మాట్లాడుతున్న డ్వామా పీడీ సుధాకరరావు
డ్వామా పీడీ బి.సుధాకరరావు
ప్రజాశక్తి – రణస్థలం
మండలాల్లో విధులు నిర్వహిస్తున్న క్షేత్రస్థాయి ఉపాధి హామీ సిబ్బందికి సాంకేతిక అంశాలపై అవగాహన ఎంతో అవసరమని జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకులు బి.సుధాకరరావు అన్నారు. మండల పరిషత్ సమావేశ మందిరంలో రణస్థలం, లావేరు మండలాలకు చెందిన టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఇతర ఉపాధి హామీ సిబ్బందికి నిర్వహిస్తున్న శిక్షణా తరగతుల్లో శుక్రవారం ఆయన మాట్లాడారు. క్షేత్రస్థాయిలో పనులు చేపట్టే సమయంలో నిర్ధిష్ట కొలతల మేరకు పనులు చేయించినట్లయితే కూలీలకు గరిష్ట కూలి అందుతుందన్నారు. నిర్దేశించిన లక్ష్యాల మేరకు కూలీలకు పని దినాలు కల్పించడం ధ్యేయంగా విధులు నిర్వహించాలన్నారు. జాబ్ కార్డు ఉన్న వారందరికీ వంద రోజులు పని దినాలు కల్పించాలని స్పష్టం చేశారు. వ్యవసాయ అనుబంధ పనులపై ప్రత్యేక శ్రద్ధను చూపించాలని, అదేవిధంగా శాశ్వత వనరులు సృష్టించేందుకు అవసరమైన పనులు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. విధి నిర్వహణలో క్రమశిక్షణ, అంకితభావం, సమన్వయం ఎంతో అవసరమన్నారు. పథకం ప్రగతికి ఇవి దోహదపదడంతో పాటు ఉద్యోగికి మంచి గుర్తింపును తెస్తాయని అభిప్రాయపడ్డారు. జాబ్‌కార్డు ఉన్న వారందరూ పనులకు వచ్చే విధంగా గ్రామాల్లో సభలు నిర్వహించి అవగాహన కల్పించాలన్నారు. ప్రతి పేద కుటుంబానికి ఆర్థిక భరోసాను, జీవన భద్రతను కల్పించడమే ఉపాధి హామీ ప్రధాన లక్ష్యమని, దీనికి అనుగుణంగా సిబ్బంది విధులు నిర్వహించాలన్నారు. అనంతరం జె.ఆర్ పురంలో నిర్మిస్తున్న రహదారి పనులతో పాటు గోశాల పనులను పరిశీలించారు. సమావేశంలో లావేరు, రణస్థలం ఎపిఒలు శ్రీనివాస్ నాయుడు, శోభారాణి, ఇసిలు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.