ఎన్‌టిఆర్‌ వైద్యసేవలో..నిరసన గళం..!

17 ఏళ్లుగా ఫీల్డ్‌ సిబ్బంది సమస్యలకు పరిష్కారం కరువు
కూటమి ప్రభుత్వంలోనూ మార్పు శూన్యం
నేడు, 24వ తేదీన జిల్లా సమన్వయకర్తల కార్యాలయాల వద్ద నిరసనలు
రెండు జిల్లాల్లో 124 మంది వరకూ వైద్యమిత్రలు, ఇతర సిబ్బంది అరకొర జీతంతో అవస్థలు..
క్యాడర్‌ కేటాయింపు నిల్‌
ప్రభుత్వ కాంట్రాక్ట్‌ ఉద్యోగులుగా గుర్తింపు, కేడర్‌ అమలుకు డిమాండ్‌
ప్రజాశక్తి – ఏలూరు ప్రతినిధి
ఎన్‌టిఆర్‌ వైద్య సేవ ట్రస్ట్‌లో పనిచేస్తున్న ఉద్యోగులు పోరుబాట పట్టారు. 17 ఏళ్లుగా కొనసాగుతున్న సమస్యలను పరిష్కరించి తమకు న్యాయం చేయాలని సోమవారం, 24వ తేదీన రెండు రోజుల పాటు శాంతియుత నిరసనలకు దిగుతున్నారు. జిల్లా సమన్వయకర్తల కార్యాలయాల వద్ద నిరసనలు కొనసాగించి వినతిపత్రాలు ఇవ్వనున్నారు. గతంలో ఆరోగ్యశ్రీ, ప్రస్తుతం ఎన్‌టిఆర్‌ వైద్యసేవ ట్రస్ట్‌లో పనిచేస్తున్న ఉద్యోగుల పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. ఎన్‌టిఆర్‌ వైద్యసేవలో ఉద్యోగులుగా వైద్య మిత్రలు, టీం లీడర్లు, జిల్లా మేనేజర్లు, ఆఫీస్‌ అసోసియేట్లు, సిసి మానటరింగ్‌ డిఇఒలు పనిచేస్తున్నారు. ఏలూరు జిల్లాలో 69 మంది, పశ్చిమలో 55 మంది పనిచేస్తుండగా రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది పనిచేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుత పరిస్థితులో ఎన్‌టిఆర్‌ వైద్యసేవలో అందిస్తున్న వైద్యసేవలు ప్రజలకు అత్యంత కీలకంగా మారాయి. వైద్యం ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడంతో డయాలసిస్‌, గుండె, ఎముకలకు సంబంధించిన ఆనేక ఆపరేషన్లు, కేన్సర్‌తోపాటు అనేక రోగాలకు వైద్యసేవా ట్రస్ట్‌ ద్వారానే వైద్యసేవలు జనం పొందుతున్న పరిస్థితి కొనసాగుతోంది. గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పేరుతో ఈ పథకం కొనసాగించింది. ఎన్‌టిఆర్‌ వైద్యసేవా ట్రస్ట్‌ కింద ఏలూరు జిల్లాలో 107 ఆసుపత్రుల్లో వైద్యసేవలు అందుతుండగా, వీటిలో 31 ప్రయివేటు నెట్‌వర్క్‌ ఆసుపత్రులు ఉన్నాయి. పశ్చిమలో 73 ఆసుపత్రుల్లో ఎన్‌టిఆర్‌ వైద్యసేవలు అందుతుండగా 23 వరకూ ప్రయివేటు ఆసుపత్రులు ఉన్నాయి. ఎన్‌టిఆర్‌ వైద్యసేవ సక్రమంగా అమలు చేయడంలో అందులో పనిచేస్తున్న