్చాక ముస్లిం మైనార్టీ వర్గాలలో అభద్రతా భావం పెరిగింది. ముస్లింల చట్టాల సవరణ, కొత్త చట్టాల పేరుతో భయాందోళనలకు గురి చేసే పరిస్థితులు ఆ సమాజాన్ని తీవ్ర ఆందోళనకు, కలవరానికి గురి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏకరూప పౌరస్మృతి (యుసిసి)ని బిజెపి తెర మీదకు తీసుకువచ్చింది. రెండో విడత అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న జార్ఖండ్‌లో ప్రచారం సందర్భంగా యుసిసి ని అమలు చేసి తీరుతామని ఇప్పటికే కేంద్ర హోమ్‌ మంత్రి అమిత్‌ షా ప్రకటించారు. ఇప్పుడు ముస్లింల ఆచార వ్యవహారాలు, సంస్కృతిపై దాడి మొదలు పెట్టింది.

అవి ఒక్కరి ఆస్తులు కావు..

ఏకరూప పౌరస్మృతి అనేది చాలా సున్నితమైన అంశం. దీనిపై ఏమాత్రం తొందరపాటు పనికిరాదు. దేశంలోని అన్ని రాజకీయ పార్టీలతో ముందుగా సంప్రదింపులు జరపాలి. ఏకాభిప్రాయం వచ్చాకే యుసిసి మీద నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. ఇటీవల వక్ఫ్‌ ఆస్తులపై కేంద్రంలోని బిజెపి సర్కార్‌ కన్నేసింది. వక్ఫ్‌ ఆస్తులను ప్రతికూలంగా చూపించడానికి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చేయాల్సిందంతా చేసింది. వాస్తవానికి వక్ఫ్‌ ఆస్తులు అంటే ఏ ఒక్కరి వ్యక్తిగత ఆస్తులు కావు. యావత్‌ ముస్లిం సమాజానికి సంబంధించిన ఆస్తులు. వీటిని సంరక్షించడానికి ఓ చట్టం ఉంది. అదే వక్ఫ్‌ చట్టం.

కనీస సమాచారం లేకుండానే….

మన దేశంలో కొన్ని దశాబ్దాల నుంచి ఈ చట్టం అమలులో ఉంది. ముస్లిం సమాజం మేలు కోసం గతంలో ముస్లిం చక్రవర్తులు, నవాబులు, దాతృత్వంగల పెద్దలు దానం ఇచ్చిన భూములు అవి. వీటిపై వచ్చే ఆదాయాన్ని దర్గాల నిర్వహణతో సహా ముస్లింల ధార్మిక కార్యక్రమాలకు, విద్య, వైద్య సేవలకు ఉపయోగించాల్సి ఉంటుంది. వ్యక్తిగతంగా ఏ ముస్లిం ప్రముఖుడికో ధారాదత్తం చేసే అవకాశాలు వక్ఫ్‌ చట్టంలో ఏమాత్రం వుండవు. నూటికి నూరు శాతం సమూహ ప్రయోజనాలే లక్ష్యంగా ఉంటాయి. ఇంతటి పటిష్టమైన వక్ఫ్‌ చట్టంలో ఇటీవల కీలక మార్పులు తీసుకువచ్చే దిశగా వక్ఫ్‌ చట్టం సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం అకస్మాత్తుగా లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఇంతటి కీలకమైన సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టే ముందు సభ్యులకు ముందస్తు సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై లేదా? దీనిని కూడా పట్టించుకోలేదు కేంద్రం.

భూములు లాక్కోవడానికేనా?

