ప్రజాశక్తి-ముంచింగి పుట్టు :- మండల పరిధిలో గల బాబుసాల పంచాయితీ దోమొక్ లాడి గ్రామానికి చెందిన గొల్లూరి కేశవరావును గత నాలుగు నెలల క్రింద గంజాయి కేసులో విశాఖ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా రహస్యంగా తీసుకొని వెళ్ళి విచారణ పేరుతో చిత్రహింసలు పెట్టడంతోనే మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ విషయం తెలుసుకున్న లక్ష్మీపురం గ్రామపంచాయతీ సర్పంచ్ కొర్రా త్రినాథ్ దోమకులాడి గ్రామంలో కుటుంబ సభ్యులతో జరిగిన ఘటనపై అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులు మాట్లాడుతూ కేశవరావు రోజు వారి కూలికి వెళ్లి విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో విశాఖ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా విచారణ పేరు చెప్పి తీసుకెళ్లి జైలు పాలు చేశారని మండిపడ్డారు. అనారోగ్యం వచ్చినా కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా నిర్లక్యం చేసిప పోలీసు అధికారుల పై ఎస్సి, ఎస్టి అట్రాసిటీ, క్రిమినల్ కేసు నమోదు చేసి కటినంగా శిక్షించాలన్నారు. లక్ష్మీపురం పంచాయతీ సిపిఎం సర్పంచ్ కొర్ర త్రినాథ్ మాట్లాడుతూ జరిగిన ఘటనపై కేంద్ర, రాష్ట్ర ఎస్.టీ కమిటీ చైర్ పర్సన్లు, మానవ హక్కుల సంఘాలు సుమోటోగా స్వీకరించి దర్యాప్తు చేయాలని కోరారు.వివిధ కేసులో ఉన్న ఆదివాసి ఖైదీలు గత 9 నెలలుగా ఐదు గురు సెంట్రల్ జైల్లో మృతి చెందారనీ తెలిపారు. కేశవరావు కుటుంబానికి 50 లక్షల పరిహారం చెల్లించి ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. బాబుశాల సర్పంచ్ కుమారుడు ప్రసాద్, బాబుశాల,లక్ష్మీపురం పీసా కమిటీ సభ్యులు పి.దళపతి, వి.నీలకంఠం, కె.మల్లేష్ పాల్గొన్నారు.