ఉద్యోగులదే కీలక పాత్ర. అలాంటి ఉద్యోగుల పరిస్థితి మాత్రం అత్యంత ఘోరంగా ఉందని చెప్పొచ్చు. ఎన్‌టిఆర్‌ వైద్యసేవలో చాలామంది 17 ఏళ్లుగా పనిచేస్తున్నారు. ఉద్యోగులకు ఇచ్చే జీతం మాత్రం రూ.15 వేలు కాగా, కటింగ్‌లు పోను చేతికొచ్చే జీతం రూ.13,080 మాత్రమే. ప్రస్తుతం కూరగాయల నుంచి నిత్యావసర ధరల వరకూ ఆకాశాన్ని తాకుతున్నాయి. స్కూల్‌ ఫీజులు వంటివి అందనంత ఎత్తులో ఉన్నాయి. అయినప్పటికీ ఎన్‌టిఆర్‌ వైద్యసేవ ఉద్యోగుల జీతాలు మాత్రం పెరగడం లేదు. దీంతో ఆ శాఖ రాష్ట్ర ఉన్నతాధికారులను కలిసి విన్నవించుకున్నా సమస్యలకు పరిష్కారం దొరకని పరిస్థితి నెలకొంది. దీంతో తమ సమస్యల పరిష్కారం కోసం ఎన్‌టిఆర్‌ వైద్యసేవా ఉద్యోగులు నిరసన గళం విప్పారు. కనీస డిమాండ్లు సైతం పరిష్కరించలేరా?ఎన్‌టిఆర్‌ వైద్యసేవలో పనిచేస్తున్న ఉద్యోగులు గొంతెమ్మ కోర్కెలు ఏమీ కోరడం లేదు. 17 ఏళ్లుగా పనిచేస్తున్న తమను ప్రభుత్వ కాంట్రాక్ట్‌ ఉద్యోగులుగా గుర్తించి జిఒ ఏడు ప్రకారం కేటగిరి-1 డిపిఒ (డిజిటల్‌ ప్రొసెసింగ్‌ ఆఫీసర్‌) క్యాడర్‌ అమలు చేయాలని కోరుతున్నారు. ఉద్యోగులు ఎవరైనా చనిపోతే వారి కుటుంబాలకు రూ.15 లక్షలు ఎక్స్‌గ్రేషియా, పదవీ విరమణ బెనిఫిట్స్‌గా రూ.పది లక్షలు ఇవ్వాలని, ప్రభుత్వ ఉద్యోగాల్లో వెయిటేజ్‌ కల్పించాలని కోరుతున్నారు. కనీస వేతనాలు అమలు చేయాలని, ఉద్యోగులకు అంతర్గత ప్రమోషన్లు కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఎన్‌టిఆర్‌ వైద్యసేవలో పనిచేస్తున్న ఉద్యోగులు అడుగుతున్న డిమాండ్లు చాలా సాధారణమైనవని చెప్పొచ్చు. ఉద్యోగ భద్రత కల్పించాలని కోరడం ఏవిధంగా తప్పు అవుతుందో ప్రభుత్వం చెప్పాల్సి ఉంది. ఎన్‌టిఆర్‌ వైద్యసేవలో వైద్యం పొందే రోగులు చేరినప్పటి నుంచి డిశ్ఛార్జ్‌ వరకూ అన్ని పనులూ ఉద్యోగులే నిర్వహిస్తుంటారు. ఎంతోమంది రోగులకు సహయకారిగా ఉంటూ అన్ని విషయాలూ తెలియపరుస్తూ అవగాహన కల్పిస్తారు. సామాన్య ప్రజానీకంతో పనిచేసే కీలకమైన ఉద్యోగులు వీరు. అలాంటి ఉద్యోగులకు సంబంధించిన కనీస సమస్యలను పరిష్కరించడం ప్రభుత్వ బాధ్యతగా చెప్పొచ్చు. ఇప్పటికైనా ప్రభుత్వం ఎన్‌టిఆర్‌ వైద్యసేవ ఉద్యోగులతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాల్సి ఉంది.

➡️