ఒడిశా అధికారుల దుందుడుకుతనం

  • వివాదాస్పద కొటియా గ్రామాల్లో మైనింగ్‌ తవ్వకాలకు చర్యలు
  • ఎగువ శెంబి పంట భూముల్లో మార్కింగ్‌
  • గిరిజనులు వ్యతిరేకించినా పోలీసులతో దౌర్జన్యం
  • చోద్యం చూస్తోన్న మన రాష్ట్ర ప్రభుత్వం

ప్రజాశక్తి- సాలూరు (పార్వతీపురం మన్యం జిల్లా) : కొటియా గ్రామాల విషయంలో ఒడిశా ప్రభుత్వం మళ్లీ కయ్యానికి కాలు దువ్వుతున్న పరిస్థితి కనిపిస్తోంది. వివాదాస్పద సరిహద్దు గ్రామాల్లో దూకుడు పెంచింది. కొటియా గ్రామాలను అనుసంధానం చేస్తూ రోడ్ల నిర్మాణం చేపడుతోంది. అయితే, ఈ ప్రాంతాల్లో మన రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులను, సంక్షేమ పథకాలను అడ్డుకుంటోంది. తాజాగా ఎగువ శెంబిలోని గిరిజనుల సాగు భూముల్లో మైనింగ్‌ తవ్వకాలకు ఒడిశా అధికారులు స్తంభాలు పాతారు. గతంలో గంజాయిభద్రలో అంగన్‌వాడీ భవన నిర్మాణాన్ని ధ్వంసం చేయడం, మన రాష్ట్ర వైద్య సిబ్బందిని కొటియా గ్రామాల్లోకి రానీయకుండా అడ్డుకోవడం, విద్యుత్‌ మీటర్ల బిగింపు చర్యలను ఆటంకపర్చడం వంటి చర్యలకు పాల్పడ్డారు. ఇటీవల దూళిభద్రలో జలజీవన్‌ మిషన్‌ కింద వాటర్‌ ట్యాంక్‌ నిర్మాణ పనులను అడ్డుకున్నారు. సిమెంట్‌తో సహా ఇతర నిర్మాణ సామగ్రిని, దిగువ శెంబిలో అంగన్‌వాడీ కేంద్రం నుంచి పుస్తకాలను, ఆట వస్తువులను కొటియా పోలీసులు, అధికారులు దౌర్జన్యంగా తీసుకుని వెళ్లిపోయారు. ఒడిశా దూకుడుగా వెళ్తుంటే మన రాష్ట్ర ప్రభుత్వం చూసీచూడనట్లు వ్యవహరించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో వైసిపి ప్రభుత్వం అనుసరించిన వైఖరినే నేటి టిడిపి కూటమి ప్రభుత్వం కూడా అనుసరిస్తుండడంతో గిరిజనుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.

వివాదాస్పద కొటియా గ్రామాల్లో ఒకటైన ఎగువ శెంబి సమీపాన ఉన్న కొండపై మైనింగ్‌ తవ్వకాలకు ఒడిశా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కొండ చుట్టూ గిరిజనుల సాగులో ఉన్న భూముల్లో మైనింగ్‌ తవ్వకాలకు సిద్ధమవుతోంది. ఈ గ్రామానికి చెందిన తాడంగి సనుము, తాడంగి రాజు అనే గిరిజన రైతుల భూముల్లో సరిహద్దు రాళ్లు పాతింది. దీన్ని గ్రామానికి చెందిన గిరిజనులు వ్యతిరేకించినా పోలీసులతో దౌర్జన్యంగా భూముల్లో మార్కింగ్‌ చేశారు. ఈ భూములవైపు రావద్దని గిరిజనులను ఒడిశా పోలీసులు, అధికారులు హెచ్చరిస్తున్నారు. గ్రామ సమీపంలో ఉన్న కొండలో విలువైన ఖనిజం ఉన్నట్లు ఒడిశా ప్రభుత్వం చాలా సంవత్సరాల క్రితం నిర్ధారించింది. ఈ కొండ పక్కన ఉన్న భూములను సాగు చేస్తున్న రైతులకు మన ప్రభుత్వం గతంలో పట్టాలు ఇవ్వడంతో ఒడిశా ప్రభుత్వం ఇంతవరకు ఈ ప్రాంతంలో మైనింగ్‌ తవ్వకాల పనులు చేపట్టలేక పోయింది.

టిడిపి కూటమి ప్రభుత్వ వైఖరిపై అనుమానాలు

మన రాష్ట్రంలో టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలు దాటింది. గడిచిన పది నెలల్లో ఒడిశా ప్రభుత్వం కొటియా గ్రామాల్లో అనేక దుందుడుకు చర్యలకు పాల్పడినా మన ప్రభుత్వం నుంచిగానీ, పార్వతీపురం మన్యం జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధుల నుంచిగానీ ఏ విధమైన స్పందనా లేదు. గత ప్రభుత్వ హయాంలో ఒడిశా దురాగతాలను అప్పటి మంత్రి రాజన్నదొర ఖండించడమో, తప్పు పట్టడమో చేశారు. ప్రస్తుత గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి… కొటియా గ్రామాల విషయంలో నోరు మెదపడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒడిశాలో బిజెపి ప్రభుత్వం అధికారంలో ఉంది. మన రాష్ట్రంలో టిడిపి, జనసేన, బిజెపి కూటమి అధికారంలోకి వచ్చింది. ఇలాంటి అనుకూల పరిస్థితుల్లో కొటియా గ్రామాల వివాదాన్ని పరిష్కరించే దిశగా అడుగులు పడతాయనే స్థానిక ప్రజలు భావించారు. కానీ, ఆ దిశగా ఒక్క అడుగు కూడా పడలేదు. అంతేకాకుండా ఒడిశా ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి గంజాయిభద్ర పంచాయతీ పరిధిలోని ఎగువశెంబి సమీపంలో మైనింగ్‌ తవ్వకాలకు సిద్ధమవుతోంది. మన రాష్ట్ర ప్రభుత్వ మౌనాన్ని అంగీకారంగా భావించి ఒడిశా ప్రభుత్వం మైనింగ్‌ తవ్వకాలకు చర్యలు చేపడుతుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

➡️