వక్ఫ్‌్‌ చట్టసవరణపై కదంతొక్కిన ముస్లిములు

Apr 11,2025 23:52

గుంటూరు ధర్నాలో జనం
ప్రజాశక్తి-గుంటూరు :
వక్ఫ్‌ చట్టానికి కేంద్రం ప్రభుత్వం చేసిన సవరణను వ్యతిరేకిస్తూ గుంటూరులో వక్ఫ్‌ ప్రొటెక్షన్‌ జెఎసి ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. స్థానిక పాతబస్టాండ్‌ సెంటర్‌లో జరిగిన ధర్నాలో వేలాది మంది ముస్లిములు పాల్గొన్నారు. ముఫ్తి ఖాజీ మజిల్‌ ఉలేమా, ముఫ్తి అబ్దుల్‌ బాసిత్‌, ముఫ్తి ఆసిఫ్‌ మాట్లాడుతూ వక్ఫ్‌ చట్టం రాజ్యాంగ విరుద్ధమని, ముస్లిముల ఆర్థిక మూలాలను దెబ్బతీయటానికే ఈ చట్ట సవరణ చేశారని విమర్శించారు. చట్ట సవరణను ఉపసంహరించుకోకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. ధర్నాకు సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్‌, వైసిపి, టిడిపి పార్టీలు ధర్నాకు మద్దతు తెలిపాయి. వైసిపి నాయకులు నూరి ఫాతిమా మాట్లాడుతూ మోడీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుండి మైనార్టీలనూ ఇబ్బందులకు గురి చేస్తూనే ఉందన్నారు. ప్రజల్ని మతాల వారీగా మోడీ విభజిస్తున్నారని విమర్శించారు. నాన్‌ మైనార్టీలకు వక్ప్‌ బోర్డులో చోటు కల్పిస్తే రేపు ఒక మసీదు కట్టుకోవాలన్నా అడుక్కోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పారు. కాంగ్రెస్‌ నాయకులు మస్తాన్‌వలి మాట్లాడుతూ ముస్లిముల మధ్య విభేదాలు సృష్టించటానికి మోడీ ప్రయత్నిస్తున్నారన్నారు. వక్ఫ్‌ సవరణను కాంగ్రెస్‌ ఎట్టి పరిస్థితుల్లో ఓప్పుకోదని చెప్పారు. తూర్పు ఎమ్మెల్యే నసీర్‌ అహ్మద్‌ మాట్లాడుతూ ఈ బిల్లుకు వ్యతిరేకంగా అనేక చర్చలు జరిగాయని, ఒక ముస్లిముగా చట్ట సవరణను తాను పూర్తిగా వ్యతిరేకిస్తున్నానని చెప్పారు. సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజరుకుమార్‌ మాట్లాడుతూ ముస్లిములు ఐక్యంగా ఉండి చట్ట సవరణను తిప్పికొట్టాలన్నారు. ఆవాజ్‌ రాష్ట్ర అద్యక్షులు ఎంఎ.చిష్టీ మాట్లాడుతూ ప్రజలు ఐక్యంగా ఉంటే చట్ట సవరణను వెనక్కి తీసుకోక తప్పదని, ఈ విషయాన్ని గతంలో రైతు చట్టాలపై జరిగిన ఉద్యమమే నిరూపించిందని గుర్తు చేశారు. వక్ఫ్‌ భూముల్ని కార్పొరేట్లకు అప్పగించటానికి చేస్తున్న ఈ యత్నాన్ని ప్రతి ఒక్కరూ అడ్డుకోవాలన్నారు. నిరసనలఓ సిపిఎం నగర కార్యదర్శి కె.నళినీకాంత్‌ పాల్గొని మద్దతు తెలిపారు. వైసిపి నాయకులు జియావూర్‌ రెహ్మాన్‌, ముస్లిమ్‌ సమైక్య వేదిక నాయకులు అబ్దుల్‌ కలాం, ముస్లిమ్‌ ఐక్యవేదిక బాజీ, ఇన్సాఫ్‌ నాయకులు వలి, ముస్లిమ్‌ లీగ్‌ బషీర్‌ అహ్మద్‌ తదితర సంఘాల నాయకులు పాల్గొన్నారు.
ప్రజాశక్తి-పల్నాడు : జిల్లావక్ఫ్‌ చట్ట సవరణను వ్యతిరేకిస్తూ పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో ముస్లిమ్‌ జెఎసి ఆధ్వర్యంలో భారీ శాంతి ర్యాలీ జరిగింది. ప్రకాష్‌నగర్‌లోని ఈద్గా ప్రాంగణం వద్ద ప్రత్యేక ప్రార్థనల అనంతరం ఆర్టీసీ బస్టాండ్‌, మల్లమ్మ సెంటర్‌ మీదుగా ఆర్డీవో కార్యాలయం వరకు కొనసాగింది. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య హక్కులను, మత సామరస్యాన్ని కాపాడాలని అన్ని మతాలను సమానంగా చూడాలని, నల్ల చట్టాలను రద్దు చేయాలని, హిందూ ముస్లిం భారు భారు అని నినాదాలు చేశారు. సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజరు కుమార్‌ మాట్లాడుతూ ముస్లిములను లక్ష్యంగా చేసుకొని మతపరమైన ఉద్రిక్తతలు రెచ్చగొట్టడానికి, ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు ప్రధాని మోడీ ఈ రాజ్యాంగ విరుద్ధ చట్టాన్ని తెచ్చారన్నారు. గతంలో తెచ్చిన మూడు వ్యవసాయ నల్ల చట్టాలకు వ్యతిరేక పోరాటంలో 700 మంది రైతులు అమరులయ్యారని గుర్తు చేశారు. పలువురు ముస్లిమ్‌ నాయకులు మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా ఉన్న 9 లక్షల ఎకరాలకి పైగా వక్ఫ్‌ భూములను కార్పొరేట్‌ శక్తులకు కట్టబెట్టే కుట్రే చట్ట సవరణని చెప్పారు. ఈ చట్టాన్ని ఉపసంహరించుకోకుంటే దేశవ్యాప్తంగా పెద్దఎత్తున ఉద్యమిస్తామన్నారు. అనంతరం ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలోనాయకులు మౌలానా షాహిద్‌ రాజా, ముఫ్తీ రైస్‌ అహమ్మద్‌, రఫీ మౌలానా, మౌలాన బాసిత్‌, మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ షేక్‌ మీరవలి, మాజీ కౌన్సిలర్లు షేక్‌ మస్తాన్‌వలి, అబ్దుల్‌ గఫర్‌, సమైక్యా ఆంధ్ర ప్రదేశ్‌ ముస్లిమ్‌ జెఎసి రాష్ట్ర కన్వీనర్‌ ఎస్‌కె జిలాని మాలిక్‌, ఎంఐఎం మస్తాన్‌, కరిముల్లా, గోల్డ్‌ గఫర్‌, పిడిఎం నాయకులు ఎన్‌.రామారావు, సిఐటియు నాయకులు డి.శివకుమారి, సిలార్‌ మసూద్‌, న్యాయవాదులు షరీఫ్‌, రజాక్‌, ఎల్‌ఐసి ఏజెంట్‌ యూనియన్‌ నాయకులు నభి బాజీ, ఖాదర్‌ బాషా, చాంద్‌బాషా పాల్గొన్నారు.

నరసరావుపేటలో నిరసన

➡️