కొనసాగుతున్న గోల్డ్‌ మైనింగ్‌

May 17,2024 04:02
  •  పోరాటంతో రైతులకు దక్కిన లీజు అమౌంట్‌
  •  టన్ను మట్టి నుంచి 1.5 నుంచి 2 గ్రాముల బంగారం

ప్రజాశక్తి-కర్నూలు ప్రతినిధి : కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో బంగారం తవ్వకాలు కొనసాగుతున్నాయి. జియో మైసూర్‌ సంస్థకు భూములు ఇచ్చిన రైతులకు లీజు డబ్బులు అందడంతో మైనింగ్‌ కొనసాగుతోంది. భూములు తీసుకున్న తర్వాత ఐదు సంవత్సరాలకు సంబంధించి లీజు మాత్రమే ఆ సంస్థ చెల్లించింది. తవ్వకాలు ప్రారంభం కాలేదనే పేరుతో లీజు చెల్లింపులో తీవ్ర జాప్యం చేస్తూ వచ్చింది. 2023 ఫిబ్రవరి నుంచి తవ్వకాలు ప్రారంభమైనా లీజు బకాయిలు మాత్రం చెల్లించడం లేదు. బకాయిలు చెల్లించాలని రైతులు ఆందోళన చేయడంతో 2023 మార్చి నుంచి లీజు చెల్లిస్తున్నారు.
గోల్డ్‌ మైనింగ్‌ ద్వారా టన్ను మట్టి నుంచి 1.5 నుంచి 2 గ్రాములు బంగారం ఉత్పత్తి అవుతుంది. టన్ను మట్టి నుంచి ముడిసరుకును వేరుచేసి ఇతర ప్రాసెస్‌ పనులు పూర్తి చేయడానికి రూ.మూడు వేల నుంచి రూ.నాలుగు వేల వరకు ఖర్చవుతుంది. ప్రస్తుతం ఆ ప్రక్రియ కొనసాగుతోంది. తుగ్గలి, మద్దికెర మండలాల్లో బంగారు నిక్షేపాలు ఉన్నట్లు జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా సంస్థ 2004లో నిర్ధారించింది. దీంతో మైనింగ్‌ రంగంలో విదేశీ పెట్టుబడులకు కేంద్రం అనుమతి ఇచ్చిన తర్వాత 2005లో జియో మైసూర్‌ సంస్థ తుగ్గలి మండలం జొన్నగిరిలో గోల్డ్‌ మైనింగ్‌ నిర్వహణకు అనుమతి కోరుతూ దరఖాస్తు చేసుకుంది. అప్పటి సిఎం వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో ఇందుకు అనుమతులు మంజూరయ్యాయి. 2014లో ఇందుకు సంబంధించిన కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. 2006లో 700 మంది రైతుల నుంచి 1500 ఎకరాలను లీజుకు తీసుకుంది. ఎకరాకు ఏటా రూ.18,500 చొప్పున లీజు చెల్లించడానికి ఒప్పందం చేసుకుంది. తొలి మూడేళ్లు రైతులకు సక్రమంగానే లీజు చెల్లించింది. ఆ తర్వాత నుంచి లీజు చెల్లించడం మానేసింది. రైతులు పెద్ద ఎత్తున ఒత్తిడి చేయడంతో రెండు సంవత్సరాల లీజు మొత్తాన్ని చెల్లించింది. ఆ తర్వాత నుంచి మళ్లీ లీజు చెల్లించలేదు.2011 నుంచి 2023 వరకు లీజు చెల్లించలేదు. రైతులు పెద్ద ఎత్తున మైనింగ్‌ పనులను అడ్డుకోవడంతో గతేడాది మార్చికి మొత్తం లీజును చెల్లించింది. తిరిగి మైనింగ్‌ పనులు ప్రారంభమయ్యాయి. 2006 నుంచి ప్రతి ఏడాది లీజు ప్రతిపాదన భూములు తీసుకుంది. ఆ తర్వాత 2013 నుంచి 30 సంవత్సరాలకు భూములను లీజుకు తీసుకుంది.

రైతుల నుంచి భూముల కొనుగోలు
మొత్తం 1500 ఎకరాల్లో 150 ఎకరాలను రెండు నెలల క్రితం ఎకరా రూ.13 లక్షలకు కొనుగోలు చేసింది. జియో మైసూర్‌ పేరు మీద లీజు ఉండడంతో రైతులు ఆ భూముల మీద బ్యాంకుల్లో రుణాలు తీసుకునే అవకాశం కూడా లేకుండాపోయింది. ఆ భూముల రైతులకు ప్రభుత్వం నుంచి ప్రయోజనాలు కూడా పొందే వీలులేకుండా అయింది. కంపెనీలో ఉద్యోగం ఇస్తామని, లీజు చెల్లిస్తామని, గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తామని చెప్పడంతోనే కంపెనీకి భూములు ఇచ్చామని రైతులు తెలిపారు. ప్రత్యక్షంగా 300 మందికి, పరోక్షంగా వెయ్యి మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆ సంస్థలో అప్పట్లో చెప్పింది.

➡️