పండగలా టీచర్స్‌, పేరెంట్స్‌ మీట్‌

Dec 7,2024 21:36

పాఠశాలల్లో కోలాహలం

తల్లిదండ్రులకు ఆటల పోటీలు

ఆకట్టుకున్న పూర్వ విద్యార్థుల ప్రసంగాలు

విద్యార్థుల ఉపన్యాసాలు

ఎదుగుదలకు చదువే మార్గం : మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌

పిల్లలతో సహపంక్తి భోజనం చేసిన కలెక్టర్‌

ప్రజాశక్తి-జామి, విజయనగరంటౌన్‌  :  రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించిన విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనం శనివారం పండగ వాతావరణంలో జరిగింది. పాఠశాలలను రంగ వల్లులతో విద్యార్థులంతా సుందరంగా అలంకరించారు. మామిడితోరణాలు, అరటి మొక్కలతో స్వాగత తోరణాలు ఏర్పాటుచేశారు. పాఠశాలకు వచ్చిన తల్లిదండ్రులకు విద్యార్థులు, ఉపాధ్యాయులు సాదర స్వాగతం పలికిన నుంచి మధ్యాహ్నం పసైందన భోజనం వరకు పలు కార్యక్రమాలు నిర్వహించారు. పూర్వ విద్యార్థులు తమ అనుభవాలను, పాఠశాలతో ఉన్న అనుబంధాలను గుర్తు చేసుకున్నారు. విద్యార్థుల ప్రసంగాలు ఆకట్టుకున్నాయి. తల్లిదండ్రులకు ఈ సందర్భంగా ఆటల పోటీలు నిర్వహించారు.

ఎదుగుదలకు చదువే మార్గం

చదువు వ్యక్తి ఎదుగుదలకు దోహదం చేస్తుందని రాష్ట్ర ఎంఎస్‌ఎంఇ శాఖామంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ అన్నారు. జామి మండలం కుమరాం జిల్లా పరిషత్‌ పాఠశాలలో శనివారం నిర్వహించిన తల్లితండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ కలయికకు మంత్రి శ్రీనివాస్‌ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, చదువకోవడం ద్వారా ఉన్నత స్థానాన్ని సాధించవచ్చునని అన్నారు. చదువుతోబాటు ఆటలు కూడా పిల్లలకు ఎంతో ముఖ్యమని, కొంత సమయాన్ని ఆటలకోసం కూడా కేటాయించాలని కోరారు. సామాజిక స్థితిని మెరుగుపర్చే అవకాశం నేటి యువత చేతుల్లోనే ఉందన్నారు. శక్తివంతమైన యువతను రూపొందించే బాధ్యత తల్లితండ్రుల్లో ఉందన్నారు. పాఠశాల ప్రహరీగోడ, డైనింగ్‌ హాల్‌ నిర్మాణానికి, కంప్యూటర్‌ ల్యాబ్‌ మంజూరుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. డిఇఒ యు.మాణిక్యంనాయుడు మాట్లాడుతూ, మంచి సమాజాన్ని రూపొందించేది పాఠశాలేనని అన్నారు. తల్లితండ్రులు తరచూ పిల్లల బాగోగులను, వారి చదువును గమనిస్తుండాలని సూచించారు. విద్యార్థులు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని, బాధ్యతతో చదవి లక్ష్యాన్ని సాధించాలని కోరారు. కార్యక్రమంలో జెడ్‌పిటిసి సభ్యులు గొర్లె సరయు మాట్లాడారు. ముందుగా పాఠశాల హెచ్‌ఎం చిట్టి పద్మావతి అధ్యక్షోపన్యాసం చేస్తూ, పాఠశాల ప్రగతిని వివరించారు. తల్లితండ్రులతో ముఖాముఖి నిర్వహించి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. పాఠశాల పూర్వ విద్యార్థి, ఆర్‌డబ్ల్యూఎస్‌ ప్రాజెక్ట్స్‌ డిఇ యడ్ల గోవిందరావు మాట్లాడుతూ, తమ అనుభవాలను, పాఠశాలతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అనంతరం మంత్రి చేతులమీదుగా విద్యార్థుల హెల్త్‌ కార్డులను, ప్రోగ్రెస్‌ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులకు ఆటల పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో డిప్యూటీ ఇఒ కెవి వెంకటరమణ, మండల ప్రత్యేకాధికారి కుమారస్వామి, ఎంఈఓలు జె.జయశ్రీ, గంగరాజు, ఎంపిడిఒ గంట అప్పలనాయుడు, సర్పంచ్‌ పిన్నింటి ఆదిలక్ష్మి, ఎంపిటిసి కంది పద్మావతి, పాఠశాల యాజమాన్య కమిటీ ఛైర్మన్‌ బండారు శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.