ముస్లిం సమాజానికి చెందిన ఆర్థిక మూలాలను దెబ్బ తీసే కుట్ర ఈ సవరణ బిల్లులో దాగి ఉంది. ఈ సవరణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందితే పర్యవసానాలు దారుణంగా ఉంటాయి. అందుకే ఈ బిల్లును రాజ్యాంగంపై దాడిగానే భావించాలి. నిధులు లేక ముస్లిం ధార్మిక సంస్థలు తమ రోజువారీ కార్యక్రమాలు కూడా నిర్వహించు కోలేకపోతాయి. దేశంలోని దర్గాలతో పాటు ముఖ్యమైన జాన్‌ పహాడ్‌, అజ్మీర్‌ వంటి పేరొందిన దర్గాలు కూడా బిచ్చమెత్తుకునే పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. ఒకవైపు హిందూత్వ ఎజెండాతో ముస్లింలపై రాజకీయంగా దాడి చేస్తున్న కేంద్ర ప్రభుత్వం మరోవైపు దర్గాల నిర్వహణకు ఉపయోగపడే ఇనాం భూములను లాక్కోవడానికి పకడ్బందీ వ్యూహం వేసిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

వక్ఫ్‌ బోర్డులో ముస్లిమేతరులా ?

వక్ఫ్‌ బోర్డు అనేది మౌలికంగా ముస్లింలకు సంబంధించిన అంశం. అయితే బోర్డుల్లో ముస్లిమేతరులను సభ్యులుగా చేర్చేలా తాజా చట్టంలో నిబంధనలు రూపొందించారు. ముస్లింల ధార్మిక సంస్థల పర్యవేక్షణను చూడాల్సిన వక్ఫ్‌ బోర్డులో ముస్లిమేతరులకు చోటు కల్పించడం ఏ విధంగా సమంజసమో బిజెపి నాయకత్వం వివరించాలి. వక్ఫ్‌ సవరణ బిల్లు, 2024లోని నోట్‌ 1, క్లాజ్‌ 9, 11 ప్రకారం ప్రతి వక్ఫ్‌ బోర్డులో ఇద్దరు ముస్లిమేతర సభ్యులను తప్పనిసరిగా చేర్చాలని వాదించడం మత స్వేచ్ఛ హక్కును తీవ్రంగా ఉల్లంఘించడం కాదా? 1995 వక్ఫ్‌ చట్టం భారతదేశంలో వక్ఫ్‌ ఆస్తులకు సంబంధించిన వివాదాలను పరిష్కరించేందుకు, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని నిర్దేశించింది. వక్ఫ్‌ ఆస్తి హోదాపై వివాదం తలెత్తిన సందర్భంలో, 1995 చట్టంలోని సెక్షన్‌ 7(1) ట్రిబ్యునల్‌ తీర్పు అంతిమంగా ఉంటుందని తెలిపింది. కానీ ఇప్పుడు ఈ చట్టానికి సవరణలు తెచ్చి పూర్తిగా ముస్లిం సమాజం మత స్వేచ్ఛ హక్కు హరించివేస్తుందని, అందులో భాగంగానే ఎన్డీయే ప్రభుత్వం ఈ దుర్మార్గానికి తలపెడుతోందని భావించవచ్చా?

వక్ఫ్‌ చట్టం లక్ష్యం…

వక్ఫ్‌ బోర్డుల సాధికారత లక్ష్యంతో 1954లో వక్ఫ్‌ చట్టాన్ని ప్రవేశపెట్టింది అప్పటి కేంద్ర ప్రభుత్వం. ఆ తర్వాత 1995, అలాగే 2013లో వక్స్‌ చట్టాన్ని సవరించారు. అయితే వాస్తవానికి వక్ఫ్‌ ఆస్తులు ముస్లిం సమాజం అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాయి. మసీదులు, మదర్సాలు, విద్యా సంస్థలు, శ్మశాన వాటికలు, ఆరోగ్య సంరక్షణ సౌకర్యాల స్థాపనకు దోహదపడ్డాయి. ఇది ఎవరూ కాదనలేని సత్యం. ఇలా ముస్లింల ప్రయోజనాలకు ఉపయోగపడాల్సిన ఆస్తులను దుర్వినియోగ పరచడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం సవరణ చట్టం తీసుకొస్తున్నప్పుడు రాజ్యాంగ పరిరక్షణ కోరుకునే శక్తులన్నీ ఒక్కటై ప్రతిఘటించాలి.

– జలీల్‌ ఖాన్‌

➡️