మాట్లాడుతున్న యుటిఎఫ్ నాయకులు
ఎస్‌ఎంసి తీర్మానాలపై ఉపాధ్యాయులపై ఒత్తిడి : యుటిఎఫ్
ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్
ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలను కుదించి, వాటిని ఎత్తివేయాలని ప్రభుత్వం పన్నాగం పన్నుతోందని యుటిఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు లండ బాబూరావు, బమ్మిడి శ్రీరామ్మూర్తి ఒక ప్రకటనలో విమర్శించారు. ఇందులో భాగంగానే అత్యవసరంగా ఎస్‌ఎంసి తీర్మానాలను ఆన్‌లైన్ చేయాలని ఉపాధ్యాయులపై ఒత్తిడి తీసుకొస్తున్నారని తెలిపారు. ఈ పనిని పాఠశాల ప్రధానోపాధ్యాయులు కంటే విద్యాశాఖ అధికారులే చేసుకుంటే ఉపాధ్యాయులకు ఉపశమనం కలుగుతుందని అభిప్రాయపడ్డారు. ఇప్పటికే ఎస్‌ఎంసి తీర్మానాలు మండల, జిల్లా విద్యాశాఖ అధికారులకు పంపించామని, మళ్లీ ఇప్పుడు ఎస్‌ఎంసి తీర్మానాలు చేసి అప్‌లోడ్ చేయాలని ఒత్తిడి చేయడం తగదని పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో ఒకటి నుంచి ఐదు తరగతుల ప్రాథమిక పాఠశాల నిర్వహించాలని సూచించారు. గ్రామ పంచాయతీ కేంద్రాల్లో మోడల్ ప్రైమరీ స్కూల్ ఏర్పాటు చేసి తరగతికి ఒక ఉపాధ్యాయుడు చొప్పున ఐదు తరగతులకు ఐదు గదులు మౌలిక వసతులతో ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. అప్పుడే ప్రాథమిక విద్య బలోపేతమవుతుందని తెలిపారు. మోడల్ ప్రైమరీ స్కూల్ పేరుతో పంచాయితీలో ఉన్న స్కూళ్లు అన్నింటినీ ఫౌండేషన్ పాఠశాలలుగా మార్చే ఆలోచన సరికాదని పేర్కొన్నారు. ఈ విధానం ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలకు ఊతమిచ్చేదిగా ఉందని తెలిపారు. ప్రస్తుతం ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలలను అవకాశమున్న చోట 60 మంది విద్యార్థులుంటే హైస్కూల్‌గా అప్‌గ్రేడ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రాథమికోన్నత పాఠశాలలను స్కూల్ అసిస్టెంట్లతో యధావిధిగా కొనసాగించాలని కోరారు. కూటమి ప్రభుత్వం విద్యారంగంలో సంస్కరణల పేరుతో ప్రాథమిక విద్యారంగాన్ని బలోపేతం చేయాలే తప్ప బలహీనపరిచే ప్రయత్నం చేయొద్దని సూచించారు.