విజయనగరం మండలం మరిచర్ల జిల్లా పరిషత్‌ హై స్కూలులో జరిగిన కార్యక్రమానికి కలెక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ హాజరయ్యారు. పిల్లల విద్య, ఆరోగ్య పరిస్థితుల పై సమగ్ర ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌ను ఉపాధ్యాయులు ప్రతి తల్లిదండ్రులకు వివరించారు. తల్లులకు రంగోళీ పోటీలు, తండ్రులకు టగ్‌ అఫ్‌ వార్‌ పోటీలు నిర్వహించారు. మెడికల్‌ క్యాంపు నిర్వహించి తల్లి దండ్రులకు, పిల్లలకు ఆరోగ్య పరీక్షలు చేసి, అవసరమగు మాత్రలు పంపిణీ చేసారు. అనంతరం సదస్సు నిర్వహించి మధ్యాహ్న భోజన కార్యక్రమంలో సహపంక్తి భోజనాలు చేసారు.

భవిష్యత్తుకు చదువే ఆధారం : కలెక్టర్‌

అనంతరం జరిగిన సభలో కలెక్టర్‌ అంబేద్కర్‌ మాట్లాడుతూ పిల్లల సమగ్ర ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌ లలో వారి చదువు, ఆరోగ్యం, వారి ఆసక్తి , తదితర అంశాలకు చెందిన సమాచారాన్ని తల్లి దండ్రులకు చెప్పేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహించిందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్నో రకాల పరీక్షలు నిర్వహించి ఉన్నత అర్హతలు సాధించిన ప్రతిభ కలిగిన వారే ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారని, తల్లిదండ్రులు దీన్ని గుర్తించి తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలని కోరారు. ప్రతి ఒక్కరూ కనీసం డిగ్రీ వరకు చదవాలని చదువుకుంటే ఉన్నత స్థాయి ఉద్యోగం పొందవచ్చని హితవు పలికారు. పాఠశాల ప్రధానోపాధ్యయురాలు జి.సుజాత మాట్లాడుతూ తల్లిదండ్రులు వారి పిల్లల్ని బడి వరకు పంపితే ఉపాధ్యాయులు వారి భవిష్యతును చూసుకుంటారని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్‌ తుమ్మగంటి రమా కుమారి మాట్లాడారు. పెద్దలే పిల్లలుగా మారిన వేళ పాఠశాల ఆవరణలో తల్లులకు రంగోలి పోటీలు, తండ్రులకు టగ్‌ అఫ్‌ వార్‌ పోటీలు నిర్వహించారు. తల్లి దండ్రులు పిల్లలుగా మారి ఉత్సాహంగా ఈ పోటీలలో పాల్గొన్నారు. పిల్లల తల్లులే కార్యక్రమానికి వ్యఖ్యాతలుగా వ్యవహరించగా, పూర్వ విద్యర్థులైన తల్లి దండ్రులు చేసిన నృత్యాలకు పిల్లలు మురిసిపోయారు. కార్యక్రమంలో ఎంఇఒ సత్యవతి, గ్రామ పెద్దలు తుమ్మగంటి రామారావు, కొసర శివ, తల్లి దండ్రులు పాల్గొన్నారు. ఉజ్వల భవిష్యత్తుకు తల్లితండ్రులు, ఉపాధ్యాయులే విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మూల స్తంభాలని నగరపాలక సంస్థ సహాయ కమిషనర్‌ సిహెచ్‌ తిరుమలరావు అన్నారు. శనివారం మెగా పేరెంట్స్‌ అండ్‌ టీచర్స్‌ దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక చిక్కాల వీధిలో ఉన్న రామకష్ణ ప్రాథమిక పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులకు ముగ్గుల పోటీలతో పాటు, వివిధ అంశాలలో పోటీలను నిర్వహించారు. విజేతలకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయిని ఫ్లారెన్స్‌ నైటింగేల్‌, ఉపాధ్యాయులు గుడివాడ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

➡️