బడుగులను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతాం : మంత్రి సవిత

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : రాష్ట్రంలో బలహీన వర్గాల వారిని కూడా రాజకీయంగా, సామాజికంగా, ఆర్ధికంగా అభివద్ధి చేయటంతోపాటు వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమం, చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్‌.సవిత తెలిపారు. గుంటూరులోని శ్రీనివారావుతోటలో శనివారం నిర్వహించిన స్వాతంత్య్ర సమరయోధులు వడ్డే ఓబన్న జయంతోత్సవంలో ఆమె పాల్గొన్నారు. తొలుత వడ్డే ఓబన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశ స్వాతంత్య్ర సమరంలో వడ్డేర కులస్థుల పాత్రను ప్రజలందరికీ తెలియజేయాలన్న లక్ష్యంతోనే ఓడ్డే ఓబన్న జయంతి ఉత్సవాలను రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. 2024-25 బడ్జెట్‌లో బిసిలకు రూ.39,007 కోట్లు కేటాయించామని చెప్పారు. మెగా డిఎస్‌సిలో పాల్గొనే బిసి అభ్యర్థులకు బిసి స్టడీ సర్కిల్స్‌ ద్వారా 26 జిల్లాల్లో బిసిలకు ఉచితంగా కోచింగ్‌ ఇస్తున్నట్లు తెలిపారు. స్వయం ఉపాధి పథకాల కోసం బిసి కార్పొరేషన్‌ ద్వారా 1,33,849 లబ్ధిదారులకు రూ.1977.53 కోట్లు, మిని డెయిరీ యూనిట్లకు 12,278 లబ్ధిదారులకు రూ.605.47 కోట్లు, గొర్రెలు, మేకలు యూనిట్లకు 2,772 లబ్ధిదారులకు రూ.52.81 కోట్లు, జనరిక్‌ మెడికల్‌ షాపులకు 792 లబ్ధిదారులకు రూ.61.72 కోట్లు బ్యాంకు లింకేజీతో రాయితీతో ఆర్ధిక సహాయం చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో బిసి సంక్షేమ శాఖ కమిషనర్‌ ఎ.మల్లికార్జునరావు, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

➡️