నేతల ప్రసంగాలు ఆదర్శంగా ఉండాలి

  •  90 శాతం ఫిర్యాదులు పరిష్కరించాం
  •  కేంద్ర ఎన్నికల సంఘం

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో రాజకీయ పార్టీల అగ్రనేతలు తమ ప్రచారంలో ఆదర్శాన్ని చూపాలని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన విడుదల చేసింది. దేశంలోని సామాజిక నిర్మాణం చెదిరిపోకుండా ఉండేందుకు ఎన్నికల మిగిలిన దశల్లో నేతల పోల్‌ ప్రసంగాలను సరిదిద్దుకోవడం ప్రధానంగా నాయకుల బాధ్యతని నొక్కి చెప్పింది. మార్చి 16న లోక్‌సభ ఎన్నికల ప్రకటన తరువాత మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ (ఎంసిసి) అమలుపై తన రెండో నివేదికను విడుదల చేసిన ఎన్నికల సంఘం, 90 శాతానికి పైగా ఫిర్యాదులను పరిష్కరించామని, పార్టీల నుండి వచ్చిన పెద్ద ఫిర్యాదులు పెండింగ్‌లో లేవని తెలిపింది. కాంగ్రెస్‌, బిజెపిల నుండి వచ్చిన కొన్ని ఫిర్యాదులు తప్ప అన్నీ పరిష్కరించామని పేర్కొంది. ఎంసిసి అమల్లోకి వచ్చినప్పటి నుండి దాదాపు రెండు నెలలు పూర్తయినందున, నియోజకవర్గ స్థాయిలో వివిధ రాజకీయ పార్టీలు, అభ్యర్థుల ప్రచారం హింసకు తావులేకుండా జరిగింది’ అని ఎన్నికల కమిషన్‌ పేర్కొంది.

పరిశీలనలో మోడీ, రాహుల్‌పై చర్యలు
ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కాంగ్రెస్‌ నాయకులు రాహుల్‌గాంధీపై వచ్చిన ఫిర్యాదులపై చర్యలు పరిశీలనలో ఉన్నాయని ఎన్నికల కమిషన్‌ వెల్లడించింది. మోడీ, రాహుల్‌పై ఫిర్యాదులపై జారీ చేసిన నోటీసులకు వారి వారి పార్టీ అధ్యక్షులు జెపి నడ్డా, మల్లికార్జున ఖర్గే స్పందించారని తెలిపింది. వివిధ రాజకీయ పార్టీలు, అభ్యర్థుల నుంచి 425 ప్రధాన ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపింది. వీటిల్లో 400 ఫిర్యాదుల్లో చర్యలు తీసుకోవడం లేదా ఫిర్యాదును పరిష్కరించడం జరిగిందని తెలిపింది. కాంగ్రెస్‌ నుంచి 170 ఫిర్యాదులు, బిజెపి నుంచి 95 ఫిర్యాదులు, ఇతర పార్టీల నుంచి సుమారు 160 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపింది. వీటిల్లో అధిక ఫిర్యాదులపై చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది. మతం, కులం, ప్రాంతీయ భాషలు, భారత రాజ్యాంగం వంటి అంశాల్లో విద్వేష ప్రసంగాలు చేసి స్టార్‌ క్యాంపెయినర్లు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపిస్తూ బిజెపి, కాంగ్రెస్‌ పరస్పరం చేసుకున్న కొన్ని ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపింది. ‘గతంలో ఎన్నికల ఉల్లంఘనలకు పాల్పడిన నాయకులకు వ్యక్తిగతంగా నోటీసులు జారీ చేసే పద్ధతి ఉండేది. అయితే మార్చి 1, 2024 నుంచి కొత్త నిబంధన అమల్లోకి తీసుకొచ్చాం. దీని ప్రకారం ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన నాయకులు, అభ్యర్థులు, స్టార్‌ క్యాంపెయినర్ల పార్టీల అధ్యక్షులకు, ప్రధాన కార్యదర్శులకు నోటీసులు జారీ చేస్తున్నాం’ అన్ని ఎన్నికల కమిషన్‌ తెలిపింది.

బిజెపి ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించడాన్ని ఆపండి : టిఎంసి
బిజెపి, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో సహా ఎన్నికల కోడ్‌ను ‘నిస్సందేహంగా ఉల్లంఘించడాన్ని’ ఆపాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని టిఎంసి కోరింది. అదే సమయంలో మోడల్‌ ప్రవర్తనా నియమావళిని (ఎంసిసి) ‘మోడీ కోడ్‌గా మార్చారని’ ఆరోపించింది. ఈ మేరకు మంగళవారం ఎన్నికల సంఘానికి టిఎంసి రాజ్యసభ ఎంపిలు సాకేత్‌ గోఖలే, సాగరిక ఘోష్‌ ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. మోడల్‌ ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై ప్రధాని మోడీకి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడంలో ఇసి మెతక వైఖరి పట్ల నిరాశ వ్యక్తం చేశారు. ‘(బిజెపి చీఫ్‌) జెపి నడ్డాకు నోటీసు ఇచ్చారు. కానీ ఫిర్యాదులపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు’ అని అన్నారు. ఎంసిసి పట్ల ఎన్నికల సంఘం నిర్లక్ష్యంగా ఉందని విమర్శించారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినందుకు ప్రధాని మోడీని బాధ్యులను చేయడం లేదని పేర్కొన్నారు. ఎన్నికల మిగిలిన దశల్లో మోడల్‌ ప్రవర్తనా నియమావళిని కచ్ఛితంగా అమలు చేయాలని, ఫిర్యాదులపై చర్యలు తీసుకోవాలని, ప్రధాని మోడీ ఉల్లంఘించిన ప్రతిసారీ క్లీన్‌చిట్‌ ఇవ్వొద్దని డిమాండ్‌ చేశారు.
ఫైల్‌నేమ్‌ : బిజెపి, కాంగ్రెస్‌

➡️