ప్రజాశక్తి- అరకులోయ:పర్యాటక కేంద్రమైన అరకులోయ టౌన్షిప్ లోని మెయిన్ రోడ్డులో ఏర్పాటు చేసి ఉన్న వైన్ షాపులు ఎత్తివేయాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల ఏర్పాటు చేసిన వైన్ షాపులు అరకులోయలో నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయి.జననివాసాల్లో, ప్రభుత్వ కార్యాలయాలకు దగ్గరలో మద్యం షాపు ఉండకూడదని ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తూ అరకులోయ నడిబొడ్డున మెయిన్ రోడ్డులో పెదలబుడు పంచాయతీ కార్యాలయం ఎదురుగా వైన్స్ ఏర్పాటు చేశారు. దీంతో, మెయిన్ రోడ్‌లో రాకపోకలకు సాగించే వాహన చోదకులు, పర్యాటకులు, మహిళలు, స్థానికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. వైన్‌షాపు ఎదురుగా వివిధ గ్రామాల నుంచి అరకులోయకు వచ్చిన ప్రజలు సంతరోజున ఇక్కడ కూర్చోవడం అలవాటు. వైన్ షాప్ ఏర్పాటుతో ఆ పరిస్థితి ఇప్పుడు లేకుండా పోయిందని గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి తోడు ఈ షాప్ ఎదురుగానే పెదలబుడు ఆటో స్టాండ్ కూడా ఉంది. ఆటో ఎక్కడానికి గిరిజన మహిళలు రావాలంటేనే వైన్ షాప్‌తో భయపడిపోతున్నారు. అరకులోయ నడిరోడ్డులో వైన్ షాపు ఉండటంతో మందుబాబుల వాహనాలు రోడ్‌లోనే పార్కింగ్ చేయడంతో ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడుతుంది. దీంతోపాటు వైన్ షాప్‌కు ఆనుకుని కొండవీది, గిరిజన సంఘం కార్యాలయానికి వెళ్లే స్థానికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. గిరిజన సంఘం కార్యాలయంలో ప్రతి రోజు పదుల సంఖ్యలో వివిధ గ్రామాల గిరిజనులు తమ సమస్యల కోసం గిరిజన సంఘం నాయకుల దగ్గర వచ్చి పోతుంటారు. ఇప్పుడు మందు బాబులకు భయపడి ఆ మార్గములో వెళ్లడానికి భయపడుతున్నారు. వైన్ షాపు రోడ్డు లోనే ఉండడంతో సంత రోజు శని, ఆదివారాల్లో పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉండడంతో తీవ్ర అంతరాయం కలుగుతుంది. ఈ షాపులు ఎత్తి వేయాలని ఎక్సైజ్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని పలువురు గిరిజనులు తెలిపారు.అదేవిధంగా తసిల్దార్ కార్యాలయం ఎదురుగా ఉన్న మరో వైన్ షాప్ కూడా తహసిల్దార్ కార్యాలయం సమీపంలోనే ఉంది. కార్యాలయంలో వివిధ పనుల నిమిత్తం వెళ్లే ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. దీనికి తోడు ఎదురుగానే అంబేద్కర్ విగ్రహం పార్క్ ఉండటంతో అంబేద్కర్ విగ్రహంలో నిరసన తెలియజేయడానికి వెళ్లే ప్రజలు, కార్మికులు, ఉద్యోగులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఇక్కడ బ్రాందీ షాపుల్లో బీరు బ్రాందీలు కొనుగోలు చేసిన వ్యక్తులు అంబేద్కర్ విగ్రహం వద్ద కూర్చుని తాగి అక్కడే సీసాలు పగలగొట్టి పడవేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని అరకులోయ మెయిన్ రోడ్డులో ఉన్న మద్యం దుకాణాలను ఎత్తివేసి ఊరికి దూరంగా పెట్టాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై పాడేరు ఐటీడీఏ పీవో, కలెక్టర్లకు ఫిర్యాదు చేస్తున్నట్లు స్థానికులు తెలిపారు. జనసంచారం నిత్యం ఉండే ఐటీడీఏ షాపింగ్ కాంప్లెక్స్ లో వైన్ షాపు ఏర్పాటు చేయడంతో గిరిజనుల నుంచి, గిరిజన సంఘం నాయకుల నుంచి ఐటీడీఏ పిఓ కు ఫిర్యాదు చేయడంతో వెంటనే ఆ షాపును తొలగింపుకు ఆదేశించారు. దీంతో ఆ షాపును కూడా ఊరికి దూరంగా తరలించారు